Let’s Revisit The 10 Iconic Roles Of Modern Mahanati Soundarya Garu

  • మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి గొప్ప హీరోయిన్ ఎవరూ అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు..?
  • అప్పటికీ, ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ ఎవరూ అంటే మీరు ఏం చెప్తారు..?
  • అచ్చం మన ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తుందని ఏ హీరోయిన్ గురించి మీరు ఎక్కువగా అనుకున్నారు..?
  • ఎక్స్ పోజింగ్ అనే మాటకు దూరంగా నిండైన చీరకట్టులో కనిపించిన హీరోయిన్ అంటే మీరు టక్కున ఏం చెప్తారు..?
  • 90’sలో పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ విలువ ఇచ్చే పాత్రలు చేసిన హీరోయిన్ ఎవరంటే ఏమంటారు..?
  • ఇప్పుడు కూడా మనతో ఉండి ఉంటే ఇంకా ఎన్నో మంచి క్యారెక్టర్లు చేసేవారు కదా అని మీరు ఏ హీరోయిన్ గురించి ఫీల్ అయ్యారు..?

అవును.. అన్నిటికీ మీ దగ్గర నుండి ఒకటే సమాధానం వస్తుంది. ఆవిడే తెలుగింటి అందం ‘సౌందర్య’ గారు.

సౌందర్య గారు కర్ణాటకలో పుట్టినా తెలుగు సినిమాలు ఎక్కువ చేశారు కాబట్టి తెలుగింటి అమ్మాయిలా మన మనస్సులో ఉండిపోయారు. సౌమ్యగా పుట్టిన ఆవిడ తర్వాత సౌందర్య అయ్యారు. తెలుగు తెరపై తిరుగులేని హీరోయిన్ అయ్యారు. సినిమా అవకాశాల కోసం ఎలాంటి పాత్రలో అయినా నటించాలి.. ఎలాంటి బట్టలు అయినా వేసుకోవాలనే పరిస్థితుల్లో కూడా తనకంటూ కొన్ని కండీషన్స్ పెట్టుకుని నిండుగా చీర కట్టినా కూడా అందంగానే కనిపించొచ్చని నిరూపించారు. సీన్ లో సౌందర్య ఉంటే మనం ఏ మాత్రం భయపడకుండా ఫ్యామిలీతో కలిసే సినిమా చూడొచ్చనే నమ్మకం ఇచ్చారు. మహానటి సావిత్రి గారు లేని లోటుని భర్తీ చేశారు అనుకునేలా చేశారు. ఇలా చెప్తూ పోతే ఎన్నో.. మరెన్నో..

అప్పట్లో తనకు పోటీగా ఎంతో మంది హీరోయిన్లు ఉండొచ్చు.. కానీ సౌందర్య గారి స్థానం ప్రత్యేకం. అది మంచి ఫ్యామిలీ స్టోరీ అయినా.. పెర్ఫార్మన్స్ కి అవకాశం ఎక్కువగా ఉన్నా.. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినా.. ముందుగా అప్పట్లో మొదటి ఛాయిస్ సౌందర్య గారే. ఒక్కో సినిమాతో తనలో ఉన్న నటిని మరింత కొత్తగా చూపిస్తూ, అన్ని రకాల పాత్రలు చేస్తూ, సౌందర్య మాత్రమే చేయగలదు అనేంత మంచి పేరు తెచ్చుకుంటూ 12 ఏళ్ల కెరీర్ లో 100కి పైగా ఒక హీరోయిన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఎన్నో గొప్ప పాత్రల్లో సౌందర్య గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన కొన్ని సినిమాల గురించి ఈ రోజు ఆవిడ జయంతి సందర్భంగా కాసేపు మాట్లాడుకుందాం..

1. అమ్మోరు

తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రయోగం ‘అమ్మోరు’. ఎందుకంటే.. అప్పటికి ఇలాంటి సినిమాలు ఆడియన్స్ కి పెద్దగా అలవాటు లేదు. ఇంత పెద్ద సినిమా, ఇంతటి కష్టమైన పాత్రని సౌందర్య గారు తన కెరీర్ మొదటి రోజుల్లోనే చేయడం సాహసమే. ముందుగా ఇలాంటి పాత్రని సౌందర్య గారు చేయగలరు అని నమ్మడం దర్శకులు కోడి రామకృష్ణ గారి గొప్పదనం. అమ్మవారి భక్తురాలు భవానిగా సౌందర్య గారు చేసిన పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో ఆవిడ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

2. పెదరాయుడు

పెద్ద బ్యానర్.. హై బడ్జెట్.. బిగ్ స్టార్స్ .. మంచి కథ.. ఇవన్నీ కలిపితే ‘పెదరాయుడు’. ఇలాంటి ఒక సినిమాలో పెద్ద హీరోల ముందు మామూలుగా హీరోయిన్ క్యారెక్టర్ ఆడియన్స్ కి పెద్దగా గుర్తు ఉండదు. కానీ, సౌందర్య గారు తన పాత్రకి ప్రాణం పెట్టి నటించి నిలబడ్డారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉంటాయి. చూసే ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు కూడా. అయితే మొదట్లో ఆ పాత్రపై కోపం.. తర్వాత జాలి ఏర్పడేలా అన్ని రకాలుగా చక్కగా బ్యాలన్స్ చేసి పాత్రకి ప్రాణం పెట్టారు.

3. పవిత్ర బంధం

ఈ సినిమా కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చినా మంచి హిట్ అవుతుంది. పెళ్లి చేసుకుని ఒక్క సంవత్సరం మాత్రమే భార్యగా అగ్రిమెంట్ మీద కాపురం చేసే ఇలాంటి ఒక బోల్డ్ కంటెంట్ కి ఓకే చెప్పాలంటే హీరోయిన్ కి కొంచెం డేర్ ఉండాల్సిందే. కాన్సెప్ట్ ఆడియన్స్ కి సరిగా రీచ్ అవ్వకపోతే నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఇండిపెండెంట్ గా ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ పాత్రని సౌందర్య గారు తప్ప ఇంకొకరు చేయలేరని ఖచ్చితంగా చెప్పొచ్చు.

4. పెళ్లి చేసుకుందాం

ఒక ఆడది ఒంటరిదైతే ఎన్ని బాధలు పడుతుందో.. సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో.. ఎంత తక్కువ చేసి మాట్లాడుతుందో ఈ సినిమాలో సౌందర్య గారు చేసిన శాంతి క్యారెక్టర్ ద్వారా మనకు చూపించారు. సింపుల్ గా ఆడవాళ్ల క్యారెక్టర్ గురించి తప్పుగా ఆలోచించి చులకనగా చూడడం ఎంత తప్పో ఈ సినిమాతో మనకు తెలిసేలా చేశారు. ప్రతి ఇంట్లోనూ ఉండే ఆడపిల్ల గౌరవాన్ని పెంచేలా ఈ పాత్రకి సౌందర్య గారు నిండుదనం తీసుకొచ్చారు. ఇది తన కెరీర్ లో ఒక మంచి రోల్ అని చెప్పొచ్చు.

5. మా ఆయన బంగారం

యాక్టింగ్ కొంచెం కష్టం అయినా ఎవరి టాలెంట్ బట్టి వాళ్లు నెట్టుకొస్తారు. కానీ, మతిస్థిమితం సరిగా లేని ఒక రోల్ చేయడం కష్టమైన పని. ఏ మాత్రం ఓవర్ అనిపించినా అక్కడే తెలిసిపోతుంది. ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. పసిపాపలా అల్లరి చేస్తూనే అమాయకత్వం చూపిస్తూ బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాలి. అలాంటి ఒక క్యారెక్టర్ ‘మా ఆయన బంగారం’ సినిమాలో సౌందర్య గారు చేశారు. ఆవిడ చేసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలకు ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. సినిమా అంతా మతిస్థిమితం లేని అమ్మాయిగా నవ్విస్తూనే.. చివర్లో ఏడిపిస్తారు కూడా.

6. అంతఃపురం

ఎక్కడో ఫారిన్ కల్చర్ లో పెరిగి, అక్కడి పరిస్థితులకు అలవాటు పడిన అమ్మాయి.. అనుకోకుండా ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెడితే..? మనుషులపై పగలు పెంచుకుని చంపుకునే అక్కడి పద్ధతులు, అలవాట్లు అర్థం కాని ఒక అమాయకపు ఆడది అక్కడి అంతఃపురంలో బందీ అయితే..? పక్కన ఉండాల్సిన భర్త కూడా దూరమై తోడుగా ఎవరూ లేకపోతే..? అదే అంతఃపురం సినిమాలో సౌందర్య గారి పాత్ర. మొత్తం సినిమాని తన భుజాలపై వేసుకుని యాక్టింగ్ లో ఎంత చూపించాలో అంత చూపించి ఇరగదీశారు ఈ క్యారెక్టర్ ని సౌందర్య గారు. ఇలాంటి మంచి పాత్ర దొరకలేదని ఫీల్ అయిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారట అప్పట్లో.

7. రాజా

ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కి సౌందర్య గారిని మరింత దగ్గర చేసిన మూవీ ‘రాజా’. అందం, అణుకువ కలిగిన అంజలి పాత్రలో సౌందర్య గారు ఒదిగిపోయారు అంతే. ఒక రకంగా చెప్పాలంటే ఇది హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. ఒక మంచి మనిషి తోడుగా ఉండి సాయం చేస్తే ఆడవాళ్లు సాధించలేనిది ఏదీ ఉండదని అంజలి పాత్ర ద్వారా చూపించారు.. అంతే అద్భుతంగా నటించారు సౌందర్య గారు కూడా. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ ఇప్పటికీ ఎంతో మంది ఆడియన్స్ కి ఫేవరెట్ సీన్. కాదంటారా..?

8. చూడాలని ఉంది

ఈ సినిమాలో సౌందర్య గారిని.. అదే మన పద్మావతిని ఎలా మర్చిపోతాం చెప్పండి. లోకం తీరు తెలియని అమాయకమైన పద్మావతి రక్తంతో లవ్ లెటర్ రాశారు అని చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. ‘పద్మావతీ.. పద్మావతీ.. నీ ఎర్రని మూతి..’ అని బుజ్జి బుజ్జి మాటలతో కపిత్వాన్ని చదివి వినిపించే సీన్ మర్చిపోగలమా..? వాసు ఎప్పటికైనా తన కోసం వస్తాడని ఎదురుచూసే భగ్న ప్రేమికురాలిగా మనల్ని బాగా ఎంటర్ టైన్ చేశారు ఈ సినిమాతో సౌందర్య గారు.

9. 9 నెలలు

ప్రస్తుతం సమాజంలో సరోగసి ద్వారా పిల్లల్ని కనడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇదే కాన్సెప్ట్ తో అప్పట్లోనే సినిమా తీస్తే అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశారు సౌందర్య గారు. అదే ‘9 నెలలు’ సినిమా. సినిమా వచ్చిన టైంకి ఇలాంటిది పెద్దగా ఎవరికీ తెలియదు. ఒక రకంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం ఇలాంటి పద్దతి తప్పు అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. కానీ, అప్పట్లోనే ఈ రోల్ చేయడానికి ఒప్పుకుని డేర్ చేశారు సౌందర్య గారు. ఒక హీరోయిన్ గా ఇలాంటి పాత్ర చేసి రిస్క్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయమే.

10. శ్రీ మంజునాథ

భక్తిరస ప్రధానమైన సినిమాల్లో కూడా నటించి మెప్పించగలనని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సౌందర్య గారు ‘శ్రీ మంజునాథ’తో. శివ భక్తురాలిగా, భర్తకి అసలైన తోడుగా, మంచి తల్లిగా అద్భుతంగా నటించారు ఇందులో. మామూలుగానే ఇలాంటి సినిమాల్లో నటనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. తనకి ఈ సినిమాలో ఉన్న పాత్రకి తగ్గట్లుగా పెళ్లికి ముందు చలాకీతనం, పెళ్లి తర్వాత హుందాతనం రెండూ చూపించి వాహ్ అనిపించారు.

ఇక ఈ మధ్యే బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన ‘నర్తనశాల’ మూవీ చిన్న బైట్ లో సౌందర్య గారిని చివరిసారిగా మనం చూశాం. అప్పుడు మహానటి సావిత్రి గారు చేసిన ద్రౌపది పాత్రని సౌందర్య గారు చేయాల్సింది. కానీ ఇంతలోనే సౌందర్య గారు మనకు దూరమై ఆ సినిమా అలా ఆగిపోయింది. ఈ సినిమా చేసి ఉంటే ఆ పాత్రకి ఇంకా మంచి పేరు వచ్చి ఉండేదేమో కదా..! ఏది ఏమైనా సౌందర్య గారు లేని లోటు తీర్చలేనిది. హీరోయిన్ రోల్స్ కి ప్రాధాన్యం తగ్గిపోతున్న ఇప్పటి సినిమాల్లో.. ఒకప్పుడు మన హీరోయిన్లు ఇలాంటి గొప్ప పాత్రలను చేశారని, ముఖ్యంగా సౌందర్య గారికి దొరికిన ఇలాంటి మంచి పాత్రలు ఇప్పటివాళ్లకి దొరకవేమో అని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఈ రోజు సౌందర్య గారి జయంతి సందర్భంగా ఆవిడని మరోసారి తలుచుకుంటూ కన్నీళ్లతో.. ‘మిస్ యూ సౌందర్య’….

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR