Home Unknown facts హనుమంతుడు అయోధ్యలోనే ఉండిపోవడానికి గల కారణం

హనుమంతుడు అయోధ్యలోనే ఉండిపోవడానికి గల కారణం

0

లంకలో రావణున్ని సంహరించిన తరువాత రాముడు తన వారందరితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. అప్పటివరకు రాముల వారి పాదరక్షలతో రాజ్యాన్ని ఏలిన శత్రజ్ఞుడు, భరతుడు అన్న రాకతో రాజ్యాన్ని రామునికి అప్పగించారు. రామునికి ఘనంగా పట్టాభిషేకం జరిగింది.

Sri Ramuduశ్రీరామపట్టాభిషేకం చాలా రోజుల పాటు అందరికీ కనులవిందుగా, సంబరంగా గడిచింది. అనంతరం ఒక్కొక్కరుగా వెళ్లి పోసాగారు. రాముడు అందరికీ తన కృతజ్ఞత తెలుపుకుని, తగిన విధంగా సత్కరించి సాగనంపాడు. భరతుడు వెంట రాగా జనక మహారాజూ, లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకుని కేకయమహారాజూ వెళ్లిపోయారు. భరతుడి ఆహ్వానం పైన వచ్చిన కాశిరాజు ప్రరత్థనుడూ ఇతర రాజులు కూడా తమ తమ దేశాలకు తిరిగి వెళ్లారు.

రాముడి వెంట వచ్చిన వానరులు, రాక్షసులు రెండునెలల పాటు అయోధ్యలో సుఖంగా గడిపి వారు కూడా బయలు దేరారు. తనకు యుద్ధంలో తోడ్పడిన సుగ్రీవుడు, అంగదుడు హనుమంతాదులను రాముడు సత్కరించాడు. వానరుల్లో చివరి వంతు హనుమంతుడిది. వెళ్ళిపోతున్న సందర్భంగా రాముడిని హనుమంతుడు ఇలా కోరాడు, ‘‘ప్రభూ! నా వినతి మన్నించు. నిత్యం నీ భక్తుడిగా ఉంటూ నిన్ను కొలుచుకునేలా నన్ను ఆశీర్వదించు. ఇలపై రామకథా పారాయణం కొనసాగుతున్నంత వరకు నేను జీవించి ఉండేలా నన్ను కరుణించు అని కోరుకున్నాడు.

హనుమంతుడు ఇలా కోరగానే రాముడు అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ‘‘హనుమా! ప్రజలు మా గాధ పారాయణం చేస్తున్నంత కాలం నీ కీర్తి దశదిశలా వ్యాపిస్తూనే ఉండుగాక. ఈ సృష్టి, ప్రపంచం ఉనికిలో ఉన్నంత వరకు నీవు చిరంజీవిగా వర్ధిల్లుదువుగాక.’’ అని రాముడు ఆశీర్వదించాడు. తనను విడిచి వెళ్ళడానికి మనసు రాక హనుమంతుడు దుఃఖిస్తూ ఉంటే తనదగ్గరే ఉండిపో అన్నాడు రాముడు.

రాముని మాటలు మన్నించి హనుమంతుడు అయోధ్యలో సంతోషంగా ఉన్నాడు. తర్వాత విభీషణుడికి, అతని రాక్షసులకు సన్మానాలు చేశాడు. వారందరూ బయలుదేరి కిష్కింధకూ, లంకకూ వెళ్లి పోయారు. అయోధ్యలో, అంతటా సుఖసంతోషాలు వెల్లివిరిసాయి.

 

Exit mobile version