పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఉహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానం లోని విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. అయితే పూర్వం బ్రహ్మం గారు నివసించిన ప్రదేశం, ఆయన తపస్సు చేసిన ప్రదేశం ఇక్కడే అని చెబుతుంటారు. అంతేకాకుండా బ్రహ్మం గారు జీవసమాధి అయినా ఈ ప్రదేశంలో ఆ స్వామికి ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజలు చేస్తున్నారు. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? బ్రహ్మం గారు దర్శనం ఇచ్చే ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వై.ఎస్.ఆర్. కడప జిల్లా, మైదుకూరుకు సుమారు 24 కి.మీ. దూరంలో కందిమల్లయ్య పల్లి అనే గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పేరుగాంచిన పురాతనమైన మఠము. అయితే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారిని విష్ణువు యొక్క అవతారంగా కొందరు భక్తులు కొలుస్తారు. మరికొందరు ఏమో యోగి పుంగవుడు అంటారు. ఈ స్వామివారు యాగంటిలో వెలసిన శివలింగమును ఆరాధించి ప్రముఖ శివభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు. అయితే క్రీ.శ. 1608 లో వీరబ్రహ్మం గారు అవతరించి భవిష్యత్తులో జరుగబోయే విపత్తులను ఆయన ముందుగానే దర్శించి, దానినే కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు. వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. ఈయన మూఢనమ్మకాలు, మూఢ భావాలను ఖండించారు. ఇంకా చెడుని విమర్శించి మంచిని బోధించారు. వారి బోధనలు విశ్వ కల్యాణానికి విశ్వశాంతికి దోహదం చేసాయి. వీరబ్రహ్మేంద్రస్వామి వారి హితవులు కుల, మత, ప్రాంతాలకి అతీతంగా ఉంటాయి. బ్రాహ్మణుడు అయినా అన్నాజయ్యను, రెడ్డి కుల స్త్రీ అయినా అచ్చమ్మను, మహమ్మదీయుడైన సిద్దయ్యను, మాదిగ అయినా కక్కయ్యను తన శిష్యులుగా స్వీకరించి కులరాహిత్య సమాజమకు కొరకు, సర్వమానవ సౌబ్రాతృత్వము కొరకు ఎంతో కృషిచేశారు. ఇక క్రీ.శ. 1694 వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు భక్తుల సమక్షంలో జీవసమాధి యందు ప్రవేశించారు. ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి జీవసమాధితో పాటు, శ్రీ వీరబ్రహ్మం గారి మనువరాలు శ్రీ ఈశ్వరమ్మగారి ఆలయం, ఆమె తపస్సు చేసిన గృహం, బ్రహ్మం గారు నివసించిన గృహం, కక్కయ్య గారి సమాధి, పోలేరమ్మ నివసించిన వేప చెట్టు, సిద్దయ్య గారి మఠం, కాలజ్ఞానం పాతర మొదలగునవి దర్శించవచ్చును. అయితే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పినవిధంగానే వారి కుమార్తె అయినా వీరనారాయణమ్మ వంశంలోని వారు వంశపారంపర్యంగా పిఠాదిపత్యమును, మఠాధిపత్యమును స్వీకరిస్తున్నారు. ప్రస్తుత పీఠాధిపతి అయినా వీరభోగవసంత వెంకటేశ్వరస్వాముల వారు శ్రీ వీరణాయణమ్మ వంశంలో ఏడవ తరమునకు చెందినవారు. ఇంకా మఠాధిపతులలో 11 వ మఠాధిపతి.ప్రతి సంవత్సరం వేలాది భక్తులు దీక్ష వహించి బ్రహ్మం గారి మఠమునకు వచ్చి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి జీవసమాధిని భక్తి శ్రద్దలతో దర్శిస్తారు.