సృష్టికి మూలం.. భవిష్యత్ జగతికి మార్గం.. ఆ ఆది శక్తే…!

హిందూమతం లేదా హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం.దీనినే ‘సనాతన ధర్మం’ అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. హిందూ ధర్మంలో స్త్రీ కి ఎంతో గౌరవమైన స్థానం ఉంది.
సృష్టికి మూలం.. భవిష్యత్ జగతికి మార్గం.. ఆడదే ఆధారం.. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది. అయితే స్త్రీలు ఎప్పుడు పురుషులకు అనుచరులుగా పరిగణిస్తారు. ఇది ఏదేశంలోనైన మరియు ఏ సంస్కృతిలోనైనా పురుషులతో స్త్రీలను పోలిస్తే, మహిళల స్థానం ఎప్పుడూ ప్రామాణికంగా ఉంటుంది. అనేకమంది మహిళలు తమ హక్కులకోసం పోరాటం సాగించారు.
ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోను మహిళల్ని అణచివేయడం గమనించవచ్చు. వారు సంఘ పరంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటారు. ఇక ఆధ్యాత్మికంగా స్త్రీలకు ఎన్నో విధి నిషేధాలు ఉన్నాయి. కాని, భారతదేశంలో, అందునా ఆర్య సంస్కృతిలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నిజమైన సాంప్రదాయాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించలేరు. అదే భారతీయ సంస్కృతి విశిష్టత.
ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా స్త్రీది విశిష్ట స్థానమే. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎందరు ఉన్నా ఆదిపరాశక్తిదే అగ్రస్థానం. హిందూ మతంలో శక్తివంతమైన దేవుళ్ళు చాలా మందే ఉన్నారు. వారిని అమితంగా పూజిస్తారు. గౌరవిస్తారు. హిందుదేవతల్లో అనేక మంది అత్యంత శక్తివంతమైన దేవతల్లో..నీరు(గంగ దేవత), ఆహారం(అన్నపూర్ణ) చదువులతల్లి(సరస్వతి)మరియు డబ్బు(లక్ష్మిదేవి)ఇలా ఒక్కొక్కరి ఒక్కో సొంత పురాణాలు మరియు కథలు ఉన్నాయి.. వీరు శక్తివంతమైన దేవుళ్లు మాత్రమే కాదు అద్భుత శక్తులు కలవారు.

లక్ష్మీ దేవి:

మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి . ఆవిడ అనుగ్రహాన్ని కోరుకునే వారుండరు. సర్వ సంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు.

దుర్గా దేవి :

దుర్గా దేవి శక్తి స్వరూపిని. దుర్గాదేవికి మరో పేరు భవాని, అంబా, ఛండిక, పార్వతి, వైష్ణోదేవి ఇలా వివిధ రకాల పేర్లు ఉన్నాయి ఈమె అత్యంత శక్తి వంతమైన శక్తులను కలిగి ఉంటుంది. ఆమె చేతులలో వివిధ రకాల ఆయుధాలుంటాయి. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

కాళీకా దేవి:

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు. కృష్ణవర్ణంతో ప్రకాశించె శ్రీ కాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. అశ్యయుజ మాసం కృష్ణపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. కాలస్వరూపిణిగా ఖ్యాతి పొందిన శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయసంప్రదాయంలో చెప్పబడినది. తంత్రోక్త మార్గంలో శ్రీ కాళికామహావిద్యని ఆరాధిస్తే సకల రోగాలనుంచి, బాధల నుంచీ విముక్తి, శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజ్యత సాధకుడికి లభిస్తుంది.

సర్వస్వతీ దేవి:

హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR