ద్రౌపదీ సమేత ధర్మరాజు కొలువై ఉన్న ఈ ఆలయంలో ద్రౌపతి శ్రీమహాలక్ష్మి ప్రతిరూపంగా, ఈ క్షేత్రంలో భక్తులపాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన ద్రౌపదిని అర్చిస్తే సంతానం లేనివారికి తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా బ్రిటిష్ వారు కూడా ఈ అమ్మవారిని పూజించారని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూరు జిలాలోని అనేక ధర్మరాజు ఆలయాల్లో యామిగాని పల్లెలో లో ద్రౌపతి ఆలయం ఉంది. ధర్మరాజు ఆలయాల్లో ఈ ఆలయం అతి ముఖ్యమైంది. ఈ ఆలయాన్ని దాదాపు 5 , 6 శతాబ్దాలకు పూర్వమే నిర్మించినట్లు స్థానికుల అభిప్రాయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 18 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ 18 రోజుల ఉత్సవం ధర్మరాజు పట్టాబిషేకంతో ముగుస్తుంది.
ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, నాలుగు వందల సంవత్సరాల కిందట పుత్తూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కరవుకాటకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే పుత్తూరు సమీపంలోని చైటూరు గ్రామంలో ఆరుగురు అన్నదమ్ములు కలిసి బావి తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉండగా ద్రౌపది దేవి చెక్క విగ్రహం బయటపడింది. అదే రోజు రాత్రి వారిలో చిన్నవాడైన చినతంబికి ద్రౌపదీమాత కలలో కనిపించి తనకు దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించింది. మర్నాడు నిద్ర లేచిన చినతంబి తన స్వప్న వృత్తాంతాన్ని అన్నలకు చెప్పగా, వాళ్లు మన దగ్గర ఆలయాన్ని నిర్మించేంత ధనం లేదు కాబట్టి, ఆ అమ్మవారి విగ్రహాన్ని పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు సేకరించు అని చెబుతారు.
అన్నల మాట ప్రకారం చినతంబి ద్రౌపది దేవి విగ్రహాన్ని నెత్తిమీద పెట్టుకుని, కొరడాతో కొట్టుకుంటూ, కత్తి సాము చేసుకుంటూ ఊరూరా తిరుగుతాడు. కార్వేటి నగర మహారాజు సాల్వవెంకట పెరుమాళ్ల దగ్గరకు వెళ్లి తన విద్యను ప్రదర్శించి, విరాళం అడుగుతాడు చినతంబి. కత్తితో కోసుకున్నా గాయాలు కాకపోడం చూసిన మహారాజు ఆశ్చర్యానికి గురవుతాడు. అతడి దగ్గరున్న పదునైన కత్తిని ఇచ్చి, మళ్లీ కోసుకోమని చెబుతాడు. చినతంబి మహారాజు ఇచ్చిన కత్తితో కోసుకున్నా ఒంటి మీద ఒక్క గాయం కూడా కాదు. అది చూసి ముచ్చటపడిన రాజు నీకు ఏం కావాలో కోరుకో మని అడుగుతాడు. ద్రౌపదీదేవికి ఆలయాన్ని నిర్మించమని కోరతాడు చినతంబి. అందుకు అంగీకరించిన రాజు పుత్తూరులో ఆలయాన్ని నిర్మిస్తాడు. పుత్తూరు అంటే తమిళంలో కొత్త ఊరు అని అర్థం. ఈ ప్రాంతంలో పుట్టలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని పుట్టల ఊరు అని పిలిచేవారు. కాలక్రమంలో అది పుత్తూరుగా మారిపోయింది.
అయితే ఈ ప్రాంతం బ్రిటిష్ పాలన కింద ఉన్నరోజుల్లో ఒక తెల్లదొర పుత్తూరులో పర్యటించాడు. ద్రౌపది దేవి ఆలయాన్ని చూసి హేళనగా మాట్లాడాడు. ఫలితంగా ఆ అధికారికి చూపు పోయింది. దీంతో తన తప్పు తెలుసుకున్న అధికారి అమ్మవారిని క్షమించమని ప్రార్థించగా తిరిగి చూపు వచ్చింది. ఆ సందర్భంగా బ్రిటిష్ అధికారి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలను జరిపించాడు. అప్పటి నుంచి ఏటా శ్రావణ మాసంలో ధర్మరాజు సమేత ద్రౌపదీదేవికి 18 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఈ తర్పణం ఉత్సవాన్ని గౌడ బ్రాహ్మణులూ తొలి రోజు అంటే అంకురార్పణ రోజున పసుపు బట్టలు ధరించి ఆలయంలో పూజలు జరిపి ఉత్సవాలు జరిగే 18 రోజులు ఆలయంలోపలే నివాసముంటారు. ఈ ఉత్సవం సమయంలో పూజారులు స్త్రీలు వండిన భోజనాన్ని స్వీకరించరు. ఉత్సవ పర్వదినాలలో 12 రోజులు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉదంక చరిత్రతో ప్రారంభించి, ధర్మరాజు పట్టాభిషేకం వరకు మహాభారత పురాణశ్రవణం జరుగుతుంది.
ఈ ఉత్సవంలో పేర్కొనదగిన ఘట్టాలు 9 వ రోజు జరిగే బకాసురవధ, 13 వ రోజు జరిగే ధర్మరాజు రాజసూయయాగం, 14 రోజున అర్జున తపస్సు, 18 వ రోజు దుర్యోధన వధ ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించబడతాయి. ఈ ఉత్సవాలలో ఉత్తర గోగ్రహణం, శ్రీకృష్ణరాయబారం ఘట్టాల పురాణ కాలక్షేపం భక్తులనెంతో ఆకర్షిస్తుంది.
ఇలా ఇక్కడ వెలసిన ద్రౌపదిని అర్చిస్తే సంతానం లేనివారికి తప్పక సంతానం కలుగుతుందని అందుకే ఆ అమ్మవారిని భక్తులు సంతాన దేవత ద్రౌపదమ్మ గా కొలుస్తుంటారు.