దానం చేయడంలో కర్ణుడి ఖ్యాతి జగద్విఖ్యాతం. సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు.. దేవేంద్రుడు విప్రరూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని అడుగుతాడు వాటిని మాత్రం ఇవ్వకని తన కుమారుణ్ని ముందుగానే హెచ్చరించాడు. కానీ సహజ దానశీల కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినా వాటిని కోసి దానంగా ఇచ్చాడు.
తనకు తోచింది ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం కర్ణుడిని నిత్యం దానకర్ణడని అభివర్ణించేవాడు. అయితే.. ఈ విషయం అర్జునుడికి నచ్చలేదు. ఒకానొక సందర్భంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. కర్ణుడిని దానకర్ణుడిగా అభివర్ణించొద్దని అర్జునుడు చెప్పడం.. దానం చేయడంలో అతనిని మించి మరొకడు లేడని కృష్ణుడు అనడం.. ఇలా చాలాసేపే మాటలు సాగాయి.
చివరికి లాభం లేదనుకున్న కృష్ణుడు.. ఒక చిన్న నాటకం ఆడుతాడు. కృష్ణుడు వెంటనే బంగారు పర్వతాన్ని సృష్టిస్తాడు. అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. కృష్ణుడు తాను సృష్టించిన బంగారు పర్వతాన్ని అర్జునుడికి చూపిస్తాడు. ఆ పర్వతాన్ని సాయంత్రంలోపు ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలని చెబుతాడు. ‘అలా చేస్తే.. దానం చేయడంలో కర్ణుడి కన్నా నువ్వే గొప్పవాడిగా కొనియాడుతాను’ అని కృష్ణుడు చెబుతాడు. ఆ ఒప్పందానికి అర్జునుడు సరేనని.. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నానంటూ ఊరంతా ప్రచారం చేయిస్తాడు. దాంతో ఊరిలో వున్న ప్రజలంతా అక్కడికి తరలి వస్తారు. అప్పుడు అర్జునుడు ఆ పర్వతం నుంచి బంగారాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దానం చెయ్యడం ప్రారంభిస్తాడు. అతడు దానం చేస్తూనే వుంటాడు కానీ.. పర్వతం మాత్రం తగ్గదు. ఓవైపు జనాల వరుస అయిపోతోంది.. అయినప్పటికీ ఆ పర్వతం అయిపోవడం లేదు.
చివరికి.. కృష్ణుడు చెప్పినట్టుగా సాయంత్రంలోపు అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు. సగం కూడా దానం చేయలేడు. ఇంతలోనే ఆవైపుగా కర్ణుడు వస్తాడు. కృష్ణుడు అతనిని పిలిచి ‘కర్ణా…ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయంలోపు దానం చెయ్యాలి.. నీ వల్ల అవుతుందా’ అని అడుగుతాడు. కర్ణుడు బదులిస్తూ.. ‘అదేం పెద్ద పని కాదే.. ఇది దానం చెయ్యాలి అంతేగా’ అని అంటాడు. అదే సమయంలో అటు వచ్చిన ఇద్దరిని కర్ణుడు పిలిచి.. ‘ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను.. దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకోండి’ అని ఆ ఇద్దరిని ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు అర్జునునివైపు కృష్ణుడు చూసి ‘ఇప్పుడు నీకు, కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా…? ఈ పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయ్యాలనే ఆలోచన నీకు రానే లేదు. మరి నిన్ను దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడివని ఎలా కొనియాడను’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అర్జునుడికి కర్ణుడి దాన గుణం గురించి అర్ధం అవుతుంది.