Home People The Father of the Indian Unrest, Bal Gangadhar Tilak

The Father of the Indian Unrest, Bal Gangadhar Tilak

0

భారత స్వాతంత్ర్యోద్యమంలో అత్యధిక ప్రజాధారణ పొందిన వ్యక్తి, జాతీయవాది, దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఉద్యమంలో పాల్గొనేలా చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు,  సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి ప్రప్రథమ నాయకుడు బాలగంగాధర తిలక్. భారతదేశం అతడిని భారతజాతీయోద్యమ పిత అని లోకమాన్య తిలక్ అని ముద్దుగా పిలిచుకుంటే, Father of Indian unrest గా విమర్శలను ఎదుర్కొన్నారు. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో అయన కూడా ఒకరు. అయితే  LLB పూర్తిచేసిన తిలక్ గణిత, ఖగోళశాస్రం, హిందుత్వంలో ఘటికుడు. అయితే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ బతికించడంకోసం కోసం జర్నలిస్ట్ గా మారి పత్రికలను స్థాపించి తన ఆలోచనలను అక్షరూపంలో ఆయుధంగా మార్చాడు. మరి ఏదైనా ముక్కుసూటిగా చెప్పే తిలక్ భారతదేశానికి కావాల్సింది స్వేచ్ఛ కాదు స్వరాజ్యం అని ఎందుకు అన్నారు? ఆ ఉద్యమంలో అయన పోరాటం ఎలా సాగింది? అసలు అయన ఉద్యమం వైపు ఎందుకు వచ్చారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో 1856 జులై 23 వ తేదీన గంగాధర్ రామచంద్ర తిలక్, పార్వతి భాయ్ గంగాధర్ దంపతులకి బాలగంగాధర తిలక్ జన్మించారు. అయన తండ్రి ఒక సంస్కృత పండితుడు మరియు మంచి ఉపాధ్యాయుడు. వీరిది ఒక మద్యతరగతి కుటుంబం. చిన్నతనం నుండి తిలక్ గారు చాలా చురుకైన విద్యార్ధి. ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించే వారు కాదు. నిజాయితితో పాటు ముక్కుసూటిగా మాట్లాడే మనస్త్వత్వం ఆయనది. తిలక్ గారికి పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. ఇది అయన జీవితంలో ఒక  పెనుమార్పు అని చెప్పవచ్చు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. ఇక మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తన చదువును కొనసాగించి L.L.B. పట్టా కూడా పొందారు.

అయితే చదువు పూర్తైన తరువాత పుణేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. ఆ తరువాత ఒక కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేసారు. ఇలా పనిచేస్తున్నప్పుడు దేశంలో విద్యలో మార్పులు రావాలని భావించారు. పాశ్యత్త విద్యని వ్యతిరేకించి భారతీయులకు సరైన విద్య అందించాలనే ఉద్దేశంతో స్నేహితుల సహాయంతో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించాడు. యువకులకు విద్య బుద్దులతో పాటు స్వరాజ్య ఆకాంక్ష, భారతీయ సంస్కృతి పైన అవగాహనా కల్పించారు. ఇక ఉపాధ్యాయుడిగా అందరిలో ఒక ఆలోచన తీసుకురావడం సాధ్యం కాదని అయన జర్నలిస్ట్ గా మారారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ని బ్రతికించడం కోసం తన సొంత ఖర్చులతో మరాఠా అనే ఆంగ్ల పత్రిక ని, కేసరి అనే మరాఠీ పత్రిక లని స్థాపించారు. ఈ పత్రికల ద్వారా తన మనసులోని భావాలను అక్షరరూపంలో తీసుకువచ్చి ప్రజల్లోకి ఆయుధంలాగా అప్పటి బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశారు.  అప్పట్లో ఇది ఒక సంచలనం. అయితే 1897 వ సంవత్సరంలో తిలక్ గారి పైన రాజద్రోహానేరం మోపి దోషిగా నిరాదరించడంతో అయన రాష్ట్ర స్థాయి నుండి జాతీయ నాయకత్వ స్థాయికి ఎదిగారు.

ఇలా తన పోరాటానికి రాజకీయ రూపం ఇవ్వాలని 1890 లో కాంగ్రెస్ లో చేరారు. భారతీయులకి కావాల్సింది స్వేచ్ఛ కాదు స్వరాజ్యం అని నిలదించగా తనకి కాంగ్రెస్ నుండి సరైన మద్దతు లభించకపోవడంతో కాంగ్రెస్ పైన నమ్మకం పోయింది. ఇక చట్టబద్ధంగా ఆడపిల్లల వయసు 10 నుండి 12 కి పెంచాలని పోరాటం చేసి విజయం సాధించారు. అయితే వీటన్నిటికీ హిందుత్వం తో ముడిపెడుతుండటంతో తిలక్ గారిని ఒక వితండ హిందువాదిగా ముద్రవేశారు. అయినా తన దేశం, తన జాతి, తన సంస్కృతి కాపాడటం తన బాధ్యత అని బహిరంగంగా చెప్పి హిందూ జాతీయవాదానికి బీజాలు వేశారు.

ఇక 1897 లో ముంబై లో ప్లేగు వ్యాధి ఎంతో మంది ప్రాణాలను తీసింది. అయితే ఈ వ్యాధి పూణెకి సోకకుండా ఉండటం కోసం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం, వేరే ప్రాంతాలకి బలవంతగా తరిమికొట్టడం జరిగినపుడు, తిలక్ గారు తన కేసరి పత్రికలో శత్రువులను సంహరించడం ధీరత్వం అంటూ కొన్ని ఉదహరిస్తూ అయన కొన్ని వ్యాసాలను ప్రచురించారు. ఆ మరుసటి రోజే పూణే కలెక్టర్ ని, అతడి సిబ్బందిని కొంతమంది దుండగులు హతమార్చారు. అయితే తిలక్ గారి వ్రాసిన వ్యాసం కొంతమందిని ఉసిగొలిపింది అనే కారణంతో నేరస్తుడిగా చేసి 18 నెలల పాటు జైలు శిక్ష విధించారు. దీనితో అయన జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అప్పుడే స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అనే నినాదం వచ్చింది. ఈ నినాదంతో తిలక్ గారి పేరు భారతదేశం అంత వ్యాపించింది.

ఇతరులతో పోలిస్తే తిలక్ గారి ఆలోచనలు చాలా బిన్నంగా ఉండేవి. అయితే అప్పటికి అతివాద ఉద్యమాలు తారస్థాయిలో ఉండటం తన రచనల్లో వీటిని సమర్దించడం తో తిలక్ ని కూడా అతివాదుడు అనే ముద్ర పడింది. ఇక 1907 లో జరిగిన సూరత్ కాంగ్రెస్ సమావేశం తిలక్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆధునిక భావాలు ఉన్న గోపాలకృష్ణ గోఖలే తిలక్ భావజాలంతో తిలక్ విభేదించారు. ఇదే సందర్భంలో తిలక్ కి బాసటగా నిలిచినా బిబిన్ చంద్రపాల్, లలాగజపతిరాయ్ లను గరమ్ దళ్ గా ముద్ర పడ్డారు. వీరి తిరుగుబాటుతో జాతీయ ఉద్యమం బలహీనపడుతుందని చాలా మంది భయపడ్డారు. వీరి కలయికే లాల్, బాల్, పాల్ గా ప్రసిద్ధి చెందింది. అయితే సురత సమావేశం తరువాత కాంగ్రెస్ లో చీలిక వచ్చింది. కాంగ్రెస్ గరమ్ దళ్, నరమ్ దళ్ గా విడిపోయారు. గరమ్ దళ్ గా ముద్రపడ్డ లాల్, బాల్, పాల్ ని విమర్శించడం మొదలుపెట్టారు. ఒకానొక సమయంలో వీరి సమూహాన్ని కాంగ్రెస్ పట్టణ క్యాన్సర్ అని దానికి శస్త్ర చికిత్స చేయాలంటూ తీవ్రంగా విమర్శించారు.

అయితే 1908 ఏప్రిల్ లో ఇద్దరు బెంగాలీ యువకులు ఒక జడ్జ్ పైన బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ బాంబ్ దరిదప్పి పక్కన నడుచుకుంటూ వెళుతున్న కొందరు మహిళలు మరణించారు. ఈ సమయంలో బెంగాలీ యువకులను సమర్థిస్తూ తిలక్ తన కేసరి పత్రికలో ఒక కథనాన్ని ప్రచురించారు. సంపూర్ణ స్వరాజ్యంలో సమిధులైన వారు వీరులంటూ అందులోని విప్లవ భావాలను జొప్పించారు. దీనితో బ్రిటిష్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకొని దేశ బహిష్కరణ చేస్తూ ఆరేళ్ళ పాటు జైలు శిక్షని విధించారు. ఇలా 1914 వరకు బర్మా జైలులో నిర్బధించారు. జైలులో ఉన్నపుడే గీతారహస్యం అనే పుస్తకం వ్రాసారు. ఈ పుస్తకము అమ్మకంతో వచ్చిన డబ్బుని స్వతంత్ర పోరాటానికి వెచ్చించి తన దేశభక్తిని చాటారు. ఇంకా ఎన్నో వ్యాసాలను జైలులో ఉన్నప్పుడు వ్రాసారు. ఇక 1914 జూన్ 8 వ తేదీన ఆయన దేశ బహిష్కరణ శిక్ష పూర్తయినట్లు తెలిపారు. కానీ అప్పటికి అయన వయసు 59 ఉండటంతో అయన ఆరోగ్యం దెబ్బతిన్నది. అయినప్పటికీ భారతదేశం తిరిగి రాగానే మళ్ళీ ఉద్యమంలోకి దూకారు. అయితే 1916 లో తిలక్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు.

ఇంగ్లీష్ భాషకు యువత ఆకర్షితులు కాకుండా హిందీ జాతీయ భాషగా గుర్తించి అసలు దేశంలో ఇంగ్లీష్ బాషా లేకుండా చేయాలనీ భావించారు. అందులో జాతీయ బాషా హిందీ ని చేయడంలో సఫలీకృతం అయ్యారు. ఇలా తన స్వరాజ్య ఉద్యమంలో ముందుకు వెళ్తున్న తరుణంలో స్వాతంత్రోద్యమం లో కొత్త యుద్దానికి గాంధీజీ పిలుపునిస్తున్నారు. గాంధీజీ తన తొలి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించేందుకు ఒక రోజు ముందు 1920 ఆగస్టు 1 న  బాలగంగాధర తిలక్ గారు స్వర్గస్థులయ్యారు. దీంతో భారత స్వాతంత్ర సంగ్రామ రాజకీయ చరిత్రలో ఒక శకం ముగిసింది.

స్వరాజ్యం నా జన్మహక్కు అంటూ సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి ప్రప్రథమ నాయకుడిగా నిలిచినా స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, భారతజాతీయోద్యమ పిత బాలగంగాధర తిలక్ గారికి జోహార్లు.

Exit mobile version