శివ పార్వతుల వివాహం జరిగే సందర్భంలో ఆగ్రహానికి గురైన శివుడు బ్రహ్మ తలని నరికివేసాడని అందుకు బ్రహ్మ హత్య పాతకం పోగొట్టేందుకు ఎన్నో విధాల ప్రయతించిన శివుడు ఒక ఆలయం వద్ద దాని నుండి విముక్తి పొందాడని పురాణాలూ చెబుతున్నాయి. మరి శివుడు బ్రహ్మ తలని ఎందుకు నరికివేసాడు? బిక్షాయటన ఎందుకు చేసాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బదరీనాధ్‌లోని ఆలయం అలకనంద అనే నది ఒడ్డునే ఉంది. ఆలయం దగ్గర నుంచి నది ఒడ్డు వెంటే, పొడవుగా ఉన్న మెట్లమీదుగా నడుచుకుంటూ సుమారు 50 గజాలు వెళితే, అక్కడ నది ఒడ్డు పైన సుమారు పది అడుగుల పొడుగు, ఆరు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల మందం ఉన్న ఒక బండ ఉంది. అదే మనం చెప్పుకునే బ్రహ్మకపాలం. ఆ బ్రహ్మ కపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తే, వారికి స్వర్గప్రాప్తి కలుగు తుందని విశ్వాసం.
ఇక పూర్వం శివ పార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు , బ్రహ్మ పంచముఖుడు, నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కాని, ఆయన ఊర్ద్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహవశమై చూస్తుండిపోయింది అది గ్రహించిన పరమ శివునికి ఆగ్రహం వచ్చి శివుడు బ్రహ్మ తలని నరికివేస్తాడు. అయితే బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కాని అది కింద పడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది ఎంత విదిలించిన అది ఆయన చేయిని వదలలేదు క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేయగా దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది.
అయితే అది బ్రహ్మ హత్యా పాతకంగా మరి శివుడికి అంటుకుంది. ఇక ఆ పాపం పోగొట్టుకోవడానికి శివుడు కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతీచోటా తన పాపం చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళాడు. ఇలా భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుచూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నడు అందుకు సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను, నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడివద్దకు వచ్చి పరమశివా నీ అధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడట. నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు, పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు, అప్పటినుండి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడా వెలిశాడు.
ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదెరాడు, ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు, పరమ శివుదే నాదగ్గరికి భిక్షకి వస్తున్నాడు, వాస్తవానికి ఇది ఆయన ఇల్లే, తన ఇంటికే ఆయన భిక్షకు వస్తున్నాడు అంటే అది ఆ మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట, ఈ అద్భుత సన్నివేశాన్ని జగత్విదితం చేయాలి, ఇది వాస్తవానికి శివక్షేత్రం, ఇందులో నేను ఉన్నాను, ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు, చిరకాల శివ హస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్ని నశించిపోయాయి, ఇప్పుడది పరమపవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి, దానికితోడు విష్ణు శక్తి, శివ శక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తు విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు, అంతే ఆ కపాలం కాస్తా ఊడి క్రిందపడిపోయి శిలామయ శివలింగరూపంగా మారిపోయింది, అప్పటి నుండి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగరూపధారి అయిన బ్రహ్మకపాలం మహా క్షేత్రమైంది, తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గం అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది.