ఈతరం పిల్లలు చాలామంది ఎక్కువగా టీవీ చూడడం, లేదంటే ఫోన్ ఆడడం లాంటివి చేస్తున్నారు.అలాగే కంప్యూటర్ ముందు కూర్చోడం లాంటివి చేస్తున్నారు. వీటితో పాటు చదువులూ, పోటీ పరీక్షలు అంటూ గంటలతరబడి పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటున్నారు. దీని వల్ల కళ్లు అలసిపోవడం, తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
చదువునేటప్పుడు గదిలోని లైటు కాంతి నేరుగా పుస్తకం మీద పడకుండా చూసుకోవాలి. దానికి కాస్త దూరంగానే కూర్చోవాలి. పగటి పూట చదువుకొనేటప్పుడు కిటికీలకూ దూరంగా కూర్చోవాలి. కిటికీ అద్దాల వెలుతురు కళ్ల మీద పడకుండా చూసుకోవాలి. అది కళ్లకు హాని చేస్తుంది. చదువుకొనేటప్పుడు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
ఆరుబయట నడుస్తూ చదువుకొనే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ సూర్యకిరణాల ప్రభావం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. దానికి బదులు నీడలో చదవడం మంచిది. కొంత మందికి జర్నీ లో ఉన్నప్పుడు చదవడం అలవాటు. కానీ అది మంచి అలవాటు కాదు. కదులుతున్న వాహనంలో చదవడం వలన కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి వామిటింగ్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ఇది కళ్లకే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
కొంతమంది పడుకొని చదువుతుంటారు. దీని వల్ల కళ్లు లాగేస్తుంటాయి. అందుకే కుర్చీలో కూర్చుని, లేదా గోడకు ఆనుకొని చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ కూడా నొప్పి కూడా రాదు. ఏకాగ్రత కుదురుతుంది.
చల్లటి నీళ్లూ, ఒక మెత్తటి వస్త్రం పక్కన పెట్టుకోవాలి. కళ్లు మంటగా అనిపించిన ప్రతిసారీ ఆ వస్త్రాన్ని నీళ్లలో ముంచి కళ్ల మీద పెట్టుకోవాలి. ఫలితంగా కళ్లు వాయకుండా ఉంటాయి. చల్లదనం వల్ల నరాలకు సాంత్వన కలుగుతుంది. అలసట దూరమవుతుంది.