Home Health కరోనా నుంచి కోలుకున్నా కొద్ది రోజులు జాగ్రత్తలు తప్పవు

కరోనా నుంచి కోలుకున్నా కొద్ది రోజులు జాగ్రత్తలు తప్పవు

0

కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే భార‌త్ కోలుకుంటోంది. అయితే తాజాగా పోస్ట్ కోవిడ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండ‌టంతో మరోసారి జనాల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. కరోనా నెగెటివ్ వ‌చ్చిన త‌రువాత కూడా ఇన్ఫెక్షన్ లక్షణాలు త‌గ్గ‌క‌పోవ‌డంతో బాధితులు మ‌రింత‌కాలం ఆసుపత్రులలో చికిత్స తీసుకోవలసి వ‌స్తోంది. ఇటువంటి ప‌రిస్థితుల నేప‌ధ్యంలోనే రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్‌లో గ‌ల‌ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో నాన్-కోవిడ్ ఐసీయూ బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క‌నీసం ఒక్క బెడ్‌ కూడా ఖాళీగా లేని ప‌రిస్థితి నెల‌కొంది. పోస్ట్ కోవిడ్ కారణంగా ఫైబ్రోసిస్ స‌మ‌స్య‌తో బాధపడుతున్న బాధితుల‌కు ఈ బెడ్లు కేటాయించారు. త‌మ‌ ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్లు పూర్తిగా నిండిపోయాయ‌ని ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ అభిషేక్ టాండన్ సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

కరోనాక‌రోనా నుంచి కోలుకున్న చాలామందికి నెగిటివ్ రిపోర్టు వ‌చ్చిన‌ప్పటికీ, వారిలో వైర‌స్ న‌శించ‌డం లేద‌ని దానిలో పేర్కొన్నారు. ఇటువంటి స‌మ‌స్య‌ల గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ జయదేవన్ మాట్లాడుతూ ఢిల్లీ, ముంబై, జైపూర్, జోద్‌పూర్‌, కొచ్చి, ఇండోర్ సహా పలు నగరాల్లోని ఆసుపత్రులలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంద‌న్నారు. సెకెండ్ వేవ్‌లో క‌రోనా బారిన‌ప‌డిన ప‌లువురు బాధితులు శ్వాసకోశ సమస్యల‌ను ఎదుర్కొంటున్నారన్నారు. వారిలో వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేసింద‌ని, ఫ‌లితంగా పోస్ట్ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌న్నారు.

కరోనా నుండి కోలుకున్న తర్వాత రోగుల హృదయాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, COVID-19 సంక్రమణ శరీరంలో మంటను కలిగిస్తుంది, ఇది గుండె కండరాల బలహీనతకు, గుండె లయలో అసాధారణతలకు మరియు ఘనీభవనానికి దారితీస్తుంది.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. కోలుకున్న తర్వాత అంటే 15 నుంచి 30 రోజుల వరకూ ఆక్సిజన్, జ్వరం, బీపీ, షుగర్ లెవెల్స్పరీక్షించుకుంటూ ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. పోస్ట్- కొవిడ్‌‌‌‌లో కొందరిలో కండరాల బలహీనత అధికంగా ఉంటోందని తేలింది. అలాంటి వారు ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. కోవిడ్ చికిత్సలో తీసుకున్న మందుల వల్ల కొన్ని దుష్ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) రక్త పరీక్ష చేసుకోవాలి. బ్లడ్ క్లాట్స్ ఉన్నాయో లేదో దాని కోసం డీ డైమర్, ఎల్డీహెచ్(ల్యాక్టెట్ డీ హైడ్రోజినేజ్), ఐరన్ ఎలా ఉందో చూసుకునేందుకు సీరంఫిరటిన్లెవెల్స్ చెక్ చేసుకోవాలి. వీటికి అనుగుణంగా డాక్టర్ ఇచ్చే మందులు, సలహాలు తీసుకుంటే సరిపోతుంది.

స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుండటం వల్ల కొందరికి కరోనా నుంచి షుగర్ అటాక్ అవుతోంది. వీటికి పరీక్షలు చేయించుకోవాలి. మరోవైపు చాలామంది ఇప్పటికీ కరోనా అంటే జలుబు, దగ్గు, కొంచెం జ్వరం అని అనుకుంటున్నారు. లంగ్స్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుందని భావిస్తున్నారు. అయితే కరోనా ప్రభావం గుండె, మెదడు, కండరాలు, రక్తం, కళ్లు, శరీరంలోని అనేక ఇతర అవయవాలపై కూడా ఉంటోందని డాక్టర్లు చెప్తున్నారు. కోలుకున్నాక గుండె పోటు, నిస్సత్తువ, అలసట, ఒళ్లు నొప్పులు, రక్తం గడ్డకట్టడం, బ్లాక్ ఫంగస్‌‌‌‌ లాంటి సమస్యలు వస్తున్నాయి. బాగా అయిపోయామనే ధీమాతో పోస్ట్- కొవిడ్‌‌‌‌లో శరీరంలో వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయొద్దని.. సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

కరోనా వచ్చి తగ్గిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలోనే ఇతర జబ్బులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రధానంగా కొవిడ్ చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ వాడటం, ఆక్సిజన్‌‌‌‌ అందించేటప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో బ్లాక్ ఫంగస్ అటాక్ అవుతున్నట్లు ఎక్స్పర్ట్స్ వెల్లడిస్తున్నారు. అలాగే ఆక్సిజన్ ఉపయోగించే హ్యుమిడిఫయర్‌‌‌‌లో స్టెరైల్‌‌‌‌ వాటర్‌‌‌‌కు బదులుగా సాధారణ నీటిని ఉపయోగించడం వల్ల ఫంగస్ ఏర్పడుతుందంటున్నారు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వెంటనే ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత జలుబు, ముక్కు పట్టేయడం వంటి లక్షణాలను సాధారణ లక్షణాలుగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.

 

Exit mobile version