పురాతనమైన ఈ దేవాలయాన్ని సందర్శించి ఆలయంలో ఉన్న ఒక ఒక విగ్రహానికి తలని బాదుకుంటే తల నొప్పి తగ్గిపోతుందని భక్తుల నమ్మకం. మరి ఇలాంటి నమ్మకం ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ విగ్రహాం ఎవరిదని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నుంచి నెల్లూరు వెళ్లే మార్గంలో రాజంపేటకు కొన్ని కిలోమీటర్ల దూరంలో అత్తిరాల అనే గ్రామంలో త్రిదేశ్వరాలయం ఉంది. బహుధా నది ఒడ్డున త్రిదేశ్వరాలయంతో పాటు కామాక్షి ఆలయం ప్రసిద్ధమైనది. ఈ రెండు ఆలయాలు పురాతనమైనవిగా ఇచట ప్రసిద్ధి చెందినవి.
ఈ ఆలయం చాలా మహిమాన్వితమైనది. గయ క్షేత్రమంత పవిత్ర క్షేత్రముగా పేరు గాంచినది. ఈ ఆలయం కొండ దిగువన పరశురామాలయం కలదు. పక్కనే గదాధరస్వామి ఉన్నాడు. ఈ ఆలయం మీద నృత్య భంగిమ శిల్పాలు, రామ, కృష్ణ, విష్ణు, పరశురామ శిల్పాలు ఉన్నాయి.
అయితే ఇక్కడ మట్టిరాజుల కాలంలో ఉన్న ఏకా తాతయ్య విగ్రహం ఉంది. తలనొప్పితో బాధపడేవారు తమతలతో తాతయ్య తలకు పరస్పరం కొట్టుకుంటారు. ఇలా చేస్తే తలనొప్పి పోతుందని వారి విశ్వాసం. అంతేకాకుండా భర్తలు, భార్యలు చనిపోయిన సంవత్సరంలోపు వారు ఈ క్షేత్రాన్ని తప్పకుండ దర్శిస్తారు. ఆడవారు ప్రధానంగా కామాక్షిదేవిని దర్శిస్తారు.
ఈ ఆలయ కొండపైన జ్యోతిస్తంభం ఉంది. శివరాత్రి నాడు ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారు. మాఘమాసంలో మహాశివరాత్రి ని పురస్కరించుకొని ఉత్సవాలు, పూజలు చాల వైభవంగా జరుగుతాయి. ఇంకా కార్తీక మాసంలో ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర ఎంతో గొప్పగా జరుగుతుంది. జాతర సమయంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.