రన్నింగ్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు!

ఫిట్ నెస్ అనగానే ముందుగా గుర్తుచేవి రన్నింగ్, జాగింగ్, వాకింగ్ గుర్తుకొస్తాయి. ఆరోగ్యంగా, ఫిట్‌‌గా ఉండాల‌నుకునే వారు ఖ‌చ్చితంగా ప్ర‌తి రోజు ర‌న్నింగ్ చేయ‌డం అల‌వాటు చేసుకుంటుంటారు. బరువు తగ్గడానికి రన్నింగ్ ఎంతో ఉపకరిస్తుంది. ముప్ఫై నిమిషాల పరుగు 396 క్యాలరీలని కరిగిస్తుంది. ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల కేవలం బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు. రన్నింగ్ వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఆకలిని తగ్గించి క్యాలరీలను త్వరగా కరిగిస్తుంది.
  • ఒత్తిడి దూరం అవుతుంది, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది, గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది, మెద‌డు షార్ప్‌గా మారుతుంది, మంచి నిద్ర ప‌డుతుంది ఇలా చాలా ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. అయితే, ఇవన్నీ జరగాలంటే రన్నింగ్ చేసేప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి, అప్పుడే రన్నింగ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ని పొందగలం. ఆ పొరపాట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
  • ర‌న్నింగ్ ఆరోగ్యానికి మంచేదే అయిన‌ప్ప‌టికీ అతిగా మాత్రం చేయ‌కూడ‌దు. అతిగా ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు ప‌రిగెత్త‌డంపై క్ర‌మంగా విర‌క్తి కూడా పుడుతుంది. రన్నింగ్ కి కొత్త అయినా, లేదా లాంగ్ బ్రేక్ తరువాత మళ్ళీ రన్నింగ్ కి వస్తున్నా ముందు వాకింగ్ తో మొదలు పెట్టి, మెల్లగా రన్నింగ్ లోకి రావాలి. బాడీ పెయిన్స్ మీద దృష్టి పెట్టాలి. పరిగెడుతున్నప్పుడు నొప్పి ఎక్కువవుతోంది అంటే రన్నింగ్ ఆపాలి. నొప్పి తగ్గాకే మళ్ళీ మొదలు పెట్టాలి.
  • వారంలో కనీసం ఒక్క రోజైనా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెస్ట్ డేస్ లోనే బాడీ తనని తాను రిపెయిర్ చేసుకుంటుంది. కాబట్టి మీరు ప్రతి రోజూ పరిగెడితే ఈ రిపెయిర్ కి చాన్స్ ఉండదు. అలాగే చాలా మంది ఏ దుస్తులు ప‌డితే ఆ దుస్తులు వేసుకుని ర‌న్నింగ్ చేస్తుంటారు. దీని వ‌ల్ల అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో పాటు ఇరిటేష‌న్ కూడా వ‌స్తుంది. అందుకే ర‌న్నింగ్ చేసేట‌ప్పుడు చెమట పీల్చే బట్టలను వేసుకుంటే మంచిది.
  • పాత రన్నింగ్ షూస్ వేసుకోవడం, సరైన టైప్ కాని షూస్ వేసుకోవడం వల్ల పరుగెత్తేటప్పుడు పాదాలకి గాయాలయ్యే ప్రమాదం ఉంది. పాదాల ఆకృతిని బట్టీ రన్నింగ్ స్టైల్ ని బట్టీ షూస్ కొనుక్కోవాలి. మీకు సరిపోయే షూ కొనుక్కున్న తరువాత ప్రతి మూడు వందల యాభై మైళ్ళ పరుగుకీ షూస్ మార్చేస్తూ ఉండాలి. లేదంటే కుషన్ అరిగిపోవడం వల్ల గాయాలయ్యే రిస్క్ ఉంది. రన్నింగ్ తరువాత వాటిని గాలికి ఆరబెడితే అవి ఎక్కువ కాలం మన్నుతాయి.
  • ర‌న్నింగ్ చేసే స‌మ‌యంలో చెమ‌ట రూపంలో ఒంట్లో నీరంతా ఆవిరైపోతుంది. అందువ‌ల్ల‌, ర‌న్నింగ్ పూర్తి అయిన త‌ర్వాత త‌ప్ప‌కుండా నీరు తీసుకోవాలి. కానీ, ఈ విష‌యంలో చాలా మంది నిర్ల‌క్ష్యంగా ఉంటారు. దాంతో డీహైడ్రైష‌న్ మ‌రియు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటారు. అలాగే తెలిసో, తెలియ‌కో ఖాళీ క‌డుపుతోనే చాలా మంది ర‌న్నింగ్ చేస్తుంటారు. ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు. ర‌న్నింగ్ చేయ‌డానికి గంట లేదా రెండు గంట‌ల ముందు కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉండే స్నాక్ తీసుకుంటే మంచిది. ఇక ర‌న్నింగ్ త‌ర్వాత గ్రీన్ టీ, ప్రోటీన్ షేక్స్ వంటివి తీసుకోవాలి.‌
  • కొంత మంది పరిగెత్తేప్పుడు చేతుల్ని అటూ ఇటూ స్వింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సరిగా ఊపిరి తీసుకోలేరు. కొంత మంది వారి చేతుల్ని వారి చాతీ పైకి పెట్టుకుంటారు, ప్రత్యేకించి అలిసిపోయినప్పుడు. రన్నింగ్ చేసేటప్పుడు చేతులు ఎప్పుడు నడుము లెవెల్ లో ఉండాలి. మోచేతులు పక్కగా ఉండి చేతులు లంబ కోణంలో వంపు తిరగాలి.  భుజాల దగ్గర చేతులు రొటేట్ అవ్వాలి. పోశ్చర్ స్ట్రైట్ గా ఉండాలి. ఎదురుగా చూస్తూ ఉండాలి, బ్యాక్ స్ట్రైట్ గా ఉండాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR