మహా పరాక్రవంతుడైన గొప్ప రాజు బాహుబలి. మరి ఆ బలశాలిని దైవంగా భావించి జైనులు ఎందుకు ఆయనకి ఆలయాన్ని నిర్మించారు, ఆ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలో మైసూరు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉత్తరదిక్కున శ్రావణ బెళగోళ అనే పెద్ద గ్రామం ఉంది. ఈ శ్రావణబెళగోళలో గోమఠేశ్వరుడు అనబడే బాహుబలి ఆలయం ఉన్నది. ఈ బాహుబలి ఇంద్రగిరి కొండలమీద దిగంబరునిగా నిలబడి ఉన్నాడు. ఈ బాహుబలి విగ్రహం 1,800 సంవత్సరాల క్రితం నాటిదైనా ఇప్పటికి స్వచ్చంగా ఉంది. నగ్గనంగా ఉన్న ఈ స్థూప శిల్పం సర్వం సన్యసించిన దానికి చిహ్నము అని తెలియుచున్నది. 12 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ మహామస్తభిషేకం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
ఇక ఈ స్థల పురాణం విషయానికి వస్తే, జైనమతానికి మూలపురుషుడు ఋషభుడు. ఈయననే అధినాధుడు అని కూడా అంటారు. తీర్థంకరులలో ఆఖరివాడు వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు ద్వారానే జైనాసిద్ధాంతం ఒక మతంగా ఆవిర్భవించింది. అయితే బాహుబలి ఋషబుని కుమారుడు. ఈ ఋషబునికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు వందమంది కుమారులు, వారిలో పెద్దవాని పేరు భరతుడు. రెండవ భార్య కుమారుడు బాహుబలి. అయితే వీరందరూ పెద్దవారు అయినా తరువాత ఋషభుడు తన సామ్రాజ్యాన్ని అందరూ కుమారులకు సమానంగా పంచియిచ్చి, తను తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళిపోయాడు. రాజధాని అయిన కోసల పట్టణాన్ని అందరిలో పెద్దవాడైన భరతునికి ఇచ్చి అందరిలోకి అతనిని ప్రధానవ్యక్తిగా నియమించి వెళ్ళాడు.
తన రాజ్యాన్ని మరింత విస్తరింపచేసుకోవాలని భరతునికి ఆశపుట్టి, దండయాత్రలు ప్రారంభించాడు. ఆవిధంగా అతని తమ్ములందరు తమ తమ రాజ్యాలను అతని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి దగ్గరికి వెళ్లిపోయారు. కానీ మహా పరాక్రవంతుడైన బాహుబలి, అన్నగారి దురాశ చూసి సహించలేక, భరతునితో యుద్దానికి తలపడతాడు. అనవసరమైన జన నష్టం కలుగకుండా ఉండటానికి అన్నదమ్ములిద్దరూ ద్వంద యుద్ధం చేయటం ప్రారంభించారు. అమిత శక్తివంతుడైన బాహుబలి, తన రెండు చేతులతో భరతుని పైకి ఎత్తి, నేలపై పడవేసి కొట్టి చంపటానికి ఉద్యుక్తుడవుతాడు. కానీ అంతలోనే “అశాశ్వతమైన ఈ ఇహలోక సుఖాలకి ఆశపడి పాపకార్యాలు ఎందుకు చేయాలి అనే ఆలోచన వచ్చి భరతుని వదిలేయడమే కాకుండా తన రాజ్యభాగం కూడా భరతునికి ఇచ్చేసి, తను తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తాడు.
బాహుబలి ఎన్నాళ్ళు తపస్సు చేసిన మోక్షం పొందడానికి కావలసిన ఆత్మజ్ఞానం లభించలేదు. అప్పుడు జైనుల ఆది దైవమైన ఆధినాథుడు వచ్చి, తను తపస్సు చేస్తుండగా, తన కాళ్ళు ఉన్న నేలకూడా భరతునిదే అనే ఆలోచన బాహుబలి మనసులో ఉంది కనుక ఈ ఇహలోక సంబంధమైన ఆలోచనలు వదలలేనిదే ఆత్మకు మోక్షం సిద్దించదని చెబుతాడు. నిజమైన ‘సర్వసంగ పరిత్యాగం’ అంటే ఏమిటో అర్ధం తెలుసుకున్న బాహుబలి తిరిగి తపస్సు చేసి చివరకి మోక్షం పొందుతాడు.
బాహుబలి తపస్సు చేసిన ఈ ప్రదేశం సుమారు రెండువేల సంవత్సరాల నుండి జైనులకు పవిత్రక్షేత్రంగా అలరారుచున్నది. మైసూరు ప్రాంతాన్ని పరిపాలించిన రెండవ రాచమల్లు అనే రాజు కాలంలో అయన వద్ద మంత్రిగా ఉన్న చాముండరాయుడు ఈ ప్రాంతంలో బాహుబలి విగ్రహాన్ని నిర్మింపచేసాడు.
బాహుబలి విగ్రహం ఎత్తు 58.6 అడుగులు. ఈ విగ్రహాన్ని ఎక్కడో చెక్కించి ఇక్కడకి తీసుకురాలేదు, ఈ విగ్రహం ఉన్న కొండ చివరి భాగం అంటే శిఖర భాగాన్ని పై నుంచి కిందకి తొలుచుకుంటూ చెక్కబడినది. రెండుకాళ్ళ మీద నిలుచుని తపస్సు చేసుకుంటూ ఉన్న ఈ విగ్రహం యొక్క ముఖము,శరీరాకృతి చాలా అందంగా,ఆకర్షణీయంగా ఉంటుంది.