పట్టణాల్లో ఉండేవారికి పెద్దగా తెలియక పోవచ్చు కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ఎంతో భక్తి. జమ్మి చెట్టును ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు. శమీ పూజ ఎప్పటినుండి మొదలైందో తెలియదు కాని “అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం” అనేదానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీవృక్ష పూజతో సంబంధముందని తెలుస్తుంది.
అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమీవృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు భారతకథ కూడా నిదర్శనమంటారు. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ద కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు.
శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తనను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమినాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే. జమ్మి చెట్టు పూజకు మాత్రమే కాక , ఎడారి ప్రాంతవాసులకు జమ్మిచెట్టు కల్పవృక్షము అని చెప్పవచ్చును , ఎందుకంటే వీటి పొడవైన వేళ్లు నీటిని గ్రహించినందు వల్ల భూమి సారవంతముగా ఉంటుంది . వేసవి ఎండలలో ఎడారి ప్రాంత వాసులకు నీడను ఇస్తుంది. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు.
జమ్మిచెట్టు జయాలను ఇచ్చేదే గాక సర్వరోగనివారిణి అని పేర్కొనవచ్చును. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
జమ్మిచెట్టు కాయలు పోషకాహారం , “సాంగ్రియా ” గా పిలిచే వీటితో కూరలు వండుతారు . జమ్మిచెట్టు గింజలను ఎండ బెట్టి సంవత్సరం మొత్తం కూరలలో వాడతారు . జమ్మిపూలను చక్కెరతో కలిపి తీసుకుంటే గర్భస్రావం రాదు. చెట్టు బెరడుతో పొడి చేసుకొని , నీళ్లలో మరిగించి పుక్కిలిస్తే గొంతునొప్పి,పంటి నొప్పి తగ్గుతాయి. జమ్మి ఆకులను మెత్తగా నూరి కురుపులపై, పుండ్లపై పెడితే అవి తగ్గిపోతాయి. జమ్మి ఆకుల కషాయాన్ని శరీరం పై చీము కారుతున్నా, దురద వస్తుంటే అక్కడ ఈ కషాయాన్ని పోస్తే ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయం చుండ్రు నివారణకు ఉపయోగపడుతుంది.
అవాంచిత రోమాలను తొలగించేందుకు జమ్మి ఆకులు అద్భుతంగా పనిచేస్తుంది. జమ్మి ఆకుల రసం తీసి దాన్ని అవాంచిత రోమాలు ఉన్న చోట రాస్తే ఫలితాలు చూసి మీరే గమనిస్తారు. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుందికనుకనే పూర్వీకులు విజయదశమి నాడు ఈ చెట్టు ను పూజించే వారేమో. అదే నేటికీ ఆచారంగా కొనసాగుతోంది. అందుకే తోలులా ఎండిన జమీ పత్రాన్ని ‘సువర్ణంగా’భావించి దసరా పండుగ నాడు పిల్లలు, పెద్దలు ‘బంగారం’ అంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు. ఆ ఆకులను చాలా రోజులు దాచుకునేవారు కూడా ఉన్నారు.