మహాభారతంలో గాంధారి, ద్రుతరాష్ట్రునికి పుట్టిన వంద మంది కుమారులని కౌరవులు అని పిలుస్తారు. అయితే ఆ సమయంలోనే వందమంది కౌరవులతో పాటు ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఆమె పేరే దుస్సల. మరి మహాభారతంలో దుస్సల ఎవరిని పెళ్లిచేసుకుంది? ఏ విషయంలో దుస్సల అర్జునిడిని ప్రాధేయపడిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహాభారతంలో, వ్యాస మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినపుడు ఆయన గాయపడిన పాదాలకు గాంధారి సేవ చేసి, ఆయనకు కావలసిన సపర్యలన్నీ చేసింది. ఇందుకు ఆయన సంతోషించి నీకు ఎలాంటి కోరిక ఉన్నా, దానిని తీరుస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు. గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరగా, మహర్షి అలాగే నీకు వంద మంది కొడుకులు పుడతారని తెలిపాడు. అయితే ఆమె గర్భం దాల్చి నెలలు నిండినప్పటికీ ప్రసవం అవ్వకపోవడం ఆ సమయంలో పాండురాజుకు మొదటి కుమారుడు జన్మించడంతో నిరాశకు గురైన గాంధారి తన కడుపును తానే కొట్టుకుంది. దీంతో ఆమె గర్భం నుండి మాంసపు ముద్దా బయటకి రావడంతో అప్పుడు వ్యాస మహర్షిని పిలిచి ఆయనతో ఏమిటిది నేను 100 మంది కొడుకులను కంటానని ఆశీర్వదించారు, కానీ దానికి బదులుగా, నేను ఒక మాంసపు ముద్దను ప్రసవించాను, అది కూడా మానవ ఆకారం లేని ఒక ముద్ద. ఈ మాంసపు ముద్దను అడవిలో వదలివేయండి, ఎక్కడైనా పూడ్చేయండి అని చెప్పింది.
అపుడు వ్యాస మహర్షి ఏది తప్పు జరగలేదు అని చెప్పి ఆ మాంసపు ముద్దని 100 భాగాలుగా చేసి 100 మట్టి కుండలలో పెట్టి నేలమాళిగలో ఉంచగా గాంధారి తనకి ఒక కూతురు కూడా కావాలని అడగడంతో మరొక కుండని తీసుకువచ్చి అందులో కొంత మాంసపు ముద్దని పెట్టగ ఒక సంవత్సరం గడిచిన తరువాత 100 కౌరవులతో పాటు ఒక అమ్మాయి జన్మించింది. ఆమె పేరే దుస్సల. ఇక ఆమెకి యుక్త వయసు వచ్చిన తరువాత సైంధవుడితో వివాహం జరిగింది. ఇక సైంధవుడి విషయానికి వస్తే, సింధు దేశాధిపతి అయినా వృద్ధక్షత్త్రుని కొడుకు సైంధవుడు. అయితే సైంధవుడు చిన్నతనంలో ఆడుకుంటుండగా ఏమరపాటుగా ఉన్నప్పుడు ఇతని తల నరకబడుతుంది అని ఆకాశవాణి పలుకుతుంది. అప్పుడు ఆకాశవాణి మాటలను విన్న అతడి తండ్రి వృద్ధక్షత్త్రుని బాధపడుతూ ఎవరైతే సైంధవుడి శిరస్సుని నేలపైన పడివేస్తారో వారి తల వెయ్యి ముక్కలు అవుతుందని శపిస్తాడు.
ఇది ఇలా ఉంటె, సైంధవుడి పేరు జయధ్రదుడు. సింధు దేశానికి రాజు కావున సైంధవుడు అనే పేరు వచ్చింది. ఇతడికి స్త్రీ వ్యామోహం ఎక్కువ, అయితే ఒకరోజు ద్రౌపతిని చూసి మోహించి ఆమె దగ్గరికి వెళ్లి పాండవులు లేని సమయంలో తన కోరికను తెలియచేయగా, వరుసకు అన్న అయినా నీవు ఇలాంటి బుద్దితో నీచంగా మాట్లాడటం నీకు తగదు అని హెచ్చరించగా అవి ఏవి పట్టని సైంధవుడు ద్రౌపతిని ఎత్తుకుపోతాడు. అప్పుడు పాండవులు ద్రౌపతిని విడిపించి, సైంధవుడు వారి చెల్లి అయినా దుస్సలకి భర్త అనే ఒక్క కారణంతో చంపకుండా గోరంగా అవమానించి వెళ్ళిపోతారు. ఇక కురుక్షేత్రంలో కౌరవుల తరపున ఉన్న సైంధవుడు పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడి మరణానికి కారణం అవుతాడు. ఆ సమయంలో సైంధవుడి ని సంహరించడం కోసం అర్జునుడు బయలుదేరి యుద్ధంలో అర్జునుడు సైంధవుడి తలని నరికివేయగా, ఇక ఆ సమయంలో ఆ శిరస్సు నేలపైన పడకుండా శ్రీకృష్ణుడు ఉపాయం చెప్పడం వలన పాశు పతాస్త్రాన్ని ఉపయోగించి శిరస్సును తపస్సు చేసుకుంటున్న సైంధవుని తండ్రి అయినా వృద్ధక్షత్త్రుని ఒడిలో పడేలా చేస్తాడు.
ఇక కురుక్షేత్రం ముగిసిన తరువాత ధర్మరాజు హస్తిన పుర రాజ్యానికి రాజు అవ్వగా, ఆ సమయంలోనే సైంధవుని కొడుకు సురధుడు సింధు రాజ్యానికి రాజవుతాడు. ఒక రోజు ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని తలపెట్టగా యాగాశ్వం సింధు రాజ్యం వైపుకు వస్తుండగా దాని వెనుక అర్జునుడు వెతుకుంటూ వస్తున్నాడనే వార్త సురధుడికి తెలియడంతో అర్జునుడితో యుద్ధం చేసే ధైర్యం లేక నిస్సహాయంగా ఉండగా అతడి కుమారుడు అర్జునుడితో యుద్దానికి వెళ్లగా, అపుడు దుస్సల తన మనవడిని ప్రాణాలతో విడిచిపెట్టమని ప్రార్ధించగా అర్జునుడు అతడిని సింధు రాజ్యానికి రాజుని చేసి దుస్సల కోరిక మేరకు అక్కడినుండి వెళ్ళిపోతాడు.
ఇలా మహాభారతంలో ఉన్న దుస్సల పాత్ర కారణంగా చివరకు పాండవుల, కౌరవుల మధ్య ఉన్న వైరం నిలిచిపోతుంది.