Home Unknown facts శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న మన్యం కొండ గురించి తెలుసా ?

శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న మన్యం కొండ గురించి తెలుసా ?

0

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అక్కడ రోజు కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే తిరుపతి వెళ్లలేని భక్తులు ఇక్కడ ఉన్న ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటే తిరుమల వెళ్ళినట్లే అని చెబుతుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

thirupathiతెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, కోయిల్ కొండా మండలం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో మన్యం కొండ ఉంది. దీనిని మణికొండ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం నందు ఉన్న సుమారు వెయ్యిగజాల ఎత్తుగల మన్యం కొండపైన శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో స్వామివారు వెలిసిన శిల ఆదిశేషుని పడగలా నిర్మితమై ఉంది. ఈ ఆలయంలో ఉలి ముట్టని మూలవిరాట్టు, చెయ్యని పాదములు, తవ్వని కోనేరు ఇక్కడి ప్రత్యేకతలు. ఈ కొండలో అనేక గుహలు ఉన్నాయి. పూర్వము ఈ గుహల్లో మునీశ్వరులు తపస్సు చూసుకునేవారని అందువల్ల దీనికి ‘మునులకొండ’ అనే పేరు వచ్చిందని కాలక్రమేణా మన్యంకొండగా మారిందని తెలుస్తుంది.

ఇక పురాణానికి వస్తే, దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీరప్రాంతంలో గల మన్యంకొండపై నేను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవాకార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట.

అప్పుడు అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబసభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో అర్ఘ్యం వదులుతుండగా చెక్కని శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషశాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు.

ఇది ఇలా ఉంటె అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతోపాటు స్వామివారి ఉత్సవాలకు తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యం కొండకు వచ్చి స్వయంగా స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని చెబుతారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్తకుండలో అన్నం, పచ్చిపులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసరులతో పూజలు చేయించి నివేదిస్తారు.

ఇక ఆలయ విషయానికి వస్తే, మన్యంకొండ దిగువ కొండవద్ద అలమేలు మంగమ్మ గుడి ఉంది. ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం.

ఈ విధంగా శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి వెలసిన ఈ ఆలయాన్ని పేదవారి తిరుపతి అని స్థానిక భక్తులు పిలుచుకుంటారు.

Exit mobile version