దోమ… ఈ పేరు వినగానే చిన్న భయం కలుగుతుంది గుండెలో. ఉండదా మరి చూడడానికి చిన్న ప్రాణేగాని అది తెచ్చి పెట్టే అనర్థాలు ఎన్నో. కాస్త చినుకులు పడితే, మురుగు కాలువలు పొంగితే చాలు విజృంభిస్తాయి. సాయంత్రం అయితే చాలు అందరి రక్తం పీల్చేందుకు సిద్ధమైపోతాయి. మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, ఎల్లో ఫీవర్… వంటి ప్రాణాంతక జ్వరాల బారినపడేలా చేస్తూ మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మంది దోమకాటు వల్ల వ్యాధులకు గురవుతుంటే, వాళ్లలో పది లక్షల మందికి పైగా చనిపోతున్నారట. పది నుంచి నలభై కోట్ల మంది డెంగీ బారినపడుతున్నారట.
కొన్ని ప్రాంతాల్లో అయితే ఏ కాలంలో అయినా దోమలు స్వైరవిహారం చేస్తుంటాయి. మురికి కాల్వలు, నీరు నిల్వ ఉండడమే అందుకు కారణం. అందుకే వర్షాకాలం వచ్చిందంటే ప్రభుత్వాలు దోమలపై యుద్ధం ప్రకటిస్తుంటాయి. వాటిని తరిమేందుకు సాధారణంగా రసాయనాలు వాడుతుంటారు. మనం కూడా ఆలౌట్, కాయిల్స్, ధూపం, క్రీములు అంటూ రకరకాల ఆయుధాలను వాటిపై ప్రయోగిస్తాం. వాటి ప్రభావం దోమల మీద ఎంతుంటుందో కానీ మన మీద మాత్రం బీభత్సముగా ఉంటుంది.
దోమలను తరమబోయి విష రసాయనాలతో మన ప్రాణం మీదకి తెచ్చుకుంటాం. అయితే సహజ పద్ధతుల్లో, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో దోమలను పారదోలవచ్చని నిపుణులు చెబుతున్నారు. దోమలను తరిమి కొట్టాలంటే కృత్రిమ రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు.. సహజసిద్ధమైన మొక్కలతోనూ వాటిని తరిమికొట్టొచ్చు.. కొంతమంది ఇంటి చుట్టూ మొక్కలను పెంచితే దోమలు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు.. అయితే కొన్ని రకాల మొక్కలను పెంచితే దోమలు ఇంట్లోకి దరిచేరనివ్వవు. మరి ఆ మొక్కలేంటో అర్జెంటుగా తెలుసుకుందామా…
దోమలను తిప్పికొట్టే సామర్థ్యం ఉన్న కొన్ని మొక్కలు ఉన్నాయి. అవును ఇంటి చుట్టు, పరిసర ప్రాంతాల్లో కొన్ని చెట్లు నాటితే దోమలు దరిచేరవు. తలుపుల దగ్గర, బాల్కనీలో లేదా తోటలో దోమలను నివారించడంలో కొన్ని మొక్క జాతులు సహాయపడతాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది తులసి మొక్క. తులసి మొక్క దాని ఔషధ గుణాలకు మాత్రమే కాకుండా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. అత్యంత సహజసిద్ధమైన దోమ వికర్షణ మొక్క ఇది. సాధారణంగా ప్రతి ఇంట్లో కచ్చితంగా ఒక తులసి మొక్క ఉంటుంది.. ఇది దోమలనే కాకుండా అనేక క్రిమికీటకాలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది.
సువాసన, దోమలను దూరంగా ఉంచడంతో పాటు, తులసి ఆకుల నుంచి తీసిన రసాన్ని దోమ కాటుపై పూస్తే గొప్ప ఉపశమనం లభిస్తుంది.
దోమలు, ఇతర కీటకాలను దూరంగా ఉంచే సామర్థ్యం ఉన్న మరొక మొక్క వేప. ఈ చెట్టును ఇంటి బయట నాటడం వల్ల ఇంట్లో దోమల దాడి తగ్గుతుంది. అనేక దోమ వికర్షక ఉత్పత్తులు వేపను క్రియాశీల పదార్ధంగా ఉపయోగిస్తాయనే వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దాని సామర్థ్యాన్ని నిర్ణయించవచ్చు. బంతి పువ్వ వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. ఈ మొక్కను తోటలో లేదా బాల్కనీలో చిన్న కుండలో చాలా తేలికగా పెంచవచ్చు. దీంట్లో ఉండే పైరిథ్రమ్ అనే రసాయనం దోమలను తరిమి కొడుతుంది. తలుపులు, కిటికీలు, వంటగది దగ్గర ఈ మొక్కలను దోమలు ఇంటి చుట్టు పక్కలకు దరిచేరవు.
రోజ్మేరీ పువ్వుల సువాసన కూడా దోమలను తిప్పికొడుతుంది. దోమలను ఇంటి నుంచి దూరంగా ఉంచడానికి, రోజ్మేరీ పువ్వులను నీటిలో నానబెట్టి, ప్రతిచోటా చల్లడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సిట్రొనెల్లా దోమల నుంచి రక్షించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని సువాసన డెంగ్యూ వ్యాప్తి చెందుతున్న దోమలను కూడా దూరంగా ఉంచుతుంది. వేప మాదిరిగానే, సిట్రొనెల్లా కూడా అనేక దోమల వికర్షక ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది. ఈ జాబితాలో అజిరేటమ్ కూడా ఒకటి. దోమలకు నచ్చని ప్రత్యేకమైన ఘాటు వాసన ఈ చెట్టు నుండి వస్తుంది. అందుకే దోమల నిరోధకాలు తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దీని ఆకులు నలిపి రసం చర్మంపై రాసుకుంటే దోమలు కుట్టవు.
సువాసనలు వెదజల్లే లావెండర్ మొక్క కీటకాలను ఇంటిలోకి రానివ్వదు. దోమలు ఇతర కీటకాలను తరిమి కొడుతుంది. క్యాట్ మింట్ నూనెలను దోమల నివారణ మందులలో ఉపయోగిస్తారు పర్ఫ్యూమ్ తయారీ లలో కూడా దీనిని ఉపయోగిస్తారు. క్యాట్నిప్ అనేది పుదీనా కుటుంబానికి చెందిన మొక్క. ఇది సూర్యుడు, నీడ రెండింటిలోనూ పెరుగుతుంది. దీని పువ్వులు తెలుప, లావెండర్ రంగులో ఉంటాయి. ఇదే కోణంలో నిర్వహించిన అధ్యయన ఫలితాలు క్యాట్నిప్ డీఈఈటీ (పురుగుమందు) కంటే 10 రెట్లు ఎక్కువ ప్రభావవంతమైనదని వెల్లడించింది.
దోమలను తరిమికొట్టడంలో గుర్రపుడెక్క కూడా చాలా సహాయపడుతుంది. ఈ శాశ్వత మొక్కకు సాధారణంగా ఎలాంటి సంరక్షణ అవసరం లేదు. ఇది ఘాటైన వాసన కలిగి ఉంటుంది . దాని నూనెలో ఉన్న థైమోల్ కారణంగా, ఇది యాంటీ ఫంగల. యాంటీవైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంది.