శివుడు పూజలందుకుంటున్న ఒక గుట్టపైన వెలసిన ఈ ఆలయంలోని శివలింగానికి తేత్రాయుగంలో సీతారాములు, ద్వాపరయుగంలో భీమసేనుడు పూజించారని పురాణాలూ చెబుతున్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఆసక్తి కరమైన కొన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, మడికొండ గ్రామంలో మెట్టుగుట్ట ఉన్నది. ఇక్కడ ఈ గుట్టపైన వెలసిన ఈ ఆలయాన్ని మెట్టు రామలింగేశ్వరాలయం అని పిలుస్తారు. మెట్టు గుట్టపైన శ్రీరాముడు శివలింగానికి పూజలు చేయడం వలన ఈ ఆలయానికి రామలింగేశ్వరాలయం అని పేరు వచ్చినది అని చెబుతారు. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదరెదురుగా ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడి మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తూ కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని దక్షిణకాశి అని పిలుస్తుంటారు. ఇంకా ఈ ఆలయ విశేషాలు ఏంటంటే, కరవుతో అలమటిస్తున్న ఆ ప్రాంత ప్రజల కోసం మాండవ్య, మరీచి, శాండిల్యాది నవసిద్ధులు తపస్సు చేయగా పరమ శివుడు సిద్ధేశ్వరమూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. కొండమీద వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి పూజలందుకుంటున్నారు. ఇంకా కాకతీయ ప్రభువులు ఈ క్షేత్రంలో ధూపదీప నైవేద్యాల కోసం 450 ఎకరాల మాన్యాన్ని కానుకగా ఇచ్చారు. సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు మండలం రోజులు గుట్టపై వాగీశ్వరీ ఉపాసన చేసినట్టు చెబుతారు. సరస్వతీదేవి ప్రత్యక్షమై భాగవతాన్ని తెలుగులో రాసి అభినవ పోతనగా ప్రసిద్ధి చెందమని ఆశీర్వదించిందని చెబుతారు.నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నవ గుండాలూ ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపవినాశనిగా పేర్కొంటారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షానికి ఔషధీయ గుణం ఉందంటారు. జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ప్రసిద్ధమైనవి. అయితే జీడి గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందంటారు. కన్ను గుండం కాశీని అనుసంధానం చేస్తుందని నమ్మకం. భక్తులు అందులో నాణెం వేసి విశ్వేశ్వరుడికి మొక్కులు సమర్పించుకుంటారు.ఇక ఈ మెట్టుగుట్ట మీద 165 అడుగుల ఎత్తులో రెండు చూడముచ్చటైన శిఖరాల జంట ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక శిఖరంలో అయిదు, మరో శిఖరంలో నాలుగు చొప్పున పెద్ద శిలలు ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి. భీముని భార్య హిడింబి గచ్చకాయలు ఆడుకుని, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చిందనీ ఆవే ఈ శిలలనీ ఓ కథ ప్రచారంలో ఉంది. వీటినే దొంతలమ్మ గుండ్లని వ్యవహరిస్తారు. గుట్టమీద ఓ జత పాదముద్రలున్నాయి. ఇవి, ద్వాపరయుగంలో ఇక్కడికొచ్చిన భీమసేనుడివేనంటారు. అలా, ముచ్చటగా మూడు యుగాల్లోనూ మెట్టుగుట్ట ప్రశస్తిని పొందింది. ఇంత గొప్ప విశిష్టత కలిగిన ఈ ఆలయానికి శివరాత్రి మరియు శ్రీరామనవమి పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.