శివుడి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఒకే దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం

0
8276

శివుడు తన ఆత్మ శక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో 12 చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఇక సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయని చెబుతారు. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. అయితే ఒకే దగ్గర శివుడి యొక్క జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఉన్న ఏకైక అద్భుత పుణ్యక్షేత్రం శ్రీశైలం. మరి ఎన్నో అద్భుత రహస్యాలకు నిజమైన శ్రీశైలం లో వెలసిన శివుడికి మల్లికార్జునస్వామి అని, అమ్మవారికి భ్రమరాంబిక దేవి అనే పేరు ఎందుకు వచ్చింది? శ్రీశైలం లో దాగి ఉన్న రహస్యాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Srisailam And Its History

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కర్నూలుకు తూర్పుదిశలో సుమారు 70 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో శ్రీశైలమునందు సముద్రమట్టానికి 458 మీ. ఎత్తున కొండపైన వెలసిన అతి పురాణ ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ వెలసిన శివుడి పేరు మల్లికార్జునుడు, అమ్మవారి పేరు భ్రమరాంబిక. ఈ ఆలయ పురాణానికి వస్తే, కృతయుగంలో శిలాదుడు అనే ఋషి సంతానం కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ఆ ఋషి తపస్సుకి మెచ్చి ప్రత్యేక్షమై పర్వత, నందీశ్వరులు అనే ఇద్దరు పుత్రులను ప్రసాదించాడు. వారు ఇద్దరు పెరిగి శివుడికి సేవ చేయడమే పరమ పవిత్రమని భావించి పరమేశ్వరుని గూర్చి తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు శివుడు వారి భక్తికి మెచ్చి వారికి దర్శన భాగ్యాన్ని ప్రసాదించి వరం కోరుకోమని అనగా, నందీశ్వరుడు స్వామి నిరంతరం తనపైన యానాం చేయాలనీ కోరుకోగా, పర్వతుడు నిరంతరం శ్రీ చరణ స్పర్శ కోసం తనని పర్వతంగా మర్చి తనపైన శాశ్వతంగా శివుడు నివసించాలని కోరుకున్నాడు. ఈవిధంగా శివుడు నందీశ్వరుడిని తన వాహనంగా చేసుకొని, శ్రీపర్వతం అనే పేరుతో పర్వతుణ్ణి రూపొందించి దానిపైన శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకున్నాడు. ఆ పర్వతం శ్రీ పర్వతమని, శ్రీ గిరి అని, అదియే శ్రీశైలం గా రూపాంతరం చెందింది అని స్థల పురాణం.

Srisailam And Its History

ఇక శివుడికి మల్లికార్జున స్వామి అనే పేరు రావడానికి ఒక పురాణం ఉంది. ఇక విషయంలోకి వెళితే, పూర్వం శ్రీశైలానికి దగ్గరలోనే కృష్ణానది తీరాన చంద్రాపురం అనే ఊరు ఊరు ఉండగా. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి చంద్రవతి అనే అందమైన కుమార్తె ఉంది. ఒకరోజు ఆ రాజు అన్ని మరచి తన కూతురినే బలాత్కారం చేయబోగా ఆమె తన తండ్రిని దూషించి అంతఃపురం నుండి బయటకి వచ్చి శ్రీశైలం లోని అడవుల్లోకి వచ్చింది. అయితే మత్తు వదిలి తన తప్పు తెలుసుకున్న ఆ రాజు కృష్ణ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అడవుల్లో పశువులను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తుండేది. అయితే రోజు ఒక ఆవు రోజు పాలు ఇవ్వకపోవడాన్ని గమనించిన ఆమె ఒక రోజు ఆ ఆవు వెంట రహస్యంగా వెళ్ళింది. ఆ ఆవు ఒక పుట్ట దగ్గర ఉన్న రంద్రం దగ్గర పాలు కారుస్తుండం చుసిన ఆమె ఆశ్చర్యపోయి ఆ తరువాత పుట్ట దగ్గరికి వెళ్లి చూడగా అందులో ఒక శివలింగం ఉంది. ఆ రోజు రాత్రి శివుడు ఆమె కలలో కనిపించి లింగరూపంలో వెలిసిన శివుడికి మొట్ట మొదటగా చంద్రవతి ఇక్కడ ఆలయాన్ని నిర్మించింది. ఇక రోజు ఆమె శివుడికి మల్లెపూలతో పూజిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యేక్షమై వరం కోరుకోమని అనగా, స్వామి నీవు రోజు నా చేత మల్లిక పుష్పాలతో ఆరాధింపబడుతున్నావు కనుక నేటి నుండి నీవు మల్లికార్జున లింగంగా పిలువబడాలని కోరింది. ఇలా అప్పటినుండి శివుడు మల్లికార్జున స్వామిగా శ్రీశైలంలో పూజలను అందుకుతున్నాడని పురాణం.

Srisailam And Its History

ఇక అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు ఎందుకు వచ్చినదని అంటే, పూర్వం రమేశ్వరుడి సౌమ్యతకు, మనోహర రూపానికి పరవశించి పోయి వివాహమాడాలనుకున్నది భ్రమరాంబిక దేవి. అయితే అక్కడే భ్రమిస్తున్న తేన టీగను చూపి అది విశ్రమించే వరకు దానిని అనుసరిస్తే వివాహమాడతాను అని శివుడు చెప్పడంతో దానివెనుక ఆ దేవి పరిగెత్తింది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాల పాటు పరిగెత్తాల్సి వచ్చింది. ఇక చివరకు ఆ భ్రమరం ఇక్కడ విశ్రాంతి తీసుకుంది. అప్పుడు శివుడు ఒక వృధ్దినిగా వచ్చి, చాలాకాలం గడిచినందున వృధ్దిడిని అయ్యాను నేను వివాహానికి తగను అని చెప్పగా, వ్యక్తి ఆత్మ సౌందర్యాన్ని ఆదరించే ఆమె అభ్యంతరం లేదని వివాహానికి అంగీకరించింది. ఇలా భ్రమరాన్ని అనుసరించడం వల్ల ఆమెకు భ్రమరాంబిక అని పేరు స్థారకమైంది. ఇప్పటికి కూడా భ్రమర ఝంకారం భ్రమరాంబిక దేవి కొలువై ఉన్న గుడి వెనుక మనం వినవచ్చును అని భక్తుల నమ్మకం.

Srisailam And Its History

ఇక శ్రీశైలం అడవుల్లో ఉన్న అద్భుతాలు, అక్కడి ఇతర ఆలయాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం నుండి శ్రీశైలానికి గల కాలి బాట మార్గంలో దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది. అయితే శ్రీశైలం నుండి దోర్నాలమార్గంలో 11 కి.మీ. ప్రయాణించి అక్కడి నుండి ఎడమవైపు నెక్కంటి, పాలుట్ల అటవీమార్గంలో 10 కి.మీ. ప్రయాణిస్తే శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం చేరుకోవచ్చు. ఈ ఆలయం దగ్గర జన సంచారం అనేది ఉండదు. అయితే పూర్వం ఇక్కడ కోయలు నివసించేవారని చెబుతారు. ఇక ఈ ఆలయం సముద్రమట్టానికి 2128 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడినదిగా తెలియుచున్నది. ఈ చిన్న పురాతన దేవాలయం గతంలో ప్రముఖ శక్తిక్షేత్రంగా, సిద్ద క్షేత్రంగా విరాజిల్లింది. ఈ ఆలయంలో చతుర్భుజాలను కలిగి ఉన్న ఇష్టకామేశ్వరి దేవి కొలువై ఉంది. అయితే రెండు చేతులతో కలువ మొగ్గలను, క్రింది కుడి చేతిలో రుద్రాక్ష మాలను, ఎడమచేతిలో శివలింగాన్ని ధరించి ఉన్న ఈ దేవి రుద్రాక్ష మలాలనే కర్ణాభరణాలుగా, కంఠా భరణాలుగా ధరించి ఉంటుంది. ఈ విధంగా కొలువ ఉన్న ఈ అమ్మవారికి ప్రత్యేక దీపారాధన చేసి పొంగలిని నివేదిస్తారు. అయితే కామేశ్వరీదేవికి, ఇష్టకామేశ్వరీదేవికి ఏవిధమైన పోలికలు ఉండవు. ఇద్దరు కూడా వేరు వేరు దేవతలు. ఈ రకమైన ఇష్టకామేశ్వరి దేవి విగ్రహం ఇక్కడ తప్ప భారతదేశంలో మరెక్కడా కూడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి ఎదురుగా ఒక వాగు ఉత్తర వాహానియై ప్రవహిస్తుంది.

Srisailam And Its History

ఇప్పటివరకు మనలో చాలామందికి శ్రీశైలం లో మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక దేవాలయాలకు వాయువ్య భాగాన ఘంఠ మఠం అనే ఆలయం ఉందని తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడి ఆశ్చర్యాన్ని కలిగించే ఘంఠ మఠం అనే ఒక పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి, ఇక్కడి మహత్యం గురించి తెలిసినవారు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఇక్కడ ఆణువణువూ ఒక అద్భుతమే అని చెప్పాలి. దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఘంఠ మఠం గురించి తెలిసిన సమాచారం ప్రకారం, పూర్వం ఘంటా కర్ణుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మ్రోగించారని పురాణాలు చెబుతున్నాయి. ఆలా ఆ తరువాత ఎందరో మహారాజులు కూడా ఇక్కడ కొత్తగా ఘంటలని ప్రతిష్టించారు. ఇప్పుడు మనకి దర్శనం ఇచ్చే ఘంటా కూడా 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతున్నారు. ఇక్కడ ఒక గుంట ఉండగా అందులో నిత్యం నీరు ఎప్పుడు ఉంటుంది. పూర్వం ఒకరు ఆ గుంట నుండి నీరు తీసుకువచ్చి ఆలయంలో ఉన్న సిద్దేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ ఉంటూ ఒకరు ఘంటను మ్రోగిస్తూ ఉండాలి. ఇలా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇలా ఘంటను మ్రోగిస్తూ సిద్దేశ్వర లింగాన్ని అభిషేకించినవారికి ఆకాశగమనం అనే విద్య లభిస్తుందని అంటే ఇలా ముగ్గురు ఏకకాలంలో చేస్తే ఆ ముగ్గురికి కూడా అష్టసిద్దులలో ఒకటైన గగనయాన సిద్ది కలుగుతుందని పురాణం. ఇంకా ఇక్కడ చిన్న నిర్మాణంలో ఒక దేవతారూపం ఉండగా, ఆ పక్కనే ఒక సాధకుడు ధ్యానిస్తున్నట్లుగా ఉండే విగ్రహం ఉంటుంది. ఇక్కడ సిద్ది, మోక్షం, పూర్వ జన్మరాహిత్యం పొందుటకు సాధువులు ఈ మఠానికి వచ్చేవారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది సిద్ది పొందినట్లుగా కొందరి నమ్మకం. ఇక్కడ ఘంటమఠం లో మొత్తం నాలుగు శివలింగాలు ప్రతిష్టించి ఉన్నాయి. ఇలా పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలసిన ఈ మహిమ గల ప్రాంతంలో అఘోరాలు కూడా వచ్చి ఎక్కువగా పూజలు చేసేవారని కొందరు చెబుతున్నారు.

Srisailam And Its History

ఇక శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి దగరలో సాక్షి గణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే గణపతి విగ్రహం ఏదో వ్రాస్తున్న భంగిమలో కూర్చొని ఉన్న విధంగా భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. ఇక సాక్షి గణపతి ప్రత్యేకత ఏంటంటే, శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించిన భక్తులను స్వామి తన చిట్టాలో వ్రాసుకొని కైలాసంలో ఉన్న పరమశివుడికి నివేదించి సాక్షముగా ఉంటాడని ప్రతీతి. అంటే శ్రీశైలానికి వచ్చి శివుడిని దర్శనం చేసుకున్న భక్తులకి కైలాసా ప్రవేశానికి అనుమతి లభిస్తుందని అప్పుడు శ్రీశైలానికి వచ్చిన భక్తులకి గణపతి సాక్షిగా ఉంటాడని చెబుతారు. ఇలా భక్తులు శ్రీశైలానికి వచ్చారని గణపతి సాక్ష్యంగా ఉంటాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి అనే పేరు వచ్చినదని అంటారు.

Srisailam And Its History

శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల నుండి 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో పడవలో ప్రయాణించి కొండరాళ్ళపైకి దిగి వెళితే అక్క మహాదేవి గుహలను చేరుకుంటారు. ఈ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక దారి ఉంది. ఈ సొరంగం చివరలో శివలింగాకారంలో ఏర్పడిన శిలారూపం ఉంది. దీనినే సహజ శివలింగం అని అంటారు. అక్కమహాదేవి ఈ శివలింగాన్ని పూజించనది చెబుతారు. శ్రీశైలానికి వెళ్లి మల్లికార్జునస్వామిని ధ్యానిస్తున్న అక్కమహాదేవి దట్టమైన అరణ్యప్రాంతంలో ఉన్న శ్రీశైలానికి వచ్చి స్వామిని పూజిస్తూ ఒక గుహలో ఇక్కడే మల్లికార్జునస్వామిలో ఐక్యం అయిందని పురాణం. శివుడి మహాభక్తురాలైన అక్క మహాదేవి కన్నడంలో దాదాపుగా 400 కి పైగా వచనాలు వ్రాసినట్లుగా గుర్తించారు. ఈమె తన అన్ని రచనలో కూడా చెన్న కేశవా అనే పదముతో ముగించినట్లుగా చెబుతారు. అక్కమహాదేవి విగ్రహము ఇప్పటికి మల్లికార్జుని గుడిలో ఉన్న మర్రిచెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది. అయితే భూమికి 200 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు గల ఇక్కడి సహజ శిలాతోరణం అద్భుతమని చెప్పాలి. ఇక భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన గొప్ప రచయిత్రి. ఆ పరమ శివుడిని తన భర్తగా భావించిన గొప్ప భక్తురాలు అక్కమహాదేవి.

Srisailam And Its History

శ్రీశైలం వెళ్ళే యాత్రికులకు చిట్టచివరి మజిలీ శిఖరదర్శనం. శైలం మొత్తంలో ప్రత్యేకమైనది, శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపై నున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

Srisailam And Its History

శ్రీశైల పర్వతాన్ని భూమి మొత్తానికి నాభి అని అంటారు. అయితే కృతయుగంలో హిరణ్యకశిపుడి పూజామందిరం ఈ క్షేత్రం, తేత్రాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి ఇక్కడ సహస్ర లింగాన్ని ప్రతిష్టించి పూజించారు. ద్వారపాయుగంలో పాండవులు, ద్రౌపతి ఈ క్షేత్రంలో శివలింగాలను ప్రతిష్టించి పూజించారు. వీరు ప్రతిష్టించిన శివలింగాలు ఇప్పటికి దర్శనమిస్తున్నాయి. ఇక కలియుగంలో మానవుల కోర్కెలు తీర్చేందుకు మహాశివుడు ఇక్కడే కొలువై ఉండగా ఇలా నాలుగు యుగాల చరిత్ర కలిగిన ఏకైక అద్భుత పుణ్యక్షేత్రం శ్రీశైలం.