Home Health ప్లేట్ లెట్స్ అంటే ఏంటి? అవి తగ్గిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్లేట్ లెట్స్ అంటే ఏంటి? అవి తగ్గిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

0

ఎవరికైనా జ్వరం వచ్చిందంటే ప్లేట్ లెట్స్ పడిపోయాయని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అసలు ప్లేట్ లెట్స్ అంటే ఏంటి అనే విషయం తెలియదు. సాధారణంగా శరీరంలోని రక్తకణాల్లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ అని ప్రధానంగా మూడు రకాల కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ నుంచి ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ, శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్రరక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్‌ అందుతుంది.

blood cellsఇక మిగిలినవి ప్లేట్‌లెట్స్‌. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి అవి తోడ్పడతాయి. ఇవి ప్రతి వ్యక్తిలోనూ ఒకే విధంగా ఉండాలని లేదు. సాధారణంగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. పైగా ఇవి ఒక్కోరోజు ఒక్కోలా ఉండవచ్చు. ప్లేట్‌లెట్‌ కణం జీవిత కాలం ఏడు నుంచి పదిరోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్‌ మళ్లీ రక్తంలో చేరతాయి.

ప్లేట్‌లెట్స్‌ విధుల్లో ముఖ్యమైనది రక్తస్రావాన్ని నివారించడం. శరీరానికి గాయమైనపుపడు కాసేపు రక్తం స్రవిస్తుంది. ఆ తర్వాత దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనక రక్తనాళం, ప్లేట్‌లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల పాత్ర చాలా కీలకమైనది. ఇలా రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలే ప్లేట్‌లెట్స్‌. అయితే శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ తదితర కారణాల వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. దాంతోపాటు కొంతమందిలో పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి.. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది.

ప్రస్తుత జనరేషన్‌లో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రక్తం పలుచబడటానికి ఉపయోగించే మందుల వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య, నాణ్యత తగ్గిపోతున్నాయి. శరీరంలో ప్లేట్‌లెట్స్ మరీ తక్కువగా ఉన్నపుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్ లెట్స్ సక్రమంగా తమ విధిని నిర్వహించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ ప్లేట్‌లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు. ప్లేట్ లెట్లు సాధారణంగానే ఉన్నా అవి నాణ్యంగా లేకపోతే రక్తస్రావం ఆగదు.

సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పది వేలకు తగ్గే వరకు ఏ లక్షణాలు కనిపించవు. ఒకవేళ అంతకన్నా తక్కువగా పడిపోతే మాత్రం శరీరంలోని వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిన ప్రతి ఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు. శరీరంలో ప్లేట్‌లెట్స్ ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్ లెట్స్ ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్లేట్‌లెట్లు పది వేలకు తగ్గితేగానీ ఎక్కించకూడదు.

ఒకవేళ పది వేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్‌లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపోయిన ప్లేట్ లెట్స్ కణాలను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య చాలా వేగంగా పడిపోతు ఉంటుంది.. వీరికి డెంగ్యు చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్ లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్లేట్ లేట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో నియంత్రణలోకి వస్తాయి. మలేరియా కారణంగా ప్లేట్‌లెట్స్ పడిపోతే అదేచికిత్స అందించాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్‌లెట్స్ పడిపోతూ ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో వాటిని మానేయాలి.

గతంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గితే ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉండేది. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అత్యాధునిక విధానాలతో చికిత్స అందిస్తూ ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతున్నారు. రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్‌లెట్స్‌ను మాత్రమే వేరుచేసి ఎక్కించే అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్, రాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్ పద్ధతులలో రక్తం నుంచి ప్లేట్‌లెట్స్ ను వేరుచేసి అవసరమైన వారికి ఎక్కిస్తున్నారు. ఎస్‌డిపి విధానంలో దాత నుంచి నేరుగా ప్లేట్‌లెట్స్‌ను సేకరిస్తారు. ఆర్‌డిపి విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్ లెట్స్‌ను వేరుచేస్తారు. అయితే ఎస్‌డిపి విధానంలో ఒకసారి 50-60 వేల వరకు ప్లేట్‌లెట్స్ ను సేకరించే అవకాశం ఉంటుంది.

వీటితో పాటు సహజ పద్ధతుల్లో ప్లేట్ లెట్స్ ని పెంచుకోవచ్చు. ఆప్రికాట్‌ పండ్లను రోజు రెండు సార్లు తీసుకుంటే చాలు. రక్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవచ్చు. దీంతో వ్యాధి తగ్గుముకం పడుతుంది. బొప్పాయి పండ్లు డెంగీ వ్యాధికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దీని ద్వారా డెంగీ జ్వరం నుంచి బయటపడడమే కాకుండా వేగంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగిపోతాయి. దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతాయి. ఇవి రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

అలాగే ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. దీంతో వాటిలో ఉండే విటమిన్‌ కె ప్లేట్‌లెట్ల సంఖ్య పెంచుతుంది. వెల్లుల్లి రేకులను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య సమృద్దిగా పెరుగుతుంది. బీట్‌ రూట్‌ జ్యూస్‌ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌ రక్తహీనతతో బాధపడేవారే కాకుండా డెంగీ వచ్చిన వారు కూడా తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. క్యారెట్‌ను తరచూ తింటున్నా రక్తం వృద్ది చెంది తద్వారా ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. ఇలా డెంగీ జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్‌ పడిపోయినా, రక్తహీనతతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తీసుకున్నట్లయితే వైద్యుడి వద్దకు వెళ్లకుండా ఇంట్లో ఉండే నయం చేసుకోవచ్చు.

Exit mobile version