ప్రపంచంలో ఉన్న శివలింగాలలో ఇక్కడి మంచు శివలింగం ఒక అద్భుతం. అమర్నాధ్ యాత్ర అనేది అక్కడ ఉండే మంచు కారణంగా వేసవిలో మాత్రమే ఈ ఆలయానికి వెళ్లే వీలు ఉంటుంది. ఇలా వేసవిలో జరిగే అమర్నాథ్ యాత్రకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి అమర్నాథ్ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయం అని చెబుతారు. మరి శివుడికి అంకితం చేయబడిన అమర్నాథ్ గుహ లో దాగి ఉన్న అద్భుతాలు ఏంటి? ఇక్కడ ఆ పరమశివుడు పార్వతి దేవికి అమరత్వం గురించి ఏమని చెప్పాడు? ఇక్కడ ఇప్పటికి పావురాల జంట ఉందని చెబుతుంటారు అందుకు కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్మూ – కాశ్మీర్ లో అమర్నాథ్ పర్వతం పైన అమర్నాథ్ గుహలు ఉన్నాయి. హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అమర్నాధ్ గుహాలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శివుడికి అంకితం చేయబడిన ఈ పవిత్ర గుహాలయం దాదాపుగా ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు. ఈ ఆలయం సముద్రమట్టానికి దాదాపుగా 3,888 మీ. ఎత్తులో ఉంటుంది. ఇక ఎంతో ప్రసిద్ధి చెందిన అమర్నాథ్ యాత్ర అనేది శ్రీనగర్ నుండి మొదలవుతుంది. శ్రీనగర్ నుండి అమరనాథ్ గుహ 142 కి.మీ. దూరంలో ఉంటుంది.
ఇక పురాణానికి వస్తే, ఒకరోజు పార్వతీదేవి శివుడితో దేవా, మీరు కంఠంలో ధరించిన కపాలమాల గురించి వినాలని ఉంది అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, దేవి ఈ కపాలములన్ని ని పూర్వ జన్మ అవతార విశేషాలకు గుర్తులు. నీవు జన్మించినప్పుడల్లా నేను ఈ కపాలములో అదనముగా ఇంకొక కపాలంను ఇందులో చేర్చి ధరిస్తుంటాను అని శివుడు పార్వతి దేవికి చెప్పగా, అప్పుడు పార్వతీదేవి తిరిగి దేవా నేను మాత్రం తిరిగి మళ్ళీ జన్మిస్తున్నాను మీరు మాత్రం ఎప్పుడు అలాగే శాశ్వతుడిగా అలానే ఉండిపోతున్నారు అది ఎలా సాధ్యం స్వామి అని అడుగగా, అందుకు శివుడు పార్వతి ఇది పరమ రహస్యం. కావున ఇది ప్రాణకోటి లేని ప్రదేశంలో మాత్రమే చెప్పాలి అని శివుడు ఎవరు లేని రహస్య ప్రదేశం కోసం చూస్తూ చివరకు అమర్నాథ్ గుహని ఎంచుకున్నాడు. ఇక శివుడూ ఈ గుహని ఎంచుకోవడానికి ముందుగా తనతో పాటు తన వాళ్ళందరిని వదిలేసి వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్లే దారిలో శివుడు ముందుగా తన వాహనమైన నందిని పహల్ గాం వద్ద వదిలి వెళ్ళాడు, ఆ తరువాత తన తలపైన ఉన్న చంద్రుడిని చంద్ర న్వారి వద్ద వదిలివెళ్ళాడు. ఆ తరువాత సర్పాన్ని షిషాంగ్ సరోవర తీరాన శేషనాగ్ వద్ద వదిలివెళ్ళాడు. ఇక తన కుమారుడైన గణపతిని మహాగుణ పర్వతం వద్ద విడిచిపెట్టాడు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశాలను పంచ్ తర్ణి వద్ద వదిలేసి పార్వతీదేవితో కలసి అమర్నాథ్ లోని అమరలింగం ఉన్న గుహలోకి వెళ్ళిపోయాడు.
అమర్నాథ్ గుహలోకి వెళ్లిన తరువాత తన ఢమరుకంతో పెద్దగా శబ్దం చేయగా గుహలోని పక్షులు, పావురాలు అన్ని ఆ శబ్దానికి బయపడి దూరంగా ఎగిరిపోయాయి. ఇలా గుహలో ఏవి లేకుండా చేసిన శివుడూ తన అమరత్వ రహస్యం మరియు జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవి కి వినిపించాడు. అయితే ఆ సమయంలో గుహలో పావురాళ్ళు పెట్టిన రెండు గుడ్ల నుంచి అప్పుడే జన్మించిన రెండు పిల్ల పావురాళ్ళు శివుడు అమరత్వం గురించి పార్వతిదేవికి చెప్పిన రహస్యాన్ని విన్నవి. అది గమనించిన శివుడూ జీవ ధర్మమైన జనన మరణములు ఈ పావురాల జంటకు ఉండదు. మనం ఇద్దరం ఈ పావురాల రూపంలో ఈ గుహలో ఉంటూ మన దర్శనానికి వచ్చే భక్తులకి కైవల్యం ప్రసాదిద్దామని చెప్పాడు. ఇక ఇప్పటికి ఈ గుహకి వచ్చి శివుడిని అర్చించిన వారికీ దర్శనం ఇచ్చి ముక్తిని ప్రసాదిస్తున్నావని చెబుతారు.
ఇక మొట్టమొదటగా గుహాలయంలో ఉన్న శివలింగం ఎవరు చూసారనేదినికి ఒక కథ వెలుగులో ఉంది. పూర్వం ఒకసారి గుజ్జర్ జాతికి చెందిన బూటా మాలిక్ అనే ఒక గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సాధువు కనిపించి ఒక సంచి నిండా బొగ్గుని ఇచ్చాడు. అతడు వాటిని తీసుకొని ఇంటికి వెళ్లి చూడగా అవి బంగారం లా మారిపోయాయి. దీంతో తనకి వీటిని ఇచ్చిన ఆ సాధువుకి కృతఙతలు చెప్పడానికి మరుసటి రోజు వెళ్లి చూడగా అక్కడ ఆ సాధువు కనిపించలేదు కానీ అద్భుతమైన ఒక మంచు శివలింగం ఆ కాపరికి దర్శనం ఇచ్చింది. ఇలా గుహాలయం మొదటిసారిగా ఆ కాపరికి కనిపించగా రాను రాను అమర్నాథ యాత్ర గా పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
ఇక అమరనాధుడు అంటే మరణం లేనివాడని అర్ధం. ఈ గుహాలయంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ఉంటుంది. వేసవి కాలంలో మే నుండి ఆగస్టు వరకు ఈ మంచు శివలింగం పెద్దగా ఉంటుంది. ఈ గుహ అంతకుడా సున్నపురాయితో ఏర్పడినట్లుగా ఉంటుంది. ఇక గుహ ఉపరితలం నుండి హిమజలం ఒక్కొక్కటిగా నేలమీద పడి అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా మంచు శివలింగంగా ఏర్పడుతుంది. ఇంకా ఇక్కడే పార్వతిదేవికి, గణపతికి రెండు మంచు శివలింగాలు ఉన్నాయి. అయితే శ్రావణమాసంలో శుక్ల ద్వాదశి నాడు గౌరీ శంకర దేవాలయం బలిపీఠం వద్ద ఉన్న ఆరు అడుగుల ఎత్తు గల త్రిశూలాన్ని చర్రిముబారక్ అని అంటారు. ఈ త్రిశూలాన్ని తీసుకొని అమర్నాథ్ గుహకి బయలుదేరుతారు. ఈవిధంగా అమర్నాథ్ యాత్ర అనేది ప్రారంభమవుతుంది.
ఈవిధముగా మంచుతో ఏర్పడిన ఈ అద్భుత శివలింగాన్ని చూడటానికి, శివుడికి అంకితం చేయబడిన ఈ పుణ్యస్థలాన్ని చూడటానికి మంచు కొండల్లో ప్రయాణం కష్టమైనప్పటికీ ఆ పరమశివుడిని దర్శించి ముక్తిని పొందడానికి జూన్ నెలలో జరిగే అమర్నాథ్ యాత్రకి దేశం నలుమూలల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.