ఇక్కడ వెలసిన రంగనాథుడు భక్తుల కోరిన కొరికేలు నెరవేరుస్తూ ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయంలోని శిల్ప సంపద, గాలిగోపురం అందరిని విశేషంగా ఆకట్టుకుంటాయి. మరి రంగనాథుడు కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండల పరిధిలోని, శ్రీ రంగాపూర్ లో రంగనాయక స్వామి ఆలయం ఉంది. సుమారు 340 సంవత్సరాల క్రితం వనపర్తి సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు క్రీ.శ.1670 కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. గ్రామంలో రంగసముద్రం పేరు గల చెరువు ఒడ్డున గరుడాద్రి మీద నిర్మించిన రంగనాయకస్వామి ఆలయం అపర శ్రీరంగంగా పేరొందింది. రంగనాయకస్వామి ఆలయం నిర్మాణంతో కొర్విపాడుగా పిలుచుకునే గ్రామం శ్రీరంగాపూర్‌గా వాడుకలోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో సుప్రసిద్ధ వైష్ణవపుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగంకు దీటుగా పాలమూరు జిల్లా శ్రీరంగపూర్ గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగం వెళ్లి స్వామివారిని దర్శించే శక్తి లేని భక్తులు శ్రీరంగాపూర్‌లోని ఆలయాన్ని దర్శించి తరించవచ్చని భక్తుల నమ్మకం. శ్రీరంగనాయకస్వామి ఆలయంలో నెలకొన్న అద్భుతమైన శిల్పసంపద భక్తులను కట్టిపడేస్తుంది. వివిధ శిల్ప సంప్రదాయాలతో, ద్వారపాలక శిల్పాలతో ఆకాశాన్నంటే అంతస్తులతో భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతోంది. శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో శ్రీలక్ష్మిదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. రంగనాయకస్వామి ఆలయంలో అడుగుపెట్టగానే కనిపించే గాలిగోపురం ఎన్నో విశిష్టతలను స్వంతం చేసుకుంది. 1804 సంవత్సరంలో రాణి శంకరమ్మ ఈ గోపురాన్ని కోయంబత్తూరు సుబ్బారావు అనే శిల్పిచేత నిర్మింపచేశారు. ఈ గోపురం ఐదు అంతస్థుల 60 అడుగులు ఎత్తుతో 20 అడుగుల ద్వారం కలిగి ఉంది. మొదటి అంతస్తులో క్రమపద్ధతిలో రామాయణగాథను వివరిస్తున్న శిల్పాలు ఉన్నాయి. తర్వాతి అంతస్థులలో వరుసగా అందమైన స్త్ర్రీ మూర్తుల చిత్రాలతోపాటు క్షీరసాగర మథనం, శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, ప్రణయ సన్నివేశాలు, రంగనాయక స్వామి స్వరూపం, నరసింహ అవతారం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి దేవతామూర్తుల చిత్రాలను అందంగా చెక్కించారు. ఈ గాలిగోపురం పైభాగాన సింహముఖంతో పూర్తిచేయబడి బంగారుపూతతో కూడిన ఏడుకలశాలు కనిపిస్తాయి. ఈ గాలిగోపురం ఆనాటి శిల్పసౌందర్యానికి ప్రతీకగా నిలిచింది.ఆలయం ప్రక్కనే ఆనాటి ప్రభువులు నిర్మించిన శ్రీరంగసముద్రం అనే సువిశాలమైన చెరువు చూపరులను ఆకట్టుకొంటుంది. చెరువు మధ్యలో రాజులు సాయంత్రం వేళల్లో విడిదిచేసే కృష్ణవిలాస్ భవనం కనిపిస్తుంది. ఆలయంలోని నేలమాళిగలో ఆనాటి చిత్రకళకు నిదర్శనంగా బంగారుపూత పూసిన అరుదైన దేవతామూర్తుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. ఈ సుందరమైన నేపథ్యంలో అనేక సినిమాలు, టీవీ సీరియళ్లను చిత్రీకరించారు. ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయ డానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రంగనాయకస్వామి ఆలయానికి సమీపంలో నిర్మించిన కోనేరు ఆనాటి అద్భుతమైన రాతికట్టడానికి నిలువుటద్దంగా నిలిచింది. ఈ కోనేరు పూర్తిగా రాతికట్టడాలతో నేటికి చెక్కుచెదరకుండా ఉండడమేగాదు… ఏనాడూ నీళ్లు ఎండిపోయిన పరిస్థితి రాలేదు. అన్నికాలాల్లోనూ నీటితో కళకళలాడుతూ ఉండడం విశేషం. చెక్కు చెదరని శిల్ప సంపద, ఆకాశాన్నంటే గాలి గోపురాలు, వర్ణించనలవి కాని అపురూప దేవతామూర్తుల చిత్రాలు, ఆలయం పక్కనే సువిశాల రంగసముద్రం చెరువు ఇలా ప్రతి ఒక్కటి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.