ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో భోజనం కూడా సరిగ్గా చేసేందుకు టైం లేని పరిస్థితి నెలకొంది. ఆరోగ్యంగా ఉండడానికి, సంతృప్తి చెందడానికి కాకుండా కేవలం కడుపునిండడానికి మాత్రమే భోజనం చేస్తున్నారు. చక చక భోజనం చేసామా మళ్ళీ పని మొదలుపెట్టామా అన్న విధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే భోజన శైలి ఎలా ఉంది అన్నది ఎవరూ గమనించడం లేదు. వేళకు ఇంత తినడం ముఖ్యం అది ఎలాంటి ఆహరం, ఎలా తింటున్నాం అనేది పట్టించుకోవడం లేదు. ఇక కొంత మంది రోజంతా నీరు తాగుతారు. నీళ్లు తాగడం మంచిదే కానీ సమయం సందర్భం లేకుండా తాగడం మంచిది కాదు. ముఖ్యంగా భోజన సమయాల్లో నీరు తాగుతారు. మరికొంతమంది భోజనం తరవాత ఎక్కువ నీళ్లు తాగుతారు.
అయితే నాలుగు ముద్దలు తిన్న వెంటనే ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల అది అనారోగ్యానికి కారణమవుతుందట. అలాగే భోజనం ముందు కూర్చున్నప్పుడు కూడా నీళ్ళు ఎక్కువగా తాగకూడదట. భోజనం చేస్తుండగా నీళ్లు తాగడం వల్ల నీరసం అలసట అలాంటి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు. ఇక భోజనం సమయంలో నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో విడుదలైన జీర్ణరసాలు పలుచబడి పోయే అవకాశం ఉందని తద్వారా తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. తేన్పులు, అజీర్తి, కడుపు ఉబ్బరం మలబద్ధకం లాంటి సమస్యలు కూడా వస్తాయట.
ఆయుర్వేద నిపుణుల ప్రకారం, భోజనానికి ముందు నీరు త్రాగటం శరీరంలో బలహీనతకు దారితీస్తుంది, భోజనం చేసిన వెంటనే నీరు ఎక్కువగా త్రాగటం స్థూలకాయానికి దారితీస్తుంది. అందుకే భోజనానికి అరగంట ముందు.. లేదా భోజనం చేసిన అరగంట తర్వాత మంచి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు పెద్దలు. కేవలం పెద్దలు చెప్పడమే కాదు అటు ఎన్నో అధ్యయనాల్లో కూడా ఇదే విషయం వెల్లడైంది. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే సూచిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పెద్దలు నిపుణులు సూచించినట్లుగా భోజనానికి ముందు భోజనం తర్వాత నీళ్ళు తాగుతారు కానీ కొంతమంది మాత్రంభోజనం చేస్తున్న సమయంలో నీళ్లు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అది ఎంతమాత్రం మంచిది కాదు. ఒకసారి అన్నం తినడం ప్రారంభించిన తరువాత సిప్‌లు సిప్‌లుగా నీళ్ళు తాగాలే తప్ప ఒకేసారి నీళ్ళు తాగితే అది కాస్త క్రొవ్వుగా మారి అనారోగ్యానికి కారణమవుతుందట. అంతేకాదు హెవీ వెయిట్, పొట్ట ఉబ్బరంగా ఉండడానికి కారణమవుతుందట. అలాగే భోజనం చేసిన తరువాత ఐదు నిమిషాలు ఆగి కొంచెం కొంచెంగా నీళ్ళు తాగాలట. అలా తాగడం వల్ల జీర్ణవ్యవస్ధ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగడం వల్ల కడుపులో ముద్దలాగా మారి జీర్ణ వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుందని చెపుతున్నారు.
శరీరంలో మంచిగా జీర్ణక్రియ జరగాలన్నా, శరీరంలో జీవక్రియా రేటు సక్రమంగా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా వెచ్చని నీటిని భోజనం చేసేటప్పుడు త్రాగాలి. మెరుగైన జీర్ణక్రియ జరగడంకోసం, నీటిలో మూలికల మిశ్రమాన్ని కూడా నిపుణుల సూచనల మేరకు వాడొచ్చు. త్రాగడానికి వినియోగించే నీరు మరిగించేటప్పుడు, పొడి అల్లం, వట్టి వేర్లు, బాబూల్, సోపు గింజలను కూడా కలుపుకోవచ్చు. ఇలా తీసుకున్న నీరు మనం తిన్న ఆహారాన్ని జీర్ణక్రియకు వీలుగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సజావుగా జరగడానికి ఈ పద్ధతి మంచిదని నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిని తాగడం వలన మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి.