ఉదయాన్నే కాసేపు ఎండలో నిలబడితే శరీరానికి విటమిన్ డి దొరుకుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. విటమిన్ డి సరిపోయేంత ఉంటే.. రోగ నిరోదక శక్తి పెరిగి ఎలాంటి వైరస్ లు దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. మన శరీరానికి కావాల్సిన ఏ విటమిన్ కూడా మనకు ఉచితంగా దొరకదు కానీ.. ఒక్క డి విటమిన్ మాత్రం ఉచితంగా దొరుకుతుంది. ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడితే చాలు.. ఆరోజుకు కావాల్సినంత విటమిన్ డి శరీరానికి అందుతుంది.
- అంతే కాదు.. పలు రకాల ఆహార పదార్థాల్లోనూ విటమిన్ డి ఉంటుంది. చేపలు, గుడ్లు, మాంసం, పాలు, పుట్టగొడుగులు లాంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇక కొంత మంది విటమిన్ డి కోసం ట్యాబ్లెట్లు వాడుతుంటారు. వాడటమే కాదు వాటికి అలవాటు పడుతున్నారు. అవసరం కంటే ఎక్కవగా వాడేస్తున్నారు. విటమిట్ డి ట్యాబ్లెట్లు అధికంగా వాడటం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి ఎక్కువవుతుంది.
- ఫలితంగా విషపదార్ధాల శాతం పెరుగుతుంది. దాంతో తీవ్ర అస్వస్థతకు గురవుతారుు. విటమిన్ డి శరీరానికి ఎంత కావాలో అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువైందనుకోండి లేనిపోని రోగాలను మనమే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. విటమిన్ డి వాడే ముందు ఆ విటమిన్ మన శరీరంలో ఏ మేరకు ఉందో అనేది విటమిన్ డి పరీక్ష ద్వారా చెక్ చేసుకుని వాడాల్సి ఉంటుంది. లేకపోతే అసలుకే మోసం వస్తుంది.
- విటమిన్ డి తక్కువున్నా ప్రమాదమే అలాగే ఎక్కువ అయినా ప్రమాదమే. ఒకవేళ విటమిన్ డి ఎక్కువైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
- రక్తంలో కాల్షియం లెవల్స్ పెరగడం వల్ల వచ్చే వ్యాధిని హైపర్ కాల్సిమియా అంటారు. ఇది విటమిన్ డీ అధికంగా తీసుకోవడం వల్ల వస్తుంది. దీని వల్ల మనిషిలో అలసట, వికారం, మైకం, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, దాహం పెరగడం, వాంతులు మరియు అధిక మూత్రవిసర్జన వంటివి కనిపిస్తాయి. అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కూడా కారణమవుతుంది.
- ఎముకల ఆరోగ్యం కాపాడుకోవడంలో విటమిన్ డీ ముఖ్యం. అయితే అధికంగా విటమిన్ డీ తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని కలుగుతుంది. శరీరంలో విటమిన్ డీ స్థాయిలు పెరగడం వల్ల విటమిన్ కే2 స్థాయిలు ప్రభావితమవుతాయి. ఇది ఎముకల క్షీణతకు మరింత దారితీస్తుంది.
- విటమిన్ డి మోతాదు మించితే కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కిడ్నీల్లో వచ్చే పలు వ్యాధులు విటమిన్ డి ఎక్కువవడం వల్లనే. ఒకవేళ కిడ్నీ సమస్యలు ముందే ఉంటే.. డాక్టర్ సలహాతోనే విటమిన్ డి సప్లిమెంట్స్ ను వాడాలి.
- మానవ శరీరంలో విటమిన్ డి ఎక్కువయిందంటే.. కడుపునొప్పి వస్తుంది. దానితో పాటు మలబద్ధకం సమస్య వస్తుంది. వీటి వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణమవకపోవడం లాంటి సమస్యలు వస్తాయి.
విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం ఎక్కువవుతుందని తెలుసుకున్నాం కదా. శరీరంలో ఉండే అధిక కాల్షియం వల్ల వాంతులు, వికారంగా అనిపించడం, ఆకలి మందగించడం లాంటి సమస్యలు వస్తాయి. ఎప్పుడూ వాంతి చేసుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది.