మన దేశంలో అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఆలయంలో వెలసిన అమావారికి ఒక్కో విశేషం ఉంది. అయితే ఇక్కడ వెలసిన అమ్మవారి ఆలయంలో పూజారి లేకుండానే భక్తులే స్వయంగా అమ్మవారిని పూజించుకుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ వెలసిన అమ్మవారు ఎవరు? ఇంకా ఈ ఆలయంలోని విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విశాఖపట్నం నడిబొడ్డున వన్ టౌన్ లోని బురుజు పేట యందు వెలసిన ఒక గ్రామదేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఈ ఆలయం ప్రతి రోజు ఎంతో మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుండి కూడా కుటుంబసమేతంగా వచ్చి భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించి పూజించి తరిస్తారు. ఈ ఆలయంలో కుల మత, స్త్రీ, పురుష వివక్షత లేకుండా భక్తులెవరైనా మూలవిరాట్టును స్మృశించి పూజలను చేసుకొనే సంప్రదాయం ఇచట ఉంది. పురాణానికి వస్తే సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహం బురుజుపేటలో ఒక బావిలో దొరికిందని, అలా విగ్రహాన్ని చూసిన కొందరు స్థానికులు, దానిని వెలికి తీసి రహదారి మధ్యలో ప్రతిష్ట చేశారని చెబుతారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఎడమచేతి భాగం భుజం నుండి క్రింది భాగం ఖండితమవ్వగా, కుడిచేతిలో కలువమొగ్గను ధరించి, అర్ధనిమిళిత నేత్రాలతో కాంతులీనుతూ అమ్మవారు పూజలనందుకొనుచున్నది. ఈ ఆలయంలో ఉన్న విచిత్రం ఏంటంటే పూజారి మనకి కనిపించడు. పూజారితో పనిలేకుండా భక్తులే అమ్మవారిని స్వహస్తాలతో పూజించుకొనవచ్చును. 24 గంటలు ఈ ఆలయం భక్తులకు తెరిచే ఉంటుంది. ఒక సందర్భంలో పురపాలక సంగం వారు రోడ్డు వెడల్పు చేసే సందర్భంలో అమ్మవారి విగ్రహాన్ని అక్కడినుండి తొలగించి, రోడ్డుకు ఒక మూలగా పెట్టారు. ఆ సమయంలోనే విశాఖపట్టణంలో ప్రాణాంతకమైన ప్లేగువ్యాధి వ్యాపించింది. ఆ విధంగా వ్యాధి కారణంగా చాలా మంది చనిపోయారు. ఇందుకు కారణం గ్రామంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ని రోడ్డు మధ్య నుండి తొలగించడమే వలనే ఈ విపత్తు సంబవించిందేమో అని భావించి తిరిగి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి యధాస్థానంలో ప్రతిష్టించి తమ తప్పు క్షమించమని వేడుకొన్నారు. ఆవిధంగా అమ్మవారిని ప్రతిష్టించిన కొద్దీ రోజుల్లోనే ప్లేగు వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని ప్రతి సంవత్సరం చైత్రశుద్ద పాడ్యమి నాడు వెండి ఆభరణములతో అలంకరించి పూజిస్తారు. ఈ అమ్మవారికి గురువారం రోజున కానుకలు సమర్పించి, తమ మనసులోని కోర్కెలు తెలియచేస్తే అవి తప్పక నెరవేరుతయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.