మొఘల్ రాజులతో పోరాడిన గొప్ప యుద్ధ వీరుడు, గెరిల్లా యుద్దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యుద్ధ తాంత్రికుడు, స్వతంత్ర సామ్రాజ్య మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన వీరుడు, భవాని దేవి ఆశీస్సులతో ఎన్నో కోటలని స్వాధీనం చేసుకొని అన్ని మతాల వారిని సమానంగా చూసిన గొప్ప మంచి మనసు ఉన్న రాజు ఛత్రపతిశివాజీ. మరి ఛత్రపతి శివాజీ గారి గురువు ఎవరు? అయన జీవసమాధి పొందన స్థలం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర, సజ్జనగర్ కి దగ్గరలో సమర్థ రామదాసు ఆలయం ఉంది. ఛత్రపతి శివాజీ గారి గురువు సమర్థ రామదాసు. ఈయన మహారాష్ట్రలో క్రీ.శ. 1607 లో జన్మించారు. ఛత్రపతి శివాజీ గారి దగ్గరికి ఈయన 1649 లో వెళ్లగా అప్పడూ రామదాసు గారిని చూసిన శివాజీ మహారాజ్ వెంటనే అయన పాదాలను తాకి గురువుగా స్వీకరించారు. శివాజీ మహారాజ్ మరణించిన తరువాత శివాజీ మహారాజ్ కుమారుడైన శంభాజీని ఆశీర్వదించి రామదాసు గారు రాజుగా సింహాసనాన్ని ఎక్కించారు.
ఇక క్రీ.శ. 1682 సంవత్సరంలో సజ్జనగడ్ ప్రాంతంలో ఉన్న కొండపైన ఆలయాన్ని నిర్మించి, తంజావూరు నుంచి సీతారామలక్ష్మణుల విగ్రహాలను తెప్పించి ఈ ఆలయంలో ప్రతిష్టించారు. ఈ ఆలయంలోనే సమర్థపీఠము ఉంది. ఈ ఆలయం రెండుఅంతస్థులుగా ఉండగా, ఒక అంతస్థులో సీతారామలక్ష్మణులు దర్శనమిస్తుండగా, రెండవ అంతస్థులో సమర్థ రామదాసు ఆలయం ఉంది. అయితే రామదాసు గారు 1682 లో తన గదిలోనే సమాధి స్థితులోకి వెళ్లి సిద్ధిపొందారు. ఇక ఈ ఆలయంలోనే ఒక చిన్న గదిలో రామదాసు గారు ఉపయోగించిన వస్తువులను ఇప్పటికి మనం ఇక్కడ చూడవచ్చు.
ఈవిధంగా శివాజీ మహారాజ్ గారి గురువైన సమర్థ రామదాసు గారు సమాధిస్థితిలోకి వెళ్లిన ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.