Home Health కాళ్లల్లో వాపులు రావడం వలన ఎదురయ్యే సమస్యలు

కాళ్లల్లో వాపులు రావడం వలన ఎదురయ్యే సమస్యలు

0

కాళ్ళవాపులు చూడ్డానికి చిన్న సమస్యే అయినా దాని ప్రతిఫలం మాత్రం చాల ఘోరంగా ఉంటుంది. దీన్నే ఎడీమా అని కూడా అంటారు. మధ్య వయసులో ఉన్నవారు తమ కాళ్లు వాచిపోతున్నాయని, కారణమేంటో అర్ధం కావడంలేదని బాధపడుతుంటారు. ఉదయం లేచినప్పుడు అంతా బాగానే ఉంటుంది. రోజు గడుస్తున్న కొద్దీ పాదాలు, కాళ్లు బండల్లా వాచి ఉబ్బిపోతూ ఉంటాయి. రోజు మొత్తంలో నిలబడి పనులు చేయడం, ఎక్కవ సేపు అలాగే నిలబడి ఉండటం వంటివాటి వల్ల కాళ్లలో ఉన్న సిరల్లో రక్తం పేరుకుపోతుంది. దీంతో పైకి ఎగబాకవలసిన రక్తం కాళ్లలో ఉన్న సిరల్లో గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల కాళ్లు వాపులు ఏర్పడతాయి. కాళ్లవాపు వచ్చినప్పుడు బెంబేలెత్తిపోతుంటాం. ఏదో తీవ్ర ఆరోగ్య సమస్య వచ్చిందని భయపడతాం.

Problems Caused By Swelling In The Legకాళ్ల వాపులు అనేవి ప్రారంభంలో కాళ్ల మడిమెల వద్ద, ఆ తర్వాత పాదం వద్ద వస్తాయి. కాళ్లవాపు అనేది గుండెజబ్బులకు ప్రధాన లక్షణంగా వైద్యులు చెబుతున్నారు. దీన్ని కొంచెం నిర్లక్ష్యం చేసినా ప్రాణానికే ప్రమాదం కావచ్చంటున్నారు. మొదట్లో నొప్పి ఉండకపోవడంతో దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్వాస తీసుకోకపోవడం, ఛాతీలో నొప్పి రావడం, నడవలేక పోవడం వంటి సమస్యలు వస్తాయి.

ఇక కాళ్ళవాపులు రావడానికి మరో కారణం నీరు చేరటం. సాధారణంగా మన బరువులో 60శాతం వరకు మన ఒంట్లోని నీరేే. ఇంత నీరు మన శరీరంలో ఎక్కడ ఉంటుందని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 40 శాతం నీరు మన శరీరంలోని జీవకణాల్లోనే ఉంటుంది. దీన్ని ‘ఇంట్రా సెల్యులార్‌ ఫ్లూయిడ్‌- ఐసీఎఫ్‌’ అంటారు. 16 శాతం నీరు కణాల మధ్య ఉంటుంది. మిగతా 4శాతం రక్తంలో ప్లాస్మా రూపంలో ఉంటుంది.

కణాలు, కణాల మధ్యలోనూ, ప్లాస్మాలోనూ ఉండే నీటిని ‘ఎక్స్‌ట్రా సెల్యులార్‌ ఫ్లూయిడ్‌ (ఈసీఎఫ్‌)’ అంటారు. ఇలా మన ఒంట్లో నీరు మూడు విభాగాల్లో ఉన్నా ఒక భాగం నుంచి మరో భాగంలోకి చాలా తేలికగా మారిపోతుంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా వచ్చినా.. ఒంట్లో నీరు ఎక్కువగా చేరిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగే కొన్నిసార్లు శరీరంలోని అంతర్గత భాగాల్లో, అవయవాల దగ్గర కూడా నీరు చేరొచ్చు.

ఉదాహరణకు ఊపిరితిత్తుల పైన ఉండే పొరల్లో నీరు ఎక్కువగా చేరొచ్చు. అలాగే పొట్టపైన ఉండే పొరల్లో కూడా చేరొచ్చు. అరుదుగా గుండె చుట్టూ ఉండే పొరల్లో కూడా చేరొచ్చు. ఇదే సమస్య గుండె సంబంధ సమస్యలకు కారణమవుతుంది. అయితే.. ఇది రావడానికి కారణాలను తెలుసుకుంటే సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవచ్చు.

కాళ్లకు వాపు వచ్చినప్పుడు ముఖ్యంగా రెండు అంశాలను పరిశీలించాలి. వాపు రెండు కాళ్లకా.. ఒకదానికేనా? అనేదానిబట్టి సమస్య తీవ్రతను గుర్తించొచ్చు. తర్వాత నొక్కితే సొట్ట, గుంత పడుతోందా.. లేదా? అనేది కూడా పరిశీలించాలి. రెండు కాళ్లూ వాస్తున్నాయంటే సమస్య కాళ్లలో కాదు.. ఒంట్లోని కీలక వ్యవస్థల్లో ఎక్కడో ఉందని అర్థం. అలాగే నొక్కితే గుంత లేదా సొట్ట పడుతోందంటే కాళ్లలో నీరు చేరుతోందని అర్థం.

గుండె జబ్బులు గలవారిలో ఇలా కాళ్లలో వాపులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. గుండె సరిగా రక్తాన్ని పంపింగ్‌ చేయలేని పరిస్థితుల్లో మూత్రపిండాలకు కూడా రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో అవి స్రవించాల్సిన హార్మోన్లు తగ్గి ఒంట్లో లవణాలు, నీరు ఎక్కువగా నిలిచిపోతుంటాయి. వీరిలో ఊపిరితిత్తుల్లోనూ, ఒంట్లో కూడా నీరు ఎక్కువగా చేరిపోతుంటుంది. కాబట్టి రెండు కాళ్ల వాపుతో పాటు నడిచినా, పడుకున్నా ఆయాసం వంటి లక్షణాలు కనబడుతుంటే గుండె జబ్బు ఉందేమో పరీక్ష చేయించుకోవటం అవసరం.

Exit mobile version