మహాభారతంలో పాండవులు, కుంతీదేవి దుర్యోధనుడు పాండవులను మట్టుపెట్టేందుకు లక్క ఇంటిని నిర్మించగా అందులో ఉన్న ఒక సొరంగం మార్గం గుండా తప్పించుకొని ఒక అరణ్యంలోకి చేరుకుంటారు. అక్కడ రాక్షసులైన హిడింబ, హిడింబి అనే అన్నాచెల్లెళ్లు వీరిని చూసి చంపాలనుకుంటారు. మరి రాక్షసురాలైన హిడింబి ని భీముడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? హిడింబి ని దేవతగా పూజించే ఆ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్, మనాలి ప్రాంతంలో, ధూన్ గిరి వనవిహార్ అనే అడవి మధ్యలో హిడింబా దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని దుంగ్రి మందిర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువై ఉన్న హిడింబిని హిర్మదేవిగా పిలుస్తారు. అయితే నాలుగు అంతస్తులుగా ఉండే ఈ ఆలయం పగోడా ఆకారంలో చెక్కతో నిర్మించబడి ఉండగా, ఈ ఆలయాన్ని క్రీ.శ.1553 లో నిర్మించినట్లుగా తెలుస్తుంది.
ఇక పురాణానికి వస్తే, పాండవులు సొరంగం గుండా ఒక అరణ్యప్రాంతానికి చేరుకోనుగా, అక్కడ నివసిస్తున్న రాక్షసులైన హిడింబ, హిడింబి అనే అన్నాచెల్లెళ్లు నరవాసన రావడంతో వెళ్లి చూడగా నిద్రిస్తున్న పాండవులకు కాపలాగా భీముడు కనిపించగా, బలశాలైన భీముడు ఒక్కడు చాలు మన ఆకలి తీరడానికాని తన అన్న హిడింబి తో చెప్పగా, భీముడిని మాయచేసి చంపాలని అందమైన అమ్మాయిగా మారి భీముడికి ఆశ చూపి పక్కకి తీసుకువెళ్దాం అని భావించగా, భీముడి అసలు ఆమె అందానికి లొంగకపోవడంతో, అతని ధైర్యానికి, వ్యక్తిత్వానికి ఆకర్షితురాలైన హిడింబి తన నిజరూపంతో దర్శనమిచ్చి, తాను వచ్చిన విషయాన్ని భీముడికి చెబుతుంది.
ఇలా అసలు విషయం తెలియడంతో ఆగ్రహానికి గురైన భీముడు వెళ్లి హిడంబ తో యుద్ధం చేసి ఆ రాక్షుడిని అంతం చేసి, అన్నని చంపాననే కోపంతో హిడింబి వలన తన వారికీ ఏదైనా హాని కలుగవచ్చనే కోపంతో హిడింబిని కూడా అంతం చేయడానికి వెళుతుండగా ధర్మరాజు ఆపడంతో అక్కడితో ఆగిపోతాడు. ఆ సమయంలో హిడింబి మనసులో భీముడు ఉన్నాడనే విషయాన్ని గ్రహించిన కుంతీదేవి హిడంబిని వివాహం చేసుకోమనడంతో, భీముడు హిడింబి ని వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత వీరికి ఓ శిశువు జన్మిస్తాడు. అతని తల ఘటం ఆకారంలో ఉండటంతో ఘటోత్కచుడు అని పేరు పెడతారు. తమ మధ్య ఉన్న షరతు ప్రకారం ఘటోత్కచుడు జన్మించిన తరువాత భీముడు హిడింబిని విడిచి వెళ్లిపోతాడు.
భీముడు తనని విడిచి వెళ్లిపోయిన తరువాత హిడింబి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోతుంది. ఆ తపస్సుతోనే ఆమె దేవతగా రూపాంతరం చెందిందని నమ్ముతారు. హిడింబిని ఒక దేవతగానూ, ఆటవిక జాతులవారికి ప్రతీకగానూ చాలా చోట్ల పూజిస్తారు. నవరాత్రి సమయంలో భక్తులు అన్ని చోట్ల దుర్గాదేవిని ఆరాదిస్తే, మనాలి ప్రాంతంలో మాత్రం హిడింబి దేవిని ఆరాధిస్తుంటారు.