ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. హనుమంతుడు లేని గ్రామం అంటూ ఉండదు. అయితే ఆంజనేయుడు స్వయంభువుగా వెలసిన ఈ అతిపురాతన ఆలయం చాలా శక్తివంతమైనది అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్న కర్మన్ ఘాట్ లో శ్రీ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయం ఉన్నది. అయితే స్వయంభుడుగా వెలసిన కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయస్వామి ఆశ్రిత జన భక్తకోటి కల్పవృక్షంగా వెలుగొందుతున్నాడు. ఆంజనేయస్వామి దర్శనమిచ్చే అతిపురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రునకు వేట అనేది ఒక అలవాటుగా ఉండేది. ఈరోజు మనం హైదరాబాద్ గా పిలిచే ఈ ప్రాంతమంతా ఆ రోజుల్లో లక్ష్మి పురమనే పేరుతో పిలవబడుతూ అడవిగా ఉండేది. ఒక రోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మిపుర ప్రాంతానికి వేటకు రాగా, దగ్గర్లోని పొదల్లో పులి అరిచినా శబ్దం వినపడడుతూ ఉండగా ఆ రాజు ఆ దిక్కుగా వెళ్లిన కొద్దీ శబ్దం అనేది మాయమైపోయింది. ఆలా అలసిపోయిన రాజు ఒక చెట్టు క్రింద కూర్చుండగా, దగ్గరలోని పొద నుండి శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించింది. అప్పుడు ఆశ్చర్యపోయిన రాజు వెళ్లి పొద దగ్గర అన్ని ఆకులని, తీగలని తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుని విగ్రహం కనిపించింది. అప్పుడు భక్తితో చేతులు జోడించి, నమస్కరించి కోటికి చేరాడు మహారాజు.
ఆ రోజు రాత్రి రాజు కలలోకి శ్రీ ఆంజనేయుడు ప్రత్యక్షమై తాను ఉన్న చోట ఒక ఆలయం నిర్మించమని అందువల్ల నీకు, నీ రాజ్యానికి సకల శుభాలు కలుగుతాయని తెలిపాడు. ఆ స్వామి ఆజ్ఞానుసారం ప్రతాపరుద్రుడు ఆలయాన్ని నిర్మించి హనుమజ్జయంతి రోజున స్వామికి పూజలు నిర్వహించి అర్చకులను నియమించాడు. అయితే 17 వ శతాబ్దంలో ఔరంగ జేబు గోల్కొండ కోటని ఆక్రమించుకొని దేశములోని హిందూ దేవాలయాలను నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయములో ఈ ఆలయములోకి తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
అప్పుడు ఔరంగజేబు ఉగ్రుడై ఆలయాన్ని నేల మట్టం చేయడానికి ఆలయ ముఖ ద్వారం వద్దకు చేరుకొనగా, ఒక్కసారిగా పిడుగు వంటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగజేబు భయం తో వణికిపోయాడు. ఇంతలో ఆకాశం నుండి ఓ రాజా నువ్వు గుడిని పగలగొట్టాలంటే ముందు నీవు నీ గుండెని గట్టిపరుచుకో అనే మాటలు వినిపించగా అప్పడూ ఔరంగ జేబు ధైర్యాన్ని కూడదీసుకుని నీవు నిజం అయితే నాకు కనిపించు అని అనగా అప్పుడు ఆ ప్రాంతం అంతే కాంతివంతమై ఆ కాంతి నుండి అధ్బుత సుందరమూర్తి అయినా ధ్యానాంజనేయుని దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమైందంటా. అప్పుడు ఔరంగజేబు తనకి తానుగా ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాడని చెబుతారు. అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్-మన్-ఘాట్ అనే పేరు స్థిరపడింది.
ఈ ఆలయములోని స్వామివారిని మండలం రోజుల పాటు ప్రదక్షిణలతో సేవిస్తే సంతానం లేని వారు సంతానవంతులవుతారని మరియు గాలి, ధూళి లాంటివి దరిచేరవని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.