శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం. కొందరు నంది కొమ్ములో నుండి శివుడిని దర్శనం చేసుకుంటే, కొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతినిత్యం నంది నోటి నుండి నీరు అనేది శివలింగంపై పడుతుంటుంది. మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులో శ్రీ దక్షిణముఖ నందితీర్థ కళ్యాణి క్షేత్రం ఉంది. దేశంలో ఉన్న అతిప్రాచీన శివాలయలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, నంది నుండి నీరు రాగ ఆ నీరు సరిగ్గా కింద ఉన్న శివలింగం మీద పడేలా ఆలయాన్ని నిర్మించారు. ఆ కాలంలో ఇలాంటి నిర్మాణం ఎలా సాధ్యమైందనేది ఇప్పటికి ఎవరికీ అర్థంకాని విషయం.
ఈ ఆలయంలో నంది నుండి నీరు అనేది ఎల్లప్పుడూ వస్తూ శివలింగం మీద పడుతుండగా ఆ నీరు ఎక్కడినుండి వస్తుందనేది ఇప్పటివరకు ఎవరు కూడా రుజువు చేయలేకపోవడం విశేషం. ఇంకా కొందరి పరిశోధనల ప్రకారం ఈ ఆలయం 400 సంవత్సరాల నాటిదిగా చెబితే మరికొందరు మాత్రం ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెబుతున్నారు. ఈ ఆలయం 1997 తరువాత వెలుగులోకి వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
ఇక ఈ ఆలయంలో నంది ముఖం దక్షిణం వైపుకి ఉండగా, ఆ నంది నుండి వచ్చే నీటిని పవిత్ర జలం లాగ భవిస్తూ ఆ నీటినే తీర్థం అని పిలుస్తుంటారు. ఇక నంది నుండి శివలింగం పై పడిన నీరు పక్కనే ఉండే కొలనులోకి వెలుతాయి. ఈ కొలను కళ్యాణి అని పిలుస్తారు. అందుకే ఈ ఆలయానికి శ్రీ దక్షిణముఖ నందితీర్థ కళ్యాణి క్షేత్రం అనే పేరు వచ్చినది చెబుతారు.
ఈవిధంగా అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తూ పైనుండే నంది నుండి శివలింగం పైన నీరు పడటానికి పూర్వం ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పటికి మిస్టరీగానే ఉండగా భక్తులు మాత్రం ఇదంతా ఆ శివయ్య లీలే అంటూ అధిక సంఖ్యలో వస్తూ శివలింగాన్ని దర్శించుకుంటున్నారు.