పూర్వం బ్రహ్మదేవునికి అయిదు తలలుండేవి. ఒకప్పుడు – బ్రహ్మకూ, శివునికి మాటపట్టింపువచ్చి నేను అధికుడనంటే – నేను అధికుడననే అహంకారం ప్రబలమైంది. ‘నేను వచ్చిన తరువాతనే, ఈ సృష్టిలో కొచ్చిన నువ్వు నాకంటే అధికుడవెలా అవుతావు? చూశావా! నాకు ఐదు శిరసులున్నాయి’ అన్నాడు బ్రహ్మ. ‘నేనూ చూపించగలను ఐదుతలల్నీ! అంటూ శివుడు తన పంచముఖాన్ని చూపించాడు.
ఆ పంచముఖాలూ : 1. సద్యోజాత, 2. వామదేవ, 3. అఘోర, 4. తత్పురుష, 5. ఈశాన.
దేవతలకు ఎన్నడూ ఐదు ముఖాలు వరుసగా ఉండవు. నాలుగు దిక్కులకు నాలుగు, ఊర్థ్వముగా (పైకి)చూస్తున్నట్టు ఇంకొకటి ఒక పుష్పాకృతిలో ఈ ముఖాల అమరిక ఉంటుంది. కనుకనే సర్వదిక్కులనూ, సర్వ విశ్వాన్నీ వీక్షించే ఆ మహాశివుడు సర్వతోముఖుడు అనే పేరుతో కూడ సుప్రసిద్థుడు. ఆయనకు తెలియని అంశంగాని, ఆయన వివరించలేని అంశంగాని లేవు. ఎవరేది ఎంత దాచాలన్నా సర్వేశుని వద్ద దాచలేరు.
బ్రహ్మకు ఆ విధంగా శివపంచముఖ దర్శనం కలిగినప్పటికీ, అసూయకొద్ధి ఈశ్వరునింకా రెచ్చగొట్టాడు. తన శిరస్సులే సహజమైన వన్నాడు. శివునికి తలలు నీటి బుడగల్లాంటివని పోల్చి, అవి కాస్సేపటికే పేలిపోగలవని నిందించాడు.
దాంతో పరమశివుడు నిజంగానే ఉగ్ర అవతారుడైయ్యాడు. కేవలం కొనగోట, బ్రహ్మ ఐదో శిరస్సు త్రుంచేశాడు. తలను ఉత్తమాంగం అన్నందవల్ల – అదిలేకుంటే మిగతా శరీరం మరణించినట్టే భావించబడుతున్నందు వల్ల శివునికి తక్షణమే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అది ఆ మహాశివుణ్ణి సైతం అలాగే వదలకుండా పట్టుకుంది. కొనగోట అంటుకున్న బ్రహ్మయొక్క ఐదో శిరస్సు ఎంతకూ ఊడిపడదు.
ఈలోగా బ్రహ్మ కోపంలోంచి, మహాతేజోరూపుడైన ఓ వీర పురుషుడు జన్మించాడు. బ్రహ్మ అతడితో శివుని సంహరించమని ఆదేశించాడు. అతడు శివుని ఎగాదిగా చూసి ‘ఇతడి వంటి బ్రహ్మహత్యా పాతకుని చంపి నేను పాపాత్మున్ని కాదల్చుకోలేదు!.. తండ్రీ! నన్ను మన్నించు!, అని అక్కడినుంచి నిష్క్రమించాడు.
చివరికి నారాయణుని బోధతో, వారణాసీ పురాన్ని తాకుతూ పారుతున్న గంగానది సర్వపాపహారిణి కనుక అందులో స్నానం చేసి పాతకం పోగొట్టుకున్నాడు. అక్కడి బదరికాశ్రమ సమీపంలో శివుని గోటినంటుకున్న బ్రహ్మకపాలము కూడా ఊడిపడిపోయింది. అదే నేటి బ్రహ్మకపాల పుణ్యక్షేత్రం.