Remembering Iconic Characters From K. Vishwanath Gari Movies On His Birth Anniversary

0
1869

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దిగ్గజ దర్శకుల్లో మనకు వెంటనే గుర్తొచ్చే పేరు.. కళాతపస్వి కే విశ్వనాథ్ గారు. కాశీనాథుని విశ్వనాథ్ గారు సంగీత ప్రధానమే కాకుండా కమర్షియల్ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. కానీ, సంగీత ప్రధాన చిత్రాలకు విశ్వనాథ్ గారు పెట్టింది పేరుగా చరిత్రలో నిలిచిపోయారు. అనవసరమైన హంగులు, ఆర్భాటాలు లేకుండా మన చుట్టూ రోజూ కనిపించే మనుషులే ఆయన సినిమాల్లో పాత్రలుగా కనిపిస్తుంటాయి. ఈ రోజు ఆ విశ్వనాథుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కాసేపు..

ఎంత పెద్ద స్టార్ డమ్ ఉన్న హీరో అయినా విశ్వనాథ్ గారి సినిమాల్లో తనను తాను పాత్రకి తగ్గట్లుగా మలుచుకోవాల్సిందే. అలా పాత్రలో ఒదిగేలా, లీనమయ్యేలా ఆ హీరోని మార్చుకుంటారు విశ్వనాథ్ గారు. అదే విధంగా హీరోయిన్స్ చాలా సాదాసీదాగా, అచ్చ తెలుగు అమ్మాయిల్లా కనిపిస్తారు ఆయన సినిమాల్లో. హీరోయిన్స్ ని విశ్వనాథ్ గారు డీ గ్లామరస్ గా చూపిస్తారనే ఓ టాక్ ఉంది. అయినప్పటికీ ఎంతో మంది హీరోయిన్స్ ఆయన సినిమాల్లో ఒక్కసారైనా నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎదురుచూసేవాళ్లట అప్పట్లో. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. ఆయన సినిమాల్లో హీరో, హీరోయిన్లు ఉండరు.. ఇచ్చిన పాత్రకి ప్రాణం పోసి చక్కగా అభినయించే నటీనటులే కనిపిస్తారు.

అలాంటి జీవం ఉట్టిపడే పాత్రలు విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎన్నో చూసి ఉన్నాం మనం. ఒకసారి ఆ పాత్రలో ఆ నటీనటుల్ని చూశాక మరెవ్వరినీ అక్కడ ఊహించుకునే అవకాశమే ఉండదు. అలా ఆ పాత్రలో ఒదిగిపోయి, వాళ్ల కోసమే అవి పుట్టయేమో అనేంతగా మనల్ని మరిపిస్తాయి. అలాంటి కొన్ని విశ్వనాథ్ గారు సృష్టించిన అద్భుతమైన పాత్రలు, అందులో జీవించిన నటుల గురించి మాట్లాడుకుందాం.

1. శంకరశాస్త్రి (శంకరాభరణం)

శంకరశాస్త్రిముందుగా ఈ పాత్రకి విశ్వనాథ్ గారు అనుకున్న నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు గారు. కానీ కొన్ని కారణాల వల్ల సోమయాజులు గారు చేయాల్సి వచ్చింది. సినిమాకి ఆయువుపట్టు లాంటి శంకరశాస్త్రి పాత్రకి నిజంగా సోమయాజులు గారు ప్రాణం పెట్టేశారు. సంగీత విద్వాంసుడిగా, సద్బ్రాహ్మనుడిగా ఆయన చేసిన పాత్ర ఏదో కల్పించి రాసినట్లు ఉండదు. ఇక ఈ పాత్ర తాలూకు ప్రభావం సోమయాజులు గారిని చాలా రోజుల వరకు విడిచిపెట్టలేదు. ఇక ఆ తర్వాత వేరే ఎలాంటి పాత్రల్లో కూడా ఆయన్ని చూడడానికి ఇష్టపడలేదట ప్రేక్షకులు.

2. తులసి (శంకరాభరణం)

తులసి‘శంకరాభరణం’లో తులసి పాత్రకి మంజుభార్గవి గారిని తీసుకోవడం పెద్ద సాహసమే. ఎందుకంటే.. అంతకు ముందు సినిమాల్లో ఆవిడ కొన్ని వ్యాంప్ లాంటి పాత్రల్లో కనిపించారు. అలాంటి గుర్తింపు ఉన్న మంజుభార్గవిని ఇలాంటి సినిమాలో ఇంత పెద్ద పాత్రకి ఎంచుకోవాలని విశ్వనాథ్ గారికి ఎలా తట్టిందో మరి. వేశ్యాగృహంలో పుట్టి పెరిగి.. సంగీతం, నాట్యమే తన ప్రాణంగా ఈ సినిమాలో తులసి పాత్ర ఉంటుంది. ‘కులమేదైనా.. తులసి, నిజంగా తులసి మొక్కంత పవిత్రురాలు’ అని ఈ సినిమాలో తన పాత్ర గురించి ఒక్క మాటలో వివరించారు విశ్వనాథ్ గారు.

3. శివయ్య (స్వాతిముత్యం)

శివయ్యకల్లాకపటం ఎరుగని పసిపాప మనసు ఈ సినిమాలో శివయ్యది. ఇలాంటి ఒక అమాయకమైన పాత్ర ద్వారా కమల్ హాసన్ లాంటి నటుడు మరోసారి తనలోని నట ‘విశ్వ’రూపాన్ని మనకు పరిచయం చేశారు. మరే హీరో కూడా ఈ పాత్ర చేసినా ఇంత గొప్పగా వచ్చేది కాదేమో కదా. ఏ కల్మషం ఎరుగని నిర్మలమైన మనసు, చెప్పింది చెప్పినట్లుగా చేసే పట్టుదల, దీక్ష కూడిన ‘స్వాతిముత్యం’ ఈ సినిమాలో మన హీరో. విశ్వనాథ్ గారు సృష్టించిన ఈ పాత్ర, కమల్ దాన్ని అభినయించిన విధానం న భూతో.. న భవిష్యతి..

4. బాలు (సాగర సంగమం)

బాలుబాలు.. జీవితంలో ఓడిపోయిన ఒక సగటు మనిషి. ఒక ఫెయిల్యూర్. మాసిన గడ్డం, పాత చొక్కా, భుజానికి సంచి, అందులో మందుసీసా… చూడగానే వీడేంటి ఇలా ఉన్నాడు అని అనిపించే ఒక పాత్రలో కమల్ ని మనం చూడగలమా..? సినిమా మొదట్లోనే ఒక రిక్షావాడు తన మీదికి చెప్పులు విసురుతాడు. ఒక మహానటుడికి అలాంటి ఇంట్రడక్షన్ ఎవరైనా పెడతారా అసలు..? హీరో ఏదైనా చేయగలడు, హీరోకి పోటీ ఎవరూ లేరు అనేలా గొప్పగా ఎవరైనా చూపించగలరు. కానీ, ఒక ఫెయిల్యూర్ మనిషి కథని ఇలా ఎవరు చెప్తారు..? ఒక్క విశ్వనాథ్ గారు తప్ప.. ఆ పాత్రకి జీవం ఎవరు పోస్తారు..? ఒక్క కమల్ తప్ప.

5. సాంబయ్య (స్వయంకృషి)

సాంబయ్యఅప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించి, డాన్స్ కి మారుపేరుగా ఒక ఊపు ఊపేస్తూ మెగాస్టార్ అని పిలిపించుకుంటున్న మన చిరంజీవి గారు.. చెప్పులు కుట్టే ఇలాంటి పాత్రలోనా..? ఎంత నమ్మి ఆ పాత్రని చేయడానికి ఒప్పుకుని ఉంటారో కదా.. ఒక మెగాస్టార్ ని అలాంటి పాత్రలో చూపించి సినిమాని నడిపించగలను అని విశ్వనాథ్ గారికి ఏంటీ అంత ధైర్యం అసలు..! కష్టాన్ని నమ్ముకుని నిస్వార్థంగా బతికే సాంబయ్య పాత్రలో చిరు ఒదిగిపోయారు ఈ సినిమాలో.

6. లలిత (స్వాతిముత్యం)

లలితఅప్పటికే టాప్ హీరోయిన్ రాధిక గారు. అప్పటి హీరోలందరి పక్కన నటిస్తూ స్టార్ డమ్ చూస్తున్న టైం అది. అలాంటి రాధిక గారు.. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ‘స్వాతిముత్యం’ సినిమాలో మొదటి సీన్ లోనే నుదుటిపై బొట్టు లేకుండా ఒక విధవరాలిగా, ఒక బిడ్డకి తల్లిగా కనిపిస్తారు. గ్లామర్ రోల్స్ లో అందంగా కనిపించాలనుకునే ఒక హీరోయిన్ అలా కనిపించడం, ఎక్కువ మాటలు లేకుండా కళ్లతోనే భావాలు పలికించడం, అది కూడా లోక నాయకుడు కమల్ కి పోటాపోటీగా నటించడం అన్నీ సాహసాలే.

7. గంగాధరం (స్వాతికిరణం)

గంగాధరంమన చిన్నప్పుడు మాల్గుడి కథలు అని ఓ సీరియల్ ప్రతి ఆదివారం వచ్చేది.. గుర్తుందా..? అందులో స్వామిగా మనకు బాగా దగ్గరైన మాస్టర్ మంజునాథ్.. ఈ సినిమాలో గంగాధరం పాత్రలో చక్కగా నటించాడు. చిన్నతనంలోనే సంగీతంలో మంచి పట్టు సాధించి, గురువుకే ఈర్ష్య తెప్పించేంత బాల గంధర్వుడిగా మాస్టర్ మంజునాథ్ జీవించేశాడు. ఒకవైపు మమ్ముట్టి గారు, మరోవైపు రాధిక గారి లాంటి సీనియర్ నటులతో పోటీగా నటించడం అంటే మామూలు విషయం కాదు. మరీ మరీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే… ఈ సినిమా పాటల్లో ఉండే కష్టమైన పదాలకు, స్వరాలకు ఎక్కడా అతని లిప్ సింక్ మిస్ అవ్వదు. అంత చక్కగా తానే పాడాడేమో అన్నంతగా పాత్రలో లీనమైపోయాడు.

8. మాధవయ్య (శంకరాభరణం)

మాధవయ్య‘శంకరాభరణం’ చిత్రానికి మరొక హీరో ఎవరైనా ఉన్నారంటే అది.. ఈ సినిమాలో ఈ పాత్రే. లాయర్ మాధవయ్య పాత్రలో అల్లు రామలింగయ్య గారు అద్భుతంగా నటించారు. అందరూ సంగీత దేవుడిగా మొక్కే శంకరశాస్త్రిని ఏరా, ఒరేయ్ అని పిలిచే ఒకే ఒక పాత్ర ఈ మాధవయ్య. శంకరశాస్త్రికి మంచి స్నేహితుడిగా.. ఒక వైపు పెద్దరికం ప్రదర్శిస్తూనే మరోవైపు తన కామెడీ టైమింగ్ ని ఎక్కడా వదలకుండా సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేశారు అల్లు గారు. ఈ పాత్రని ఆయన తప్ప మరెవరూ చేయలేరు అనడంలో సందేహమే లేదు.

9. సుభాషిణి (సిరివెన్నెల)

సుభాషిణిసుహాసిని గారు చేసిన అద్భుతమైన పాత్రల గురించి చెప్పాల్సినప్పుడు.. మనం ముందుగా ‘సిరివెన్నెల’ సినిమాలో చేసిన ఈ సుభాషిణి పాత్రను తప్పక గుర్తు చేసుకోవాల్సిందే. హీరోయిన్ పాత్రకి మంచి మంచి డైలాగులు ఉంటే ఎంతైనా బాగా నటించి మెప్పించగలరేమో. కానీ, ఈ సినిమాలో హీరోయిన్ మూగ అమ్మాయి. కేవలం సైగలు చేస్తూ మొహంలోనే అనుకున్నది చూపించాలి. ఎంత కష్టమో కదా..!

10. రాము (చెల్లెలి కాపురం)

రాముఅందాల నటుడు అంటేనే శోభన్ బాబు. మరి అలాంటి సోగ్గాడిని నల్లగా చూపించి హీరో అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. అప్పట్లో ఈయనకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉండేదట. అలాంటి అందాల హీరో ఈ సినిమా కోసం రాము అనే డీ గ్లామరస్ రోల్ చేసి సాహసం చేశారు. మరీ ముఖ్యంగా దర్శకులు విశ్వనాథ్ గారి మీద నమ్మకమే అలా చేయించిందేమో కూడా.

ఇవే కాదు.. కళాతపస్వి విశ్వనాథ్ గారు తీసిన ఎన్నో సినిమాల్లో, మరెన్నో ఆణిముత్యాల్లాంటి పాత్రలు ఉన్నాయి. తెర మీద ఆ పాత్రలకి జీవం పోసేవారు మన నటీనటులు అయితే.. వాటిని ఇంత గొప్పగా ఊహించి, తెర మీద ఇంత అద్భుతంగా చూపించారు కళాత్మక దర్శకులు విశ్వనాథ్ గారు. ఆయన మన తెలుగువాడు అవడం నిజంగా మనం గర్వపడాల్సిన విషయం. ఆ మహానుభావుడికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. సెలవు.