ఆలయానికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు నెరవేరాలని ఏదో ఒకటి దేవుడికి కానుకగా సమర్పిస్తారు. ఇలా కానుకలు వేయడం, మొక్కుబడులు తీర్చుకోవడం ఒక్కో ఆలయంలో ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం అన్ని ఆలయాల కంటే చాలా భిన్నమైన ఒక వింత ఆచారం ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ వింత ఆచారం ఎందుకు వచ్చింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, కాన్పూర్ జిల్లా, బెంగాలీ మొహల్లాలో అతి పురాతనమైన కాళీమాత దేవాలయం ఉంది. ఇక్కడి భక్తులు అమ్మవారిని తాలే వాలీ దేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయంలో ఎటువంటి కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే కోరికలు నెరవేరడానికి మాత్రం ఓ తాళం కప్ప తెచ్చి తాళం వేస్తే సరిపోతుందని గుడి పూజారులు అంటున్నారు. మహిళ భక్తులు కొనసాగిస్తున్న ఈ ఆచారం కొన్ని శతాబ్దాల నుండి ఇక్కడ ఉందని చెబుతున్నారు.
పూర్వం కొన్ని శతాబ్దాల క్రితం అమ్మవారి దర్శనానికి ప్రతి రోజు ఓ భక్తురాలు ఉదయాన్నే వచ్చేది. ఒక రోజు దేవాలయ ప్రాంగణంలో ఆమె తాళం కప్పను ఉంచి తాళం వేసింది. దీనిని గమనించిన అప్పటి ఆలయ పూజారి తనను ఎందుకిలా చేస్తున్నా అమ్మ అని ప్రశ్నిస్తే ఆమె తన కలలోకి కాళీమాత కనిపించి ఇలా గుడి ప్రాంగణంలో తాళంకప్పను ఉంచితే ఏది కోరుకుంటే అది నెరవేరుతాయందని ఆమె అలా పూజారికి తెలిపింది. ఈ సంఘటన జరిగిన తరువాత ఆ భక్తురాలు మళ్లీ ఆలయానికి రాలేదు. కానీ ఓ రోజు అకస్మాత్తుగా వచ్చి నా కోర్కె నెరవేడంతో ఈ తాళం తెరుస్తున్నానని ఆమె ఆలయ ప్రాంగణంలో ఉన్న గోడలపై రాసింది.
ఇక అప్పటినుండి మనసులో తమ కోరికలు కోరుకుంటూ భక్తులు ఇక్కడ ఇలా తాళం వేస్తారు. వారి వారి కోర్కెలు నెరవేరినవాళ్లు నవమి రోజున అమ్మవారికి మేకను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాతి రోజు ఉదయం ఆలయంలో భక్తులకు అన్నదానం చేస్తారని అక్కడి భక్తులు చెబుతున్నారు.