శైవ క్షేత్రాలలో శివలింగం కాకుండా ఎక్కువగా కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. కాశీ నగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు. కాల భైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కాని ఆయనకు చాలా విశిష్టత ఉంది. సాక్షాత్తు శివుడే కాల భైరవుడై సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
సాధారణంగా కాలభైరవ స్వరూపం భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. కానీ ఆయనను పూజించినచో సకల శుభాలు కలుగుతాయి. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. భైరవ ఉపసానతో గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు, అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని,అతింద్రమైన శక్తులని అయన ప్రసాదిస్తారు.
కాల భైరవుడిని కాశి క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాదించాలన్నా ముందుగా అయన అనుమతి తీసుకోవాలని కాశి క్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాల భైరవుడే సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం తనను అవమానపరచిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవుడిని సృష్టించి, బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆదేశిస్తాడు.
క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి యొక్క ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సులను ఖండించాడు భైరవుడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి యొక్క కపాలంను చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుందని చెప్పాడు.
చివరికి భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరంను బ్రహ్మకపాలంగా పిలుస్తారు. శ్రీ కాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యా లు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంధాలు చెబుతాయి. కాల భైరవుడికి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి బెల్లం నైవేద్ద్యం పెడతారు.