ఇంటి ముందు ముగ్గులు వేయడం వెనుక ఉన్న రహస్యం

కోడికూతతో నిద్రలేచి, వాకిలూడ్చి, పేడనీటితో కళ్లాపిచల్లి ముంగిట్లో ఒద్దికగా ముగ్గులు వేయడం భారతీయ సంస్కృతి. స్పష్టంగా చెప్పాలంటే హైందవ సంప్రదాయం. ఒకప్పుడు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవారు. కానీ పట్టణీకరణ, నగరీకరణ పెరిగాక, అపార్ట్‌మెంట్‌ సంస్కృతి, సిమెంటు గచ్చులు, పాలిష్‌బండలు వచ్చాక నగరాల్లోనే కాదు, పల్లెటూళ్లలోనూ ముగ్గులు వేయడానికి చారెడు చోటు మిగలడం కూడా గగనమయిపోతోంది.

rangoliఅయినా సరే, కళ్లాపిచల్లడం కుదరకపోయినా, రంగవల్లులు తీర్దిదిద్డడం రాకపోయినా, కనీసం చాక్‌పీస్‌తో అయినా, ఉన్నచోటులోనే వాకిలిముందు ముగ్గేసే అలవాటు మర్చిపోవట్లేదు. అసలు ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారనే దానికి కచ్చితంగా ఇవీ అని కారణాలు తేల్చిచెప్పలేకపోయినా, ఏ ఇంటిముందయినా ముగ్గు పడలేదంటే, ఆ ఇంటిలో ఏదో అశుభం జరుగుతోందని అర్థం.

rangoliముగ్గుల చరిత్ర: ముగ్గులు ఎప్పటినుంచి వేస్తున్నారనేందుకు చారిత్రక ఆధారాలు లేకపోవచ్చు కానీ, పురాణ కాలనుంచే వేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రసక్తి, ప్రస్తావన కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది.

rangoliఅదేమంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజుండేవాడు. ఆయనకు ఒక గురువున్నాడు. ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంలో కూరుకుపోయిన గురువు బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుని బతికించమని కోరిన రాజగురువుతో బ్రహ్మదేవుడు, నీతో సహా రాజ్యప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి, శుభ్రం చేసి, ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు.

rangoliరాజాజ్ఞమేరకు రాజ్యప్రజలంతా కలసి వాకిళ్లు ఊడ్చి, వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. రాజగురువు తన ఇంటిముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి, అతని కుమారుని బతికిస్తాడు. అప్పటినుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి, ముగ్గులు గీయడం అలవాటు చేసుకుంటారు.

rangoliముగ్గువేసి దానికి రెండువైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతోందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటినుంచి బయటకెళ్లి పోతుందని పెద్దలు చెబుతారు. దేవతాపూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డు గీతలు తప్పనిసరి.

ఏ ఇంటిలోనైనా ఇంటిలోని వాళ్లు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు కానీ, ముగ్గు మాత్రం వెయ్యరు. అలా ముగ్గు లేని ఇంటికి భిక్షకులు, సాధుసన్యాసులు భిక్షకు కూడా వెళ్లరు. అందుకనే రోజూ పొద్దునా సాయంత్రం వాకిలి ఊడ్చి ముగ్గువెయ్యడమనేది విధిగా భావిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR