సాధారణంగానే పురుషులతో పోలిస్తే మహిళల శరీరం కాస్త సున్నితంగా ఉంటుంది. అందుకే ఆరోగ్య సమస్యల్లోనూ ఆ తేడాలు కనిపిస్తుంటాయి. ఇక మనదేశంలో మహిళలు ఇంటిపనులు చక్కబెట్టుకుంటూనే ఆఫీసు పనులూ చేస్తుంటారు. ఇలా అదనంగా పనులు చేయడం వల్ల ఎక్కువగా అలసిపోతుంటారు. కొంతమందైతే తమ ఆరోగ్యం, ఆహరం విషయంలో కూడా శ్రద్ధ చూపించరు. అందుకే వారికి సరైన పోషణ చాలా అవసరం.
అలాంటిది ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణం కాబట్టి మహిళలు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ టైమ్ లో కొన్ని ముఖ్యమైన సూచనలు పాటిస్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ఇమ్మ్యూనిటీ పెంచుకునే విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదు. మరి కరోనా టైమ్ లో మహిళలు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కరోనా అనే కాదు ఏ రకమైన వైరస్ అయినా, అనారోగ్యమైన సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దానికి కావాల్సింది ఇమ్మ్యూనిటీ పవర్. అందుకే ఇమ్మ్యూనిటీ పవర్ పెంచే విటమిన్ సి మహిళలకి చాలా అవసరం. సిట్రస్ ఫలాలైన నిమ్మ, జామ, బత్తాయి, నారింజ మొదలగు ఫలాల్లో సి విటమిన్ అధిక మొత్తంలో లభిస్తుంది. దానివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
ఇక రెండోవది నీళ్లు ఎక్కువగా తాగడం. కావాల్సినన్ని నీళ్ళు తాగడం వల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అందులోనూ ఇది సమ్మర్ కాబట్టి, శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేస్తూ ఉండాలి. లేదంటే నిర్జలీకరణానికి గురై నీరసం వస్తుంది. అది అనేక సమస్యలకు దారి తీస్తుంది.
సమ్మర్ లో శరీరం డీహైడ్రేడ్ అవకుండా ఉండడానికి నీటితో వీలైనంత వరకు పండ్లు, పండ్లరసాలు తీసుకుంటూ ఉండాలి. శరీరంలో రక్తం శాతాన్ని పెంచడానికి ఆహారంలో దానిమ్మని ఎక్కువగా తీసుకోండి. రక్తహీనత నుండి కాపాడడంలో దానిమ్మ చాలా సాయపడుతుంది. రక్తం తక్కువగా ఉండడం మొదలైన ఇబ్బందులని దూరం చేస్తుంది.
రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ తో పనే ఉండదు అంటారు. ఆపిల్ ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. రోజూ ఒక ఆపిల్ తినడం వల్ల శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. అంతేకాదు చక్కెర శాతాన్ని నియంత్రించడంలో ఇది బాగా పనిచేస్తుంది.
వీటన్నిటితో పాటు వ్యాయామం చేయడం కూడా ముఖ్యమే. ఏం తీసుకున్నా, ఏది తిన్నా వ్యాయామం చేయకపోతే అదంతా వృధా అవుతుంది. వ్యాయామం అనగానే కొంతమంది మహిళలు మేము రోజు ఇంట్లో పని చూస్తూనే ఉంటాం ప్రత్యేకంగా ఎందుకు అనుకుంటారు. కానీ వ్యాయామం మీకు శక్తిని ఇవ్వడంతో పాటు వ్యాధుల బారి నుండి తట్టుకునే బలాన్ని ఇస్తుంది. అందుకే రోజులో కనీసం పది నిమిషాలైనా వ్యాయామం కోసం కేటాయించాలి.