ఇంద్రుడు పూర్వం ఒకసారి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి అతిథి సత్కారాలు చేసి విషయమేమిటని అడిగాడు. దేవేంద్రుడు ఆ సందర్భంలో ఇలా అన్నాడు.
“శ్రీకృష్ణా! ఏం చెప్పమంటావు. భూమిపుత్రుడైన నరకాసురుడు నీకు తెలుసుకదా! వాడి దుశ్చర్యలు మితిమీరిపోతున్నాయి. ఇదే విషయం నీకు విన్న వించడానికే నేను ఇక్కడకొచ్చాను. నరకాసురుడు పెడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కాదు. దేవతలు, సిద్ధులు, మునులు….ఒక్కరేమిటీ – వాడి బారిన పడనివారు లేరనుకో! ఎందరు ధరణి పతుల కన్యలనో వాడు తన ఇంట్లో బంధించాడు. వరుణుని చత్రం లాక్కున్నాడు. మందర పర్వతశృంగం మీద మణులన్నీ తీసుకున్నాడు. ఇవి వాడి దుశ్చర్యల్లో కొంతభాగమీ కొంతభాగమే . త్వరగా నువ్వేదైనా ప్రతిక్రియ ఆలోచించాలి” అని చెప్పాడు.
“అలాగే! నువ్వు ధైర్యంగా ఉండు! వాడి గర్వం అణచవలసిందే!’ అని శ్రీకృష్ణుడు ఇంద్రునికి అభయమిచ్చి పంపేశాడు. అనంతరం హృదయంలో గరుడుని తల్చుకుని, అతడు రాగా ఆ పక్షిరాజు వీపున సత్యభామా సమేతుడై ప్రాగ్జ్యోతిష్యపురానికి వెళ్లాడు శ్రీకృష్ణుడు.
నరకుని సైన్యంతో శ్రీకృష్ణునికి మొదట బారి యుద్ధం జరిగింది. అహర్నిశలు సాగిన ఆ యుద్ధంలో, సత్యాపతి అలసి విశ్రమించగా, సత్యభామ ఆ దానవ వీరులతో పోరాడింది. వారిపైకి అస్త్రశస్త్రాలు వర్షంలా కురిపించింది. శ్రీకృష్ణుడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని , సత్యభామను ప్రశంసించి, తిరిగి తన కర్తవ్యాన్ని తానే నెరవేర్చాడు. తన చక్రాయుధంతో నరకాసురుని రెండుగా ఖండించాడు. మురాసురుని, హయగ్రీవుని, పంచజనుడను చంపేశాడు. మురాసురుని 7వేల మంది పుత్రుల్ని సంహరించాడు. ఎవరెవరిదగ్గర నుంచి నరకుడు ఏమేమి అపహరించాడో, అవన్నీ వారికి అందేలా చేశాడు.
నరకుని అంతఃపురంలో ఉన్న 16000 మంది సౌందర్యవతులైన కన్యలను, విలువైన రత్నాలను, 16000 ఉత్తమమైన నాలుగు దంతాలుగల ఏనుగులను, 21 లక్షల ఉత్తమైన కాంభోజదేశపు గుర్రాలను నరకుని భటులచేతనే అప్పటికప్పుడు ద్వారకాపురికి రవాణా చేయించాడు. ఇలా తాను రక్షించిన 16000 మంది కన్యలను వివాహం చేసుకున్నాడు. వరుణుని గొడుగును, మణి పర్వతం యొక్క మణులను, ఇంద్రుని తల్లి అదితి యొక్క మణిమయ కుండలాలను (నరకుడు అపహరించిన ఈ దేవతల సొత్తును) స్వయంగా తానే అప్పగించదలచి సత్యభామతో సహా అదే గరుడునిపై అధిరోహించి స్వర్గానికి వెళ్లాడు.