శివపార్వతుల కుమారుడు, వినాయకుని తమ్ముడు కుమారస్వామి. ఈ స్వామి దేవతలందరికీ సేనాధిపతి. ఈ స్వామి వాహనం నెమలి. ఈ స్వామివెలసిన ఆలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నవి. అయితే ఇక్కడ వెలసిన ఈ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఒక అద్భుతం ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న ఆ అద్భుతం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, పెనుగొండ వద్ద ఉన్న నాగులమడక అనే గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది. ఇది అతిపురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వెలసిన స్వామివారు గొప్ప మహిమ గల దేవునిగా భక్తులు ఆరాధిస్తారు.
ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం సుమారు 400 సంవత్సరాల క్రితం అన్నంభట్టు అనే ఒక బ్రాహ్మణుడికి దేవుడి విగ్రహం కలలో కనిపించిందట. దాంతో ఆ బ్రాహ్మణుడు ఆ తరువాతి రోజు ఆ విగ్రహం కోసం కలలో కనిపించిన ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న నదీతీరం వద్ద నాగలితో దీన్నిస్తుండగా ఆ నాగలి అంచుకు తగిలి ఒక శిలావిగ్రహం బయటపడిందట. ఇలా బయట పడిన ఆ విగ్రహమే ఏడు పడగలు గల నాగేంద్రస్వామి వారిది. ఈ విగ్రహం పడగలు పైకి ఎత్తి ఉండగా శరీరం మూడు చుట్టాలు చుట్టి ఆసన శిలపై కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత అరుదైన శిల్పం అని చెబుతారు.
ఇలా ఈ అరుదైన శిల్పాన్ని అతడు ఇక్కడే ఒక ఆలయాన్ని కట్టించి అందులో ప్రతిష్టించాడని పురాణం. అయితే మడక అంటే నాగలి, నాగలి అంచుకు తగిలి నాగదేవత విగ్రహం ఇక్కడ ప్రతిష్టించారు కావున నాగులమడక అనే పేరు ఈ ప్రాంతానికి వచ్చినది అని చెబుతారు.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, పూర్వం ఒకసారి రథోత్సవం సందర్భంగా సంతర్పణకు వండిన అన్నం చుట్టూ ఒక సర్పం వచ్చి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళేది అని చెబుతారు. అయితే ఈ మధ్యకాలంలో గర్భాలయంలో ఉన్న ఒక వెండి నాగ ప్రతిమను తెచ్చి అన్నం రాశిపైన ఉంచగానే అన్నం రాశి సర్పాకార ఆకృతిగా మారి నివేదనకు గుర్తుగా సంతర్పణకు అనుమతి లభిస్తుంది. ఈ అద్భుతాన్ని ఇప్పటికి చూడవచ్చని చెబుతున్నారు.
ఇక ఇక్కడ ఒక ఆచారం కూడా ఉంది, స్వామివారి రథోత్సవంలో బ్రాహ్మణ సంతర్పణ ముగిసాక భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ ఎంగిలి విస్తరాకుల మీద పొర్లాడి, ఆ తరువాత ఆ విస్తరాకులను తలపైన ధరించి నదిలోకి వెళ్లి మునిగి ఆ తడిబట్టలతోనే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం నేటికీ ఇక్కడ జరుగుతున్న ఒక ఆచారం.
ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయంలో పుష్యశుద్ధ షష్టి రోజు స్వామివారికి బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.