రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు, సర్వధర్మ సమన్వయ స్వరూపమే వేదాంతం అని, అన్ని మతాల ఆరాధనలూ భగవంతుని తత్వాన్ని తెలిపే మార్గాలే అని చెప్పిన ప్రఖ్యాత ఆధ్యాత్మికత నాయకుడు, సమస్త శక్తి నీలోనే ఉంది. దానినే విశ్వసించు, నీవు బలహీనుడవని ఎప్పుడూ తలపోయకు, ధీరుడవై నిలిచి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు అంటూ సమస్త మానవాళిని భయం వదలి సమాజ సేవకు నడుం కట్టాలని చెప్పిన హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి మరియు రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామి వివేకానంద. మరి స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడి గా ఎలా మారాడు? చికగాలో జరిగిన మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ అయన ఇచ్చిన ప్రసంగం ఏంటి? నరేంద్రుడు వివేకానందుడిగా ఎలా మారాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కలకత్తాకు చెందిన ప్రసిద్ధ న్యాయవాది విశ్వనాథ దత్తా, ఆయన సతీమణి భువనేశ్వరీదేవి దంపతులకు 1863 జవనరి 12 వ తేదీ మకర సంక్రాంతి పర్వదినాన నరేంద్రనాథ్ జన్మించారు. ఆ శిశువే అనంతరం స్వామి వివేకానందుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. అయన చిన్నతనంలోనే అతడి తల్లి చెప్పే భారత, రామాయణ ఇతిహాసాలను చాలా శ్రద్దగా వినేవాడు, మూఢనమ్మకాలను నమ్మేవాడు కాదు. అయితే అతడి జ్ఙాపకశక్తిని, అసాధారణ మేధాశక్తిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపడేవారు. నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. అయన సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. అయితే చరిత్ర మరియు సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టిన ఆయనకి రోజు రోజుకి మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. అతడి సందేహాలన్నిటిని ఎందరో పండితుల దగ్గర ప్రస్తావించినప్పటికీ వారి జవాబులు ఏవి కూడా ఆయన్ని సంతృప్తి పరచలేదు.
ఇటువంటి చిక్కుపరిస్థితిలో, కలకత్తాకు కొద్ది దూరంలో, దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ విధంగా 1881 లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామక్రుష్ణునికి, అతని సందేశప్రచారకుడైన నరేంద్రునికి పరిచయం కలిగింది. అప్పుడు అయ్యా! మీరు దేవుణ్ణి చూశారా? అని నరేంద్రనాథ్ ప్రశ్నించాడు. ఔను! నేను భగవంతుణ్ణి చూశాను! నిన్నిప్పుడు చూస్తున్నదానికన్నా స్పష్టంగా చూశాను అని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఇలా ఎట్టకేలకు తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక మనిషి నరేంద్రుడికి లభించాడు. అతని అనుమానం తొలగిపోయి శిష్యునిగా శిక్షణ ప్రారంభించాడు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించే వరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.
ఇక అతడి తండ్రి మరణించిన తరువాత కుటుంబంలో ఆర్థికంగా ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ సమయంలో నీవు కాళికా దేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు. ఆ తరువాత అయన ఉపాధ్యాయునిగా పనిచేసారు. ఇలా పని చేస్తూనే న్యాయ విద్యను కొనసాగించాడు. ఇది ఇలా ఉంటె గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సమీపించగా చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. ఇక అయన గురువు మరణించిన తరువాత గంగ నది ఒడ్డుకి దగ్గరలో ఉన్న రామకృష్ణుల వారి సమాధి దగ్గర రామకృష్ణమఠం స్థాపించారు. అక్కడ ఉండే యువసన్యాసులకి రెండే లక్ష్యాలు ఉండేవి, ఒకటి ప్రజలకు సేవ చేయడం, రెండు ముక్తిని సాధించడం. ఇలా సంస్యసిగా మారిన నరేంద్రుడు రామకృష్ణ మఠానికి నాయకుడయ్యాడు.
ఈవిధంగా కాషాయం ధరించి సన్యాసాన్ని స్వీకరించిన నరేంద్రుడు వివేకానందుడిగా మారాడు. ఆ తరువాత దైవసాక్షాత్కారం కోసం నిరంతర ధ్యానం చేశారు. పరివ్రాజకునిగా దేశసంచారం చేశారు. ఎన్నో క్షేత్రాలు తిరిగి భారతదేశంపై పూర్తి అవగాహనకు వచ్చారు. ఇలా దేశ పర్యటనలో భాగంగా మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మరియు మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. ఇక ఆ మహారాజు అమెరికాలో జరిగే సర్వమత సభకి వెళ్ళడానికి అయ్యే ఖర్చు అంత కూడా తానె భరిస్తానని వివేకానందకు మాట ఇచ్చాడు. ఇక అతడి ప్రయాణానికి దేశం మొత్తం నుండి ఎన్నో విరాళాలు వచ్చాయి. కానీ స్వామి వివేకానంద మాత్రం తన ఖర్చులకి అవసరం ఉన్నంతవరకే తీసుకొని మిగిలినవి దాతలకు తిరిగి ఇచ్చేసాడు. ఆవిధంగా స్వామి ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది. ఈవిధంగా చికాగో వెళ్లిన ఆయనకి అక్కడ ఒక మహిళా పరిచయం అయింది. స్వామి మాట్లాడిన కొద్దిసేపటికే ఆయన గొప్పతనం గ్రహించిన ఆ మహిళా తన ఇంట్లో స్వామికి ఆతిధ్యం ఇచ్చింది. ఇలా సదస్సులకు మూడు నెలల వ్యవధి ఉన్న సమయంలో అయన చిన్న చిన్న సభల్లో ఉపన్యసించేవాడు. ఆ ఉపన్యాసంలో భారతీయ సంస్కృతి, హిందూధర్మం గురించి ఎక్కువ ప్రస్తావించేవారు. ఇంతలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పండితులైన రైట్ స్వామితో ప్రసంగించటం జరిగింది. అతను వివేకానందుని ప్రతిభను గుర్తించి హిందూమత ప్రతినిధిగా సభలో పాల్గొనడానికి వివేకానందుని మించినవారు లేరని ఆ సభాధక్ష్యునకు తెలియచేసి మన స్వామికి అవకాశం కల్పించాడు.
1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రారంభమైన సర్వమత మహాసభలో దేశ విదేశాలకు చెందిన వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 7వేల మంది శ్రోతలు ఉన్నసభలో స్వామి ప్రవేశించారు. అయితే అక్కడికి వచ్చిన వారందరు కూడా స్వామి వివేకానంద వేష ధారణ చూసి ఇతడు ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలు ఇక్కడికి వచ్చే అర్హత ఇతడికి ఉందా అన్నట్లుగా ఆయన్ని చూసారు. ఇంకా అక్కడ ఉన్నవారందిరిలో కంటే ఆయనే చిన్నవారు. దేశ విదేశాల నుండి వచ్చిన వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు అంత కూడా ఎం మాట్లాడాలి అనే దానిని ముందుగా ఒక ఉపన్యాసాన్ని సిద్ధం చేసుకున్నారు. కానీ ఒక స్వామి వివేకానంద దగ్గర మాత్రం ఎం మాట్లాడాలి అనేదానికోసం ముందుగా ఎటువంటి ఉపన్యాసం అనేది సిద్ధంగా లేదు. తన ప్రసంగాన్ని చివరగా ఉంచమని అద్యక్షడుకి విజ్ఞప్తి చేసాడు.
స్వామి వివేకానంద ప్రసగించాలంటూ అధ్యక్షుడు పిలిచినప్పుడు కనీసం ఎవరు కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించలేదు. ఇక స్టేజ్ మీదకు వెళ్లిన అయన ఉపన్యాసానికి ముందు అయన గురువు అయినా రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు. సాధారణంగా ఎవరైనా సభలో మాటాడేప్పుడు ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ మొదలుపెడతారు, కానీ స్వామి వివేకానంద మాత్రం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అఫ్ అమెరికా అంటే ఓ నా అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ఆత్మీయ సంబోధనతో ప్రపంచదేశాలకు భారతీయ సోదరభావాన్ని, ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. ఆయన ఆత్మీయ సంబోధన విని వేలాదిమంది లేచి రెండు నిమిషాలపాటు చప్పట్లతో ఆనందానుభూతిని వ్యక్తం చేశారు. చప్పట్ల శబ్దం ఆగిన వెంటనే తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు, అయన ప్రసంగంలో అరబిక్ లో, బ్రిటన్ ఇంగ్లీష్ లో, అమెరికన్ ఇంగ్లీష్ లో, బెంగాలీ, హిందీ ఇలా అనేక భాషల్లో అయన ప్రసంగాన్ని విన్న సభలో ప్రతి ఒక్కరు కూడా హవాక్కయారు.
ఆ తరువాత రోజు చికాగోలో ఏ న్యూస్ పేపర్ చూసిన మొదటిపేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో అయన గురించి ఎంతో గొప్పగా వ్రాసారు. ఆయన అనర్గళంగా చేసిన విశ్వజనీన ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు. అంతవరకు ఎవరికీ తెలియని స్వామి అసాధారణ ధార్మిక ప్రబోధకుడిగా కీర్తిగాంచారు. చికాగో వీధుల్లో వెలసిన ఆయన చిత్రపటాలకు వందనం చేయనివారు లేరంటే అతిశయోక్తికాదు. డిసెంబర్ 16న ఆయన మాతృభూమికి ప్రయాణమవుతుండగా ఆయనను వీడలేకనే అఖండ జనం ఆయనకు వీడ్కోలు పలికారు. మాతృదేశంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.అనంతరం 1899 జూన్ 20న కూడా మరోమారు పాశ్చాత్య దేశాలలో పర్యటనకు వెళ్లివచ్చారు. తన నలభయ్యవ పుట్టిన రోజును చూడబోనని స్వామీజీ సూచించినట్లుగానే 1902 జూలై 4వ తేదీన రాత్రి 9:10గంటలకు స్వామీజీ మహాసమాధి పొందారు.
జీవుడే దేవుడు అనేది అయన మంత్రం, పేదవారి సేవతో భగవంతుని సేవ అనే పదాన్ని ప్రతిపాదించాడు. ఇక అయన ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. ఈవిధంగా మతానికి కొత్త అర్థాన్ని, సేవకు పరమార్థాన్ని నిర్వచించి నరుడే నారాయణుడని, మానవసేవయే మాధవసేవ యని చాటి చెప్పిన మహోన్నత మూర్తి స్వామి వివేకానంద దేశ యువతకు సదా స్ఫూర్తిదాతగా నిలువాలని 1985లో భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా నిర్ణయించింది.