తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఇక్కడ కొలువైన స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తులు స్వామివారికి కోరమీసాలు సమర్పిస్తారు. మరి ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మీదుగా సుమారు 75 కి.మీ. దూరంలో భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల స్వామి వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా ఈ ఆలయం విలసిల్లుతోంది. చాలా పురాతనమైన ఈ దివ్యక్షేత్రం తెలంగాణాలో ప్రసిద్ధి గాంచిన ఆలయాలలో ఒకటిగా చెబుతారు. ఈ ఆలయం నందు వీరభద్రస్వామికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇచట స్వామి లింగ రూపంలో కాకుండా అర్చామూర్తిగా కోరమీసాలతో వెలసి భక్తుల పూజలందుకుంటూ వారి కోర్కెలను తిరుస్తున్నాడు.
కొత్తకొండలో ప్రస్తుతం ఉన్న ఆలయం నాలుగొందల సంవత్సరాల క్రితం కట్టింది. స్థల పురాణం ప్రకారం, 17 వ శతాబ్దంలో కొంతమంది కుమ్మరులు ఈ గ్రామా శివార్లలోని కొండపైకి వంట చెరుకు కోసం కొండపైకి వెళ్లారట. వారు కలప కొట్టుకొని వచ్చేసరికి తాము తెచ్చిన ఎడ్ల బండ్లు కనిపించకుండా పోవడంతో, ఏం చేయాలో తెలియక వారు ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించారట. ఆనాటి రాత్రి వీరబద్రుడు వారికీ కలలో కనబడి, నేను కొండపైనే ఒక గుహలో ఉన్నాను, నన్ను తీసుకువచ్చి కొండ క్రింద ఆలయములో ప్రతిష్ఠిస్తే మీ ఎడ్లు లభిస్తాయని చెప్పి అదృశ్యమైనాడట. దాంతో వారు స్వామి ఆజ్ఞ ప్రకారం ఆ విగ్రహాన్ని కిందకి తీసుకొచ్చి ప్రతిష్టించి ఆలయం నిర్మించారని చెబుతారు. ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు తెలుపుతుంటారు.
ఈ ఆలయాన్ని క్రీ.శ. 1410 లో కాకతీయుల కాలంలో శ్రీ మల్లికార్జున పండితుడి మనువడు అయిన కేదారి పండితుడు ప్రతిష్టించినట్లు చరిత్ర ఆధారాల మూలంగా తెలుస్తుంది. ఈ వీరభద్రస్వామి గొప్ప మహిమాన్వితుడు. సంతానం లేనివారు ఈ కొత్తకొండ వీరభద్రుడికి కోరమీసాలు వెండి లేదా బంగారంతో సమర్పించుకుంటామని మ్రొక్కుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ స్వామికి మొక్కుకొని, ఆ కోర్కెలు తీరాలని కోడెదూడలను సమర్పించడం ఇక్కడ మరొక ఆచారం.
ఇక్కడి స్వామి కోరిన కోర్కెలు తీరుస్తాడు కనుక ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి కోర్కెలను సమర్పించుకుంటారు.