ఏ పని చేసే ముందైనా ఆలోచించి చేయడం మనిషి నైజం. అతిగా ఆలోచించడమే అనర్థాలకు దారి తీస్తుంది. అతి ఎప్పటికైనా ప్రమాదమే. ఈ మధ్య అతిగా ఆలోచించడం అదే ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు దీనికి మినహాయింపు కాదు. అయితే ఆలోచించడం అనేది మనుగడకు సహాయపడటానికి అవసరమైన చర్య, కాబట్టి మీరు అతిగా ఆలోచిస్తున్నారా అని నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం.
ఆలోచన మంచిదే. కానీ, మితిమీరిన ఆలోచనలు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. ఎంతలా అంటే ఒక్కోసారి పక్షవాతం రావచ్చు, ఇతర అవయవాలు సైతం పూర్తిగా దెబ్బతినవచ్చు.. ఆత్మహత్య ప్రయత్నానికి దారితీయవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించిన ఆలోచన మంచిదే.. ఓ పెను సంక్షోభం నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలన్న తపనా మంచిదే. అయితే ఆలోచన వెనువెంటనే కార్యాచరణ ఉండాలి.
అలా కాకుండా, రోజూ చేసే పని మీద కూడా ధ్యాస లేకుండా ఆలోచిస్తూ కూర్చుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు మానసిక వైద్యులు. గతం గురించి చింతిస్తూ.. వర్తమానం గురించి బాధపడుతూ.. రేయింబవళ్లూ అర్థంలేని ఆలోచనల్లో మునిగితేలుతుంటే కచ్చితంగా మానసిక జాడ్యాన్ని ఎదుర్కొంటున్నట్టే.
చాలా మంది ఏదో ఒక విషయాన్ని పట్టుకుని పది రకాలుగా పదే పదే గురించి ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించడం వల్ల చేయవలిసిన పనులు అన్ని పెండింగ్ లో ఉండిపోతాయి. అలాగే ఆనందంగా కూడా ఉండలేరు. కాబట్టి అతిగా ఆలోచించడం మానుకోవడం ముఖ్యం. ఈ సమస్యనుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మైండ్ అనేది ఒక టూల్. అది మీరు అనుకున్నట్టు పని చేయాలి కానీ, మీకు వ్యతిరేకంగా కాదు. నాకు ఆలోచనలు ఆటోమేటిక్ గా వస్తాయి. దానికి నేనేం చేయగలను? అని మీరు అనుకొవొచ్చు. ఏది ఆలోచించాలో ఏది ఆలోచించకూడదో సెలెక్ట్ చేసుకునే సామర్థ్యం, శక్తి మీకున్నాయి. పనికి రాని ఆలోచనల వల్ల జీవితాన్ని ఆనందించలేరు. పొద్దున్నే సూర్యకిరణాలని ఆనందించి ఎన్ని రోజులయ్యింది? అన్నం తినేటప్పుడు రుచిని ఆస్వాధించి ఎన్ని రోజులయ్యింది?
మరి ఈ ఆలోచనలని ఎలా ఆపగలం? దానికి అవగాహన కావలి. అసలు మన ఆలోచన ఎక్కడ నుండి మొదలయింది అనేది తెలుసుకోవాలి. చాలామంది ఆలోచనలో పడి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత తన్మయత్వంలో ఉంటారు. అలాంటి వారు ఆలోచనలోకి వెళ్ళేటప్పుడు వెంటనే ఆ ఆలోచన నుండి బయటకి రావడానికి ప్రయత్నించండి. ఒక సారి మనసులో గట్టిగా రియాలిటీలో వచ్చేయాలనుకోండి. బయట ప్రపంచాన్ని చుడండి.
ఒంటరిగా ఉంటే ఆలోచనలు మరింత వేధిస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపండి. సామాజిక సంబంధాలు త్వరగా కోలుకునేలా చేస్తాయి. చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపండి. ఆలోచనల మీద నియంత్రణ కోసం ధ్యానాన్ని ఆశ్రయించవచ్చు. ధ్యానంలో ఆలోచనల పట్ల ఎరుక ఏర్పడుతుంది. ఏది మంచి ఆలోచనో, ఏది చెత్త ఆలోచనో.. మొగ్గలోనే అర్థమై పోతుంది. సులభంగా వాటిని తుంచేయవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గందరగోళం తగ్గుతుంది. మీ ఆలోచనలు తరచూ మిమ్మల్ని గతంలోకి తీసుకెళ్తుంటే నడక/పరుగు దినచర్యలో భాగం చేసుకోండి. అలసిపోతే ధ్యాస శరీరం మీదకి, విశ్రాంతి మీదకి వెళుతుంది.
ప్రతి మనిషికి ఏదో ఒక ప్రతిభ, అభిరుచి ఉంటుంది. దానిపై దృష్టి కేంద్రీకరించండి. ఒత్తిడిని/ఆలోచనను అదుపులో ఉంచండి. మీకు నష్టం కలిగించే నెగెటివ్ ఆలోచనలను గుర్తించి.. మరోసారి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడండి. ఏదైనా పని, సమస్య గురించి ఆలోచన కొలిక్కి వచ్చిన వెంటనే, ఆచరణా ప్రారంభం కావాలి. జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా.. ఆశా వాదాన్ని మాత్రం వదులుకోవద్దు. ఆశతో జీవించండి. సమస్య పరిష్కారాలపై దృష్టి పెట్టండి.