Lesser Known Facts About India’s Bravest King ‘Chhatrapati Shivaji Maharaj’

మొఘల్ రాజులతో పోరాడిన గొప్ప యుద్ధ వీరుడు, గెరిల్లా యుద్దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యుద్ధ తాంత్రికుడు, స్వతంత్ర సామ్రాజ్య మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన వీరుడు, భవాని దేవి ఆశీస్సులతో ఎన్నో కోటలని స్వాధీనం చేసుకొని అన్ని మతాల వారిని సమానంగా చూసిన గొప్ప మంచి మనసు ఉన్న రాజు ఛత్రపతిశివాజీ. మరి 17 సంవత్సరాల వయసులోనే యుద్ధ రంగంలోకి అడుగుపెట్టిన ఛత్రపతి శివాజీ మొగల్ రాజులని ఎలా ఎదుర్కున్నాడు? ఆయన యుద్ధ తంత్రం ఎలా ఉండేది? ఆయనది సహజ మరణమా? లేదా ఆయన చనిపోవడం వెనుక ఎలాంటి కుట్రయినా ఉందా అనే మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Maratha king chhatrapati shivaji

క్రీ.శ.1630వ సంవత్సరం ఫిబ్రవరి 19, వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు శివాజీ జన్మించాడు. అయితే జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై అంటే పార్వతి పేరు శివాజీకు పెట్టుకున్నారు. శివాజీ తన తల్లి దగ్గరి నుండి పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం నేర్చుకున్నాడు. అంతేకాకుండా చిన్నతనంలోనే పుట్టిన భూమిపైనా, ప్రజల పైన ప్రేమ కలిగేవిధంగా విద్యాబుద్ధులు జిజాబాయి శివాజీకి నేర్పిస్తుండేది. ఇక ఆయన తండ్రి పుణేలో జాగీరుగా ఉండేవాడు. శివాజీ తన తండ్రి దగ్గరి నుండి యుద్ధ విద్యలను, రాజనీతి మెళుకువలు నేర్చుకుంటూ తన తండ్రి పరాజయాలన్ని కూడా అధ్యయనం చేసి సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. ఇలా అన్ని విద్యలలో నైపుణ్యం సాధించిన ఆయన మరాఠాసామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా చేసుకొని 17 సంవత్సరాల వయసులోనే కత్తి పట్టి యుద్ధ రంగంలో అడుగుపెట్టి వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్ కి చెందిన తోర్నా కోటని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత కొండనా, రాజ్ ఘడ్ కోటలని ఆక్రమించి పూణే ప్రాంతాన్ని అంత కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

Maratha king chhatrapati shivaji

ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి, అనువైన సమయంలో దాడి చేసి గెలవాలి. ఇదే శివాజీ యుద్ధ తంత్రం, దీన్నే గెరిల్లా యుద్ధం అంటరాని ప్రపంచానికి చాటాడు. ఈవిధంగా శివాజీ తమ కోటలను ఆక్రమించుకున్నాడని ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రిని బంధీ చేసి శివాజీ ఇంకా బెంగుళూరులో ఉంటున్న ఆయన అన్న పైకి సైన్యాన్ని పంపగా వారు ఆ సైన్యాన్ని ఎదిరించి వారి తండ్రిని విడిపించుకుంటారు. ఇక నిస్సహాయడైన ఆదిల్షా, యుద్ధ భయంకరుడిగా పేరు గాంచిన అఫ్జల్ ఖాన్ ని శివాజీ పైకి యుద్దానికి పంపిస్తాడు. అయితే అఫ్జల్ ఖాన్ కి శివాజీ చేసే మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ తంత్రాలు తెలుసుకొని యుద్దభూమి లోనే శివాజీని ఓడించగలం అని తలచి శివాజీని రెచ్చగొట్టేందుకు తనకి ఎంతో ఇష్ట దైవమైన దుర్గాదేవి ఆలయాన్ని కూల్చివేస్తాడు. అఫ్జల్‌ కుట్రలు పసిగట్టిన శివాజీ ప్రతాప్‌ఘడ్‌ కోటలోకి సమావేశానికి ఆహ్వానిస్తాడు. అయితే శివాజీ చర్చలకు వెళ్లేముందు ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకును దాచుకొని సమావేశానికి వెళ్తాడు. ఇలా ఇద్దరు కూడా కేవలం అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి సమావేశం మొదలవ్వగా శివాజీని చంపాలనే లక్ష్యం తో వెళ్లిన అఫ్జల్ ఖాన్ తాను దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడిచేయగా, ఉక్కు కవచం వేసుకోవడం వలన ఏమి కానీ శివాజీ తన దగ్గర ఉన్న పిడిబాకుతో చంపేశాడు. ఈ ఘటనతో శివాజీ మరాఠా యోధుడిగా మరాఠా అంత పేరు తెచ్చుకున్నాడు.

Maratha king chhatrapati shivaji

ఇక 1657 వారికి కూడా శివాజీకి మొఘల్ సామ్రాజ్యంతో ఎలాంటి విబేధాలు లేవు. బీజాపూర్ సుల్తాన్ పైకి యుద్దానికి వెళుతున్న ఔరంగజేబుకి సహాయం చేయడానికి శివాజీ ముందుకు వచ్చాడు. అయితే యుద్ధంలో మద్దతు ఇస్తునందుకు ప్రతిఫలంగా బీజాపూర్ కోటను ఇవ్వమని కోరాడు. కానీ దానికి ఔరంగజేబు ఒప్పుకోలేదు. ఆ తరువాత శివాజీ అనుచరులు మొఘల్ సామ్రాజ్యంలోని అహ్మదాబాద్ పైన దాడి చేసారు. ఇక శివాజీ ఏ స్వయంగా జునార్ పైన దాడిచేసి మూడు లక్షల నగదును, రెండు వందల గుర్రాలని తీసుకువెళ్లాడు. దీంతో మొఘలులు శివాజీ పైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. శివాజీతో యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఔరంగజేబు తన మేనమామ షాయిస్తాఖాన్‌ వెంట లక్షకు పైగా సైన్యాన్ని, ఆయుధాలను ఇచ్చి దక్కన్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తాడు. అయితే మొగల్‌సేనల ముందు మరాఠి సేనలు నిలువలేక పోతారు. ఓటమిని అంగీకరించిన శివాజీ పూణే వదిలి వెళ్లిపోతాడు. శివాజీ నిర్మించిన లాలామహల్‌ లో షాయిస్తాఖాన్‌ నివాసం ఏర్పాటుచేసుకుని, శివాజీ దాడి నుంచి ముందస్తుజాగ్రత్తగా పూణే నగరమంతా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసుకుంటాడు. మారువేషంలో వచ్చిన శివాజీ షాయిస్తాఖాన్‌ గదిలోకి చేరి కత్తితో దాడి చేస్తాడు. గాయపడిన ఖాన్‌ సైనికుల సహాయంలో ప్రాణాలు దక్కించుని ఔరంగజేబు వద్దకు చేరుతాడు. తిరిగి తన కోటను స్వాధీనం చేసుకున్న శివాజీ సూరత్‌ నగరం పై దాడి చేసి అపారమైన ధనాన్ని, ఆయుధాలను దోచుకుని తన సైన్యాన్ని బలోపేతం చేసుకుని క్రమంగా మొఘలుల, బీజాపూర్‌ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటాడు.

Maratha king chhatrapati shivaji

శివాజీ మొఘలులు, దక్కన్ సుల్తాన్లకి వ్యతిరేకంగా పోరాడాడు కానీ ఆయన ఎప్పుడు మతద్వేషి కాదు. ముస్లింలని కూడా రాజ్యంలో భాగంగానే చూసాడు. ఖురాన్ ని గౌరవించాడు. తన యుద్దాన్ని మరాఠా అస్తిత్వ పోరాటంగానే చూసాడు తప్ప హిందూ, ముస్లిం పోరాటంగా ఎప్పుడు చూడలేదు. లక్ష్యాన్ని సాధించడం కోసం తన సైన్యంలో ముస్లిం లని చేర్చుకున్నాడు. హైదర్ అలీ, దౌలత్‌ఖాన్‌, సిద్ధిక, సిద్ది ఇబ్రహీం వంటి వారికి సైన్యంలో కీలక పదవులని ఇచ్చాడు. ఇక 1666 వ సంవత్సరంలో చర్చలకు అని ఆగ్రాకు పిలిపించి ఔరంగజేబు శివాజీని బంధించాడు. ఆగ్రా నుండి వేరే చోటుకి రహస్యంగా బందీగా పంపిద్దాం అని అనుకోగా శివాజీ అనుచరులు ఆయన్ని ఆగ్రా నుండి తప్పించారు.

Maratha king chhatrapati shivaji

ఆ తరువాత మొఘులలను తన యుద్ధ తంత్రాలతో హడలెత్తించాడు. బీజాపూర్ సుల్తాన్ కన్నెత్తకుండా చేసాడు. రాయఘడ్ రాజధానిగా విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయినప్పటికీ ఆయన్ని తోటి రాజులూ రాజుగా గుర్తించలేదు. అందుకే చక్రవర్తిగా పట్టాభిషేకం చేయించాలనుకున్నాడు. తనకి ఇష్టం లేకున్నా తన తల్లి జిజియాబాయి కోసం శాస్రోత్తంగా పట్టాభిషేకం చేయించాలనుకున్నాడు. పట్టాభిషేకం చేయడానికి అక్కడి బ్రాహ్మణులూ ఎవరు కూడా ముందుకు రాలేదు. దీంతో నాలుగు లక్షల ధనాన్ని ఇచ్చి వారణాసి నుండి గంగబట్టు అనే పండితుడిని పిలిపించారు. ఇక అక్కడి బ్రాహ్మణులూ శివాజీ పట్టాభిషేకాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే, క్షత్రియులు లేదా బ్రాహ్మణులూ రాజ్యాధికారాన్ని అందుకోవాలనేది మను సిద్ధాంతం. శూద్రుడైన శివాజీకి ఆ అర్హత లేదని ఆనాటి కొందరు విశ్వ బ్రాహ్మణులూ బహిరంగంగానే చెప్పేవారు. అంతేకాకుండా ఆయన ఎప్పుడు అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. సతీసహగమనం వంటి దురాచారాన్ని ఆపివేశాడు. వేదాలకి, శాస్రాలకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇలాంటి కారణాల వల్ల ఆయన మత ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్న భావన అప్పటి బ్రాహ్మణుల్లో కొందరికి పెరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు.

Maratha king chhatrapati shivaji

ఇక శివాజీ దగ్గర అత్యంత గొప్ప సైన్యాధికారిగా పనిచేస్తున్న తానాజీ ని కొండ కోట ని స్వాధీనం చేసుకోమని చెప్పగా ఆ యుద్ధంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తెలివిగా కోటని స్వాధీనం చేసుకున్నప్పటికీ తానాజీ ఆ పోరులో మరణిస్తాడు. కోటను గెలిచాం కాని సింహాన్ని కోల్పోయామని ఆవేదన చెందిన శివాజీ ఆ కోటను సింహఘడ్‌ గా మార్చాడు. ఇది ఇలా ఉంటె, మరాఠాసామ్రాజ్యాన్ని వ్యాపించచేసిన శివాజీకి రాయఘడ్‌ కోటలో వేదపఠనాల మధ్య క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతిబిరుదును ప్రదానం చేస్తారు. పరస్త్రీలను మాతృ సమానురాలుగా చూసిన గొప్ప వ్యక్తి శివాజి. గెరిల్లా విధానంలో పోరాటం, కొత్త ఆయుధాలను కనుగొవడం శివాజీఅవలంభించిన యుద్ధ నైపుణ్యాలు కాగా, 27 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అనేక యుద్ధాలు చేస్తూ మూడువందల కోటలను తన ఆధీనంలో ఉంచుకుని, లక్షమంది సైన్యాన్ని తయారు చేసిన శివాజీ కొండలపై సాంకేతిక విలువలతో శత్రుదుర్బేధ్యమైన కోటలను నిర్మించడంలో ప్రపంచఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. నాసిక నుంచి మద్రాసు వరకు 1200 కిలోమీటర్ల మధ్య 300 కోటలు నిర్మించాడు.

Maratha king chhatrapati shivaji

ఇక ఛత్రపతి శివాజీ జ్వరం తో బాధపడుతూ చనిపోలేదంటూ ఆయనది సహజ మరణం కాదంటూ, మరణం వెనుక కొందరి కుట్ర ఉన్నట్లుగా కొందరి మరాఠా రచయితల వాదన. అయితే శివాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు శంభాజీ, రెండవ భార్య సోహ్రా భాయ్ కొడుకు రాజారామ్. అయితే శివాజీ మొదటి భార్య కొడుకు శంభాజీకి సైన్యంలో మంచి పేరు ఉండేది. కానీ శివాజీ రెండవ భార్య సోహ్రా కి తన కుమారుడైన రాజారామ్ ని శివాజీ తరువాత రాజుగా చూడాలనేది కోరికగా ఉండేది. కానీ సైన్యంలో శంభాజీకి ఉన్న మంచి పేరు, శివాజీకి కూడా శంభాజీ యే తన తరువాత రాజుగా భావించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఆలోచనలు చెడు వైపుకి వెళ్లడం వెనుక కొందరి బ్రాహ్మణుల హస్తం కూడా ఉందని చరిత్రకారుల అభిప్రాయం. వారి అభిప్రాయం ప్రకారం, శివాజీ బ్రతికి ఉంటె నే కొడుకు ఎప్పటికి రాజు కాలేడని శివాజీని చంపివేసి ఆ తరువాత మొఘల్ రాజు ఔరంగజేబుతో సంధి చేసుకుంటే నీ కొడుకు రాజు అవుతాడనే ఆలోచన ఆమెలో కలిగించారని చెబుతారు. అందుకే తన కొడుకుని రాజుగా చూసేందుకు సోహ్రా భాయ్ ఆయనకి విషం ఇచ్చి చంపిందని చెబుతారు. ఇక శివాజీ చనిపోయిన 10 రోజులకే సోహ్రా భాయ్ 10 ఏళ్ళైనా రాజారామ్ ని రాజుగా ప్రకటించింది. ఇక శివాజీ మరణంతో ఆయన మొదటి భార్య కుమారుడు శంభాజీ రాయఘడ్ ని వదిలేసి వెళ్లి ఆ తరువాత అనుచరుల ఒత్తిడితో కోటను స్వాధీనం చేసుకొని రాజుగా ప్రకటించుకొని సోహ్రా భాయ్ ని జైలుకు పంపించారు. శంభాజీ మరణం తరువాత రాజారామ్ రాజుగా అయ్యాడు. ఆ తరువాత శంభాజీ కొడుకు సాహు రాజవ్వగా సాహుతో శివాజీవంశానికి తెరపడింది.

Maratha king chhatrapati shivaji

ఇలా 17 సంవత్సరాలకే కత్తి పట్టి యుద్ధరంగంలోకి అడుగుపెట్టి యుద్ధవీరుడిగా, ప్రజల రాజుగా కీర్తిని పొందిన ఛత్రపతి శివాజీ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR