ఇంద్రుడు వృత్తా సురుడిని వజ్రాయుధంతో సంహరించాడు. అయితే పార్వతీదేవి పెట్టిన శాపం కారణంగా రాక్షసుడిగా మారిన వాడిని సంహరించడం కోసమే ఇంద్రుడు వజ్రాయుధం కోసం దధీచి మహర్షిని ప్రార్ధించాడు. మరి ఆ రాక్షసుడి ఎవరు? పార్వతీదేవి ఆ రాక్షసుడిని ఎందుకు శపించింది? ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకొనుటకు పూజించిన ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం విచిత్రకేతుడు అనే గంధర్వుడు ఆకాశంలో సంచరిస్తూ కైలాసానికి వెళ్లగా శివుడి తొడపైన కూర్చొని ఉన్న పార్వతీదేవిని చూసి నవ్వగా, పార్వతీదేవి ఆగ్రహించి నీవు మరు జన్మలో భూమిపైనా రాక్షసుడవై జన్మించదవు అంటూ శపించగా, ఆ శాపం కారణంగా అతడు భూలోకంలో వృత్తాసురుడను రాక్షసుడిగా జన్మిస్తాడు. అతడు దేవతలందరినీ బాదిస్తుండగా ఇంద్రుడు దధీచి మహర్షిని ప్రార్ధించగా అతడు తన వెన్నముక్కను వజ్రాయుధంగా ఇవ్వగా దానితో ఇంద్రుడు ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. అప్పుడు బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకొనుటకు ఇంద్రుడు శ్రీమహావిష్ణువుని పంచమాధవులన్న పేరుతో ప్రతిష్టించి ఆరాధిస్తాడు. అందులో ప్రసిద్ధి గాంచిన ఆలయం శ్రీ కుంతి మాధవస్వామి ఆలయం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలో కుంతీమాధవస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 11 వ శతాబ్దం నాటిదిగా చెబుతారు. ఈ ఆలయానికి తూర్పు మరియు ఉత్తరముఖంగా రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అయితే ఉత్తరముఖ ప్రవేశ ద్వారాన్ని మాత్రం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. ఇక గర్బాలయంలో చతుర్భుజాలతో కుంతీమాధవస్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి వారి కంఠహారం 24 సాలగ్రామములతో ఉంటుంది. ఈ స్వామివారు శంఖు, చక్ర, గద, కిరీటం తిరునామాలను ధరించి ఉంటాడు. ఇంకా ముఖమండపంలో శ్రీదేవి – భూదేవి సమేతంగా కుంతి మాధవుడు, మహాలక్ష్మి, గోదాదేవి మొదలగు ఉత్సవ మూర్తులు ఉన్నాయి.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసం నందు 7 రోజులపాటు స్వామివారికి కల్యాణోత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.