అంటరాని ప్రేమ, This Poem By Revolutionary Telugu Poet Kalekuri Prasad Just Breaks Your Heart

Contributed By: కలేకూరి ప్రసాద్

ప్రాణం లేని మొక్కలల్లో జీవం చూడగలడు, స్మశానాలా సువాసన పీల్చగలడు, మూగబోయిన గొంతులల్లోని నెత్తుటి మౌనం కి మాట ఇవ్వగలడు, అయిన కలేకూరి ప్రసాద్. కలేకూరి ప్రసాద్ రాసిన అంటరాని ప్రేమ కవిత గుండే కి ఏదో గాయం చేసి మాయం ఐపోద్ది. అంటరాని ప్రేమ మీ కోసం

— అంటరాని ప్రేమ —

గాయాలు సలుపుతున్నా
గుండెలమీద నీ పాదముద్రల్నే కదా మోశాను
చావు ముంచుకొస్తున్నా
నీతో బతుకునే కదా కోరుకున్నాను
ప్రేమ కోసమే బతకలేకపోయినా
కనీసం ప్రేమ కోసమే చద్దామనుకొన్నాను

ప్రియా !
పొద్దుటన్నంలో పెరుగేసి
నువ్వు పెట్టిన సందేళ బువ్వ సాక్షిగా
నా చావుకి కారణమేంటో నిజం చెప్పవా
ప్రియా !
బతికినంత కాలం నిన్నిట్టాగే పిలవాలని
నా గుండే , నెత్తూరు , భాషా
ఎంత తన్నకలాడాయో తెలుసా
చీకటి మాటున మన శరీరాలు
పెనవేసుకు పోయేప్పుడైనా
నిన్ను అమ్మగోరు అని పిలవడం తప్ప
బతికినంత కాలం కోరిక తీరనే లేదు
మీ వాళ్లంత నన్ను రచ్చబండకీడ్చి
పందిరి గుంజకు కట్టేసి
నన్ను గొడ్డును బాదినట్టు బాదుతుంటే
నేను నవ్వుకున్నాను

దీనంగా తలలు వంచుకు నిలబడ్డ
నా జాతి జనాన్ని చూసి
ఎంత జాలి పడ్డాను ! ?
సంగతేందిరా అని మీ వాళ్ళెవరన్నా అడిగితే
నిన్ను ప్రేమించానని అరచి చెబుదామనుకున్నాను
కానీ నేను దొంగనని రచ్చబండ ఆరోపణ
సాక్షివి నువ్వే కదా

చచ్చిన శవాలను తగలబెట్టడం తెలుసు నాకు
కానీ బతికుండగానే
మీ వాళ్ళు నాకు నిప్పు పెట్టారు
‘ తండ్రీ వీరేమి చేయుచున్నారో
వీరెరగరు కనుక వీరిని క్షమించుము ‘
పాదిరిగారు చెప్పిన ప్రభువు మాటలు
గుర్తొస్తూనే ఉన్నాయి
మనం గడిపిన నిద్రలేని రాత్రులు సాక్షిగా
నీ కంట్లో ఒక్క కన్నీటి చుక్క మెరిసినా
నిన్నూ నీ వాళ్ళనూ క్షమించేసే వాణ్ణి
గుండెల్లో నువ్వు రగిలించిన నిప్పుల కుంపటి
వంటిమీద నీ వాళ్ళంటించిన
కిరసనాయిలు మంటలు
ఏ బాధ ఎక్కువని అడిగితే
ఇప్పుడు చెప్పలేను

ప్రియా !
ఈ మంటలు నన్ను అలుముకుంటుంటే
నువ్వు నన్ను వాటేసుకున్నట్టే వుంది

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR