శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమల తిరుపతిలో వెలసిన కలియుగ ప్రత్యేక్ష దైవం. అయితే ఒక భక్తుడి కోసం ఈ ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణం. ఇక్కడ భక్తులు జండాని దేవుడిగా భావించి పూజలు చేస్తుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు భక్తులు ఆలా జండాని పూజిస్తారు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో జండా బాలాజీ ఆలయం ఉంది. ఈ ఆలయం సుమారుగా క్రీ.శ. 1890 ప్రాంతంలో నిర్మింబడినట్లు తెలియుచున్నది. ఈ ఆలయంలో భక్తులు జండాని పూజిస్తూ వారి మొక్కులను తీర్చుకుంటారు.
ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, ఒక్కప్పుడు ఈ ప్రాంతంలో నిజామ్ పరిపాలనలో తెలంగాణ ప్రాంతం ఏ కాకుండా కన్నడ, మహారాష్ట్ర భాగాలూ కూడా అన్ని కలిసే ఉండేవి. అయితే అందులో నాందేడ్ జిల్లాలో కందడా అనే గ్రామంలో తుకోజీ గోస్వామిజీ అనే భక్తుడు ఉండేవాడు. అయితే అతడు ప్రతి సంవత్సరం కూడా నడుచుకుంటూ తిరుమల తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకునేవాడు. ఈవిధంగా కొన్ని సంవత్సరాలకి ఆ భక్తుడికి వృద్యాప్యం రాగ తిరుపతి కి నడిచి వెళ్లలేని పరిస్థితి వచ్చినప్పుడు తిరుపతికి వెళ్లి స్వామిని దర్శించి నిన్ను చూడకుండా ఉండలేను, కానీ నా వృద్యాప్యం వలన నడుచుకుంటూ ఇక్కడికి రాలేను నీవే ఏదో ఒకటి చేయాలంటూ ఆ స్వామిని వేడుకున్నాడు.
అతడి ప్రార్థనలను విన్న స్వామి తిరుపతి క్షేత్ర సర్వాధికారి అయినా మహంతుకు కలలో కన్పించి తన భక్తుని విషయం తెలియచేసి వారికి ఉత్సవ విగ్రహములనిచ్చి పంపని ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞప్రకారం ఆ భక్తుడికి ఉత్సవ విగ్రహాలను ఇవ్వగా అవి తీసుకొని ప్రస్తుతం బాలాజీ మందిరం ఉన్న చోట ఒక చెట్టు క్రింద కొంతసేపు విశ్రాంతి తీసుకుంటూ విగ్రహాలను నేలపైన పెట్టగ, ఆ ఊరి జమిందారుకి స్వామివారు కలలో కన్పించి ఆ చెట్టు ఉన్న స్థలాన్ని దానంగా ఇవ్వమని చెప్పగా మరుసటి రోజున ఆ జమీందారు ఆ భూమిని అతడికి దానంగా ఇవ్వగా తుకోజిగోస్వామి నేలపైన ఉన్న విగ్రహాలను తీసి బయలుదేరుదాం అని విగ్రహాలను తీయగా అవి భూమి నందు అలానే ఉండిపోయాయి. ఇది ఆ స్వామి నిర్ణయం అని భావించి ఆ భక్తుడు అక్కడే పూజలు చేయడం ప్రారంభించాడు.
ఇక 1930 లో నర్సాగౌడ్ అనే భక్తుడు బాలాజీ మందిరము దర్శించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. అయితే ఆ భక్తుడు ఒక జెండాని పట్టుకొని ఆలయ ప్రాంగణంలో బాలాజీ విశిష్టతలను ప్రతి రోజు ప్రబోధించేవాడు. ఇలా ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ఆ జెండాని మొక్కడంతో కాలక్రమేణా ఆ జండానే స్వామిగా భక్తులు పూజిస్తున్నారు.
ఈవిధంగా అప్పటినుండి భక్తులు స్వామివారికి కాకుండా నేరుగా జండాని మొక్కడం ప్రారంభించారు. ఇలా మొక్కడంతో కోరిన కోరికలు సిద్ధిస్తున్నాయని ప్రతి సంవత్సరం ఇక్కడ జండా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక స్వామివారు స్వయంభువుగా వెలసినప్పటికీ జండానే మొక్కడం ఆరంబించడంతో జండా బాలాజీ అనే పేరు వచ్చిందని చెబుతారు.