Home Health టీకా వేయించుకునేటప్పుడు కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

టీకా వేయించుకునేటప్పుడు కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
Precautions to be taken at least while frying the vaccine

చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం మరణ మృదంగం మోగిస్తున్న కరోనావైరస్ మన దేశంలో కూడా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందుకే ప్రజలందరికి వ్యాక్సిన్ వేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. టీకా తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చని చెబుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

దీంతో జనం కూడా టీకా కోసం క్యూ కడుతున్నారు. అయితే టీకా వేయించుకున్న తరువాత కూడా కరోనా సోకుతుందా అనే అనుమానాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. చాలామంది వ్యాక్సిన్‌ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్‌ బారినపడుతున్నారు. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగిపోతోంది.

కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. టీకా వేయించుకున్న వారికి కొవిడ్‌ వచ్చే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు టీకా వేయించుకున్న వాళ్లలో కరోనా లక్షణాలు కనిపించడానికి కారణం కూడా చెప్పారు. 90 శాతం టీకా కేంద్రాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు లక్షణాలున్న వారు కూడా ముందుగా పరీక్ష చేయించుకోకుండా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల తర్వాత వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయని డాక్టర్ల పరిశీలనలో తేలింది.

చాలా వరకు వ్యాక్సిన్‌, కరోనా పరీక్షా కేంద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. ఒక లైనులో అనుమానితులు నిల్చుంటే వారి పక్కనే టీకా కోసం వచ్చిన వారు నిలబడుతున్నారు. అలాంటి సమయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల టీకాకు వచ్చినవారు మహమ్మారి బారినపడుతున్నారు. కొన్ని చోట్ల టీకా కేంద్రాలను శానిటైజ్‌ చేయకపోవడంతో ఇవి వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా మారాయన్న భావన ఉంది. దీంతో వైరస్‌ కారణంగా జ్వరం వచ్చినా కూడా చాలామంది టీకా వల్ల వచ్చిందన్న భావనలో ఉంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు.

కరోనాకి వ్యాక్సిన్ మృతవైరస్‌తో తయారు చేశారు. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపించడం సర్వ సాధారణమే. అయితే చాలా వరకు అవి ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి. అంతకు మించి ఇబ్బంది కలిగినా అలసత్వం ప్రదర్శిస్తుండడంతో కొందరు ఊపిరితిత్తులు దెబ్బతిని ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. కాబట్టి టీకా వేయించుకోవడం వల్ల కరోనా వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. ఇక చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే… కుటుంబ సభ్యులకు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే తాము కూడా వైరస్‌ బారినపడే అవకాశం ఉందన్న భయంతో వెంటనే టీకాకు పరుగులు పెడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే మిగతా వారంతా 14 రోజులపాటు వారూ ఐసోలేషన్‌లో ఉండాలి. కోవిడ్ టెస్ట్ చేయించుకొని వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతే వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

టీకా వేయించుకోవడానికి వెళ్లినప్పుడు కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు మాస్కులను ధరించాలి. వ్యాక్సిన్‌ వేయించుకునే ముందు జ్వరంగాని ఇతర లక్షణాలు గానీ ఉంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్‌ వచ్చిన తర్వాతే టీకా వేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం టీకా వేయించుకోవడానికి ఆరు నెలలు ఆగాల్సిందే. ఇక కొంతమంది మొదటి డోసు తర్వాత టీకా వేయించుకున్నామనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అది ప్రమాదానికి దారితీస్తుంది. రెండో డోసు వేయించుకున్న 14 రోజుల తరువాతే మనలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయి. దీని తర్వాత కూడా కరోనా రాదని కాదు. వచ్చినా దాన్ని ఎదుర్కునే సామర్థ్యం శరీరంలో ఉంటుంది. అప్పటి వరకు మాస్క్ లు ధరించడం, సామజిక దూరం పాటించడం తప్పనిసరి.

Exit mobile version