భారతీయ వంటకాల్లో, ఆహారపు అలవాట్లలో నెయ్యికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. కొందరికి కంచంలో నెయ్యి పడనిదే ముద్ద దిగదు. కానీ బరువు తగ్గాలని ప్రయత్నించేవారు మొదట చేసే పని కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం. అందులోనూ నెయ్యిని తమ డైట్ చార్ట్ నుంచి తీసేస్తుంటారు. వాస్తవానికి తగిన మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల అది శరీరం అధిక బరువును తగ్గించడంలో సాయం చేస్తుందట.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని కొన్ని అధ్యయనాలే చెబుతున్నాయి. నెయ్యిలో ఉండే పోషకాలు శరీరంలో ఉండే కొవ్వును కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తాయట. కాకపోతే.. నెయ్యిని ఎంత పరిమాణంలో తీసుకున్నారనేదానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది.
నెయ్యిలో ఎంత కొవ్వుంటుంది?
నెయ్యిలో 99.9 శాతం కొవ్వే ఉంటుంది. మిగిలిన 0.01 శాతం మాత్రం తేమ ఉంటుంది. ఈ కొవ్వులో విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. నెయ్యిలో మనకు అవసరమైన డీహెచ్ఏ ఉంటుంది. డీహెచ్ఏ అంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లం. మన ఆహారంలో డీహెచ్ఏ తప్పనిసరిగా ఉండాలి. ఇది క్యాన్సర్, హార్ట్ ఎటాక్, ఆర్థరైటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఏడీహెచ్ డీ వంటి సమస్యలను రాకుండా చేస్తుంది. అలాగే కొవ్వు కణాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
బరువు తగ్గడానికి నెయ్యి ఎలా సాయం చేస్తుంది?
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్(డీహెచ్ఏ), ఒమెగా 6(సీఎల్ఏ) ఉంటాయి కాబట్టి బరువు తగ్గే విషయంలో నెయ్యి మనకు సాయం చేస్తుంది. ఇవి రెండూ కొవ్వు కణాలు కరిగిపోయేలా చేస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు నెయ్యిని నిరభ్యంతరంగా ఆహారంగా తీసుకోవచ్చు. కాకపోతే నెయ్యిలో 99 శాతం కంటే ఎక్కువే కొవ్వు ఉండటం వల్ల దీని విషయంలో కాస్త పరిమితిని పాటించాల్సి ఉంటుంది. రోజుకి ఒకటి రెండు చెంచాల వరకు నెయ్యి తినొచ్చు.
నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా అయ్యేలా చేస్తాయి. కురులు ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా పేగుల ఆరోగ్యాన్ని, కంటి చూపు మెరుగుపడేలా చేస్తాయి. నెయ్యి శరీరంలోని టాక్సిన్లను సైతం బయటకు పంపిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ప్రాధాన్యమిచ్చారు.
అయితే నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తున్నప్పటికీ దాన్ని పరిమితిని మించి తీసుకోకూడదు. ఎందుకంటే.. అతి ఎప్పుడైనా చెడే చేస్తుంది. అలాగే కొవ్వు కణాలను కరిగించే ఒమెగా ఫ్యాటీ ఆమ్లాల కోసం నెయ్యే తినాల్సిన అవసరం లేదు. నెయ్యికి ప్రత్యామ్నాయంగా అవిశె గింజలు, వాల్ నట్స్, చేప నూనె కూడా తీసుకోవచ్చు.