దేశంలో హనుమంతుడికి ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే హనుమంతుడు పంచముఖాలు కలిగి ఉండే ఆలయాలు కూడా కొన్ని మనకు దర్శనం ఇస్తుంటాయి. భక్తులు కష్టాలలో ఉన్నప్పుడు ఆయనను పూజిస్తే వారికీ ఎనలేని ధైర్యం వచ్చి కష్టాలను దాటుకుంటూ పోతామని నమ్మకం వారిలో ఉంటుంది. ఎందుకంటే ఈ రామబంటు మంచి ధైర్యశాలి, బలశాలి. అయితే హనుమంతుడు పంచముఖాలతో ఉండటానికి గల పురాణం ఏంటి? ఇంకా పంచముఖాలతో వెలసిన ఒక ఆలయ విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా పరిగి మండలంలో కాళ్లాపూర్ అనే గ్రామంలో లొంక సప్తముఖ ఆంజనేయక్షేత్రం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. త్రేతాయుగంలో సీతారాములు తిరుగాడిన పుణ్య ప్రదేశం ఇదని ఇంకా ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలో రెండు కొండల మధ్య శ్రీ ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశాడని పురాణాలూ చెబుతున్నాయి.
ఇక పురాణానికి వస్తే, రామ రావణ యుద్ధ సమయములో, రావణుడు పాతాళానికి అధిపతి అయిన మైరావణుడి సహాయము కోరతాడు. అప్పుడు రామలక్ష్మణులను కాపాడటానికై ఆంజనేయుడు తన తోకతో ఒక కోటను ఏర్పరచి అందులో రామలక్ష్మణులకు శయన మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే మైరావణుడు విభీషణుని రూపములో వచ్చి వారిని అపహరిస్తాడు. దానితో ఆంజనేయుడు రామలక్ష్మణులను వెతకడానికై పాతాళానికి వెళ్తాడు. పాతాళములో వివిధ దిక్కులలో వెలుగుతూ ఉన్న ఐదు దీపాలను ఏకకాలములో అర్పితేనే మైరావణుడి పంచ ప్రాణాలు గాలిలో కలుస్తాయని తెలుసుకున్న హనుమ పంచముఖ ఆంజనేయుడి అవతారము దాలుస్తాడు. ఈ ఐదు ముఖాలలో ఒకటి ఆంజనేయుడిది కాగా, మిగిలినవి గరుడ, వరాహ, హయగ్రీవ, నారసింహాదులవి. ఇలా పంచముఖ అవతారము దాల్చిన ఆంజనేయుడు ఒకేసారి ఐదు దీపాలను ఆర్పి, మైరావణుడిని చంపి, రామలక్ష్మణులను కాపాడతాడు.
ఇక ఆలయ విషయానికి వస్తే గర్భాలయంలో స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా రాతి పలకల రూపంలో దర్శనమిస్తూ వుంటాడు. ఈ రాతి అంజనేయస్వామి పలకకు చందనంతో అలంకరిస్తారు. పురాణపరమైన నేపథ్యం వున్న కారణంగా ఈ క్షేత్రానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతూ వుంటుంది. ఈ ఆలయంలో హనుమంతుడిని దర్శించడం వలన గ్రహసంబంధమైన దోషాలు తొలగిపోతాయనీ, సిరిసంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
ఇలా హనుమంతుడు పంచముఖాలు అవతరించగా ఈ దేవాలయంలో సప్తముఖ ఆంజనేయుడిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.