తమిళనాడు రాష్ట్రంలో కుమారస్వామికి భక్తులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కుమారస్వామి వెలసిన ఆరు అత్యంత ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. మరి యుద్ధం చేసి శాంతించి వెలసిన కుమారస్వామి ఆలయం ఎక్కడ ఉంది? శివుడు ఎందుకు కుమారస్వామికి జ్ఞాన శక్తి అనే ఈటెను ప్రసాదించాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, కుంభకోణం లోని తిరుత్తణి లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉంది. కొండపైన వెలసిన ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు కొలువై ఉన్నారు. తమిళుల ఇష్ట ఆరాధ్యదైవంగా, ఇలవేల్పుగా స్వామివారు ఇక్కడ మురుగ పెరుమాళ్ళుగా భక్తులచే పూజలను అందుకుంటున్నారు.
ఇక పురాణానికి వస్తే, స్వామివారు దేవతలు, మునుల బాధలను పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం శ్రీ వల్లిదేవిని వివాహం చేసుకోవడానికి బోయరాజులతో చిన్న యుద్ధం చేసి, ఆ యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ క్షేత్రంలో వెలిశాడని స్థల పురాణం. అయితే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి శివుడిని పూజించడానికి ఇక్కడి కొండపైన శివలింగ ప్రతిష్ట చేసి ఆరాధించాడు. కుమారస్వామి పితృ భక్తికి మెచ్చిన శివుడు సంతోషించి ఆయనకి జ్ఞాన శక్తీ అనే ఈటెను ప్రసాదించాడు. అందుకే ఈ స్వామికి జ్ఞాన శక్తి ధరుడునే పేరువచ్చినది.
ఇక్కడ కుమారస్వామి శివుడిని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారుతీర్థం. దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రం లోని స్వామికి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినారు. ఇంకా ఈ క్షేత్రంలోని ఇంద్ర తీర్థంలో ఒక పవిత్ర పూల మొక్కని నాటి ప్రతి రోజు ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ స్వామిని పూజించి ఆ తరువాతనే ఇంద్రుడు దేవలోక ఐశ్వర్యం పొందాడు.
ఇక్కడ సోమరిమఠం అనే స్థలం ఉంది. అక్కడికి వెళ్ళగానే భక్తులందరికీ సోమరితనం ఏర్పడి ఆవులింతలు వస్తాయని చెబుతారు. ఇలా కొండపైన వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు