దోసకాయ కూర చేసుకుని వండుకు తింటాం కాబట్టి అది కూడా కూరగాయ అనే కొంతమంది అనుకుంటారు. కానీ అది ఒక ఫలం. ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు, ఎక్కువ శాతం నీళ్ళు, ఎక్కువ ఫైబర్ అన్నీ కలిపి దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి దోసకాయ చాలా సాయం చేస్తుంది. 300గ్రాముల దోసకాయలో కేవలం 11ఔన్సుల కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఎన్ని దోసకాయలు తిన్నా శరీరం బరువెక్కకుండా తేలికగా ఉంటుంది.
అలాంటి అధిక శాతం పోషక విలువలు కలిగి ఉన్న దోసకాయని ఆహారంలో భాగం చేసుకుని దాన్నుండి వచ్చే ప్రయోజనాలని పొందాల్సిందే. కీర మన శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీ హైడ్రేషన్ కి గురికాకుండా ఉండేందుకు దోసకాయలు చాలా ఉపయోగపడతాయి. నీరు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. శరీరంలో సరైన పాళ్లలో నీటిశాతం ఉంటే జీవక్రియ పనితీరు మెరుగు అవుతుంది. శరీరంలోని చక్కెరశాతాన్ని తగ్గిస్తుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
కీరదోస రసంలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీనిలో దొరికే విటమిన్ ‘కె’ నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఎముకల్ని దృఢంగా ఉంచడంలోనూ కీలకపాత్ర వహిస్తుంది. అజీర్తితో ఇబ్బంది పడేవారు కీరదోసను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. దీనిలో ఉండే ఖనిజ లవణాలు ఉదర సంబంధిత సమస్యలతో పోరాడతాయి. అజీర్తి లేకుండా చూస్తాయి. దీన్లోని మేలు చేసే కార్బోహైడ్రేట్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడతాయి.
నోటి దుర్వాసనతో బాధపడేవారు కీరదోస ముక్కల్ని నమిలితే ఫలితం ఉంటుంది. చిగుళ్లకు సంబంధించిన సమస్యలూ దూరమవుతాయి. అయితే అధిక శాతం పోషక విలువలున్న దోసకాయలని దాని తోలు తీయకుండానే తినాలి. తోలు తీసేసి తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ శాతం తగ్గిపోతుంది. అందుకే తోలు తీయని దోసకాయలు చాలా మేలుచేస్తాయి.
ఇక దోసకాయతో చర్మానికి చాలా ఉపయోగాలున్నాయి. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు దోసకాయ ఉపయోగపడుతుంది. చర్మంపై మచ్చలు పోవడానికి దోసకాయను తేనెతో కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల చర్మంపై మచ్చలు మాయమవుతాయి.